2011 నుంచి సుమారు నాలుగేళ్లు అంటే 2014 వరకు శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాద్ షా (వాస్తవానికి ఇది కాస్ట్ ఫెయిల్యూర్ మాత్రమే), రామయ్యా వస్తావయ్యా, రభస ఇలా అయిదు పరాజయాలు. అదే సమయంలో 2014లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం. ఆ పార్టీతో ఎన్టీఆర్ దూరంగా వున్నారని, లేదా ఆ పార్టీ ఎన్టీఆర్ ను దూరం పెట్టిందని వార్తలు.
ఇలా ఇన్ని నెగిటివ్ పాయింట్లు చుట్టుముడితే ఆ హీరో ఎంత తల్లకిందలైపోతాడు? కానీ ఎన్టీఆర్ ఏమీ అయిపోలేదు. మౌనం వహించాడంతే. తనపై ఎన్నివార్తలు వినిపించినా సమాధానం ఇవ్వలేదంతే. అలాంటి టైమ్ లో టెంపర్ సినిమా. ఓ చిన్న ఊపిరి ఊదింది. ఆపై నాన్నకు ప్రేమతో నిలబెట్టేసింది. జనతాగ్యారేజ్ పరుగులు పెట్టించింది. ఇదంతా జస్ట్ రెండేళ్లలో. ఒకే ఏడాది నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ విజయాలు వరించాయి. అంతే మళ్లీ ఎన్టీఆర్ ట్రాక్ మీదకు వచ్చేసాడు.
జై లవకుశ, త్రివిక్రమ్ సినిమా, కొరటాల సినిమా లైన్ లోకి వచ్చాయి. ట్రాక్ బాగుంది. ఇక ఎన్టీఆర్ కు ఢోకాలేదన్న వార్తలు వినిపించడం ప్రారంభించింది. అదిగో అప్పుడు వచ్చింది బిగ్ బాస్ షో. ఎలా వచ్చిందో? ఎవరికి పుట్టిన ఐడియానో? ఎన్టీఆర్ ను హోస్ట్ గా తీసుకోవాలన్నది. ఆ ఒక్కటి ఇప్పుడు ఎన్టీఆర్ తను తెలుగు ఇంటి స్వంత మనిషిగా మార్చేసింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్ లో చేసిన సినిమాలు ఒకఎత్తు. బిగ్ బాస్ షో ఒకఎత్తు. ఓ టీవీ షో తెలుగులో మరే నటుడిని జనాలకు ఇంతలా దగ్గర చేయలేదేమో? అంత దగ్గర చేసేసింది ప్రేక్షకులకు ఎన్టీఆర్ ను బిగ్ బాస్ షో.
నిజానికి ఈ షో ను ఇలా హోస్ట్ చేయాలన్నది నిర్వాహకుల అయిడియా ఒక లైన్ వరకు మాత్రమే వుంటుంది. దాన్ని ఆచరణలోకి తేవాల్సింది ఎన్టీఆర్ నే. కానీ అక్కడే ఎన్టీఆర్ అవుట్ ఆఫ్ ది బోర్డ్ వెళ్లిపోయాడు. తొలిరోజు ఓపెనింగ్ షో చూసిన వారు ధన్ రాజ్ సూట్ కేసు ఎన్టీఆర్ మోయడం ఏమిటి ? అబ్బే.. అనేసారు. కానీ అప్పుడు తెలియలేదు. ఎన్టీఆర్ తను నేలమీదకు వచ్చి, షోను గాల్లోకి లేపుతూ, ఆపైన తను అంత ఎత్తున నిల్చోవడానికి ఎత్తు వేస్తున్నాడని.
అక్కడి నుంచి ప్రతివారం బిగ్ బాస్ షోలో ఎంత చేయాలో అంతా చేసాడు ఎన్టీఆర్. ఒక్కమాటలో చెప్పాలంటే స్టేజ్ మీద చెడుగుడు ఆడేసాడు. నవ్వించాడు. కవ్వించాడు. అదలించాడు. ఒక్కోసారి గుండెలు టచ్ చేసాడు. చిన్న పిల్లాడైపోయాడు. అన్నింటికి మించి హీరో అన్నది మరిచిపోయాడు. అదే అసలైన పాయింట్. తను హీరో. తను ఇలాగే వుండాలి. ఇలా వుండకూడదు అని కనుక ఎన్టీఆర్ పెట్టుకుని వుంటే, షో సంగతి అలా వుంచితే ఇప్పుడు ఇంతలా మాట్లాడుకునే పరిస్థితి వుండేదికాదు.
మీలో ఎవరు కోటీశ్వరుడు విషయంలో నాగార్జున రెండు మూడు మెట్లు కిందకి దిగివస్తే, బిగ్ బాస్ లో ఎన్టీఆర్ అస్సలు మెట్లు అన్నవి మిగల్చకుండా కిందకు వచ్చి నిల్చున్నాడు. ఇప్పుడు జనాలకు ఎన్టీఆర్ పరాజయ సినిమాలు అస్సలు గుర్తులేవు. ఆ మాటకు వస్తే ఇళ్లలో ఉండే గృహిణులకు ఎన్టీఆర్ సినిమాల సంగతే గుర్తురావడం లేదు. కేవలం కళ్లముందు ఓ కుర్రాడు చెంగు చెంగున గంతులేస్తూ, గలగలా మాట్లాడేయడం మాత్రం కనిపిస్తోంది. అమ్మాయిలను ఎన్టీఆర్ నవ్వు కట్టిపడేస్తోంది.
మొత్తం సినేరియానే మారిపోయింది. ఎన్టీఆర్ ను కాకుండా మరే హీరోను బిగ్ బాస్ షోకి తీసుకుంటే ఎలా వుండి వుంటుంది అన్న ఆలోచనలకు ప్రేక్షకులకు సమాధానం దొరికే అవకాశమే లేకుండా పోయింది. ఎన్టీఆర్ చూపించేసిన షోను మరో హీరోతో ఊహించుకోవడానికే కుదరడంలేదు. ఎందుకంటే మన హీరోలంతా పబ్లిక్ లైఫ్ లో రిజర్వ్ డ్ గానే వుంటారు. ఇళ్లలో, సన్నిహితులతో ఎలా వుంటారో కానీ, బయట మాత్రం చాలా సీరియస్ లుక్స్ తో వుంటారు. ఒక్క బన్నీ మాత్రం కాస్త మినహాయింపు. బయట కూడా కాస్త నవ్వులు పూయించడం బన్నీకి అలవాటు వుంది.
స్మయిల్ బాగుంటుంది అనే మహేష్ బాబు కూడా ఫంక్షన్ లకు వస్తే అప్పుడప్పుడు నవ్వుతారు కానీ మిగిలిన టైమ్ అంతా సీరియస్ లుక్స్ తోనే వుంటారు. పవన్ తన నవ్వు దాచుకుంటూ సిగ్గుపడుతుంటారు. రామ్ చరణ్ సీరియస్ గానే వుంటారు. ఇలా దాదాపు అందరూ పబ్లిక్ లో తన జోవియల్, ఈజ్ స్టయిల్ ను దాచుకుంటారు ఎందుకో? కానీ ఎన్టీఆర్ అదే బయటకు తీసాడు. జనానికి తనను అదే దగ్గర చేస్తుందని అతనికి ఎవరైనా చెప్పారో? తనే గ్రహించాడో? స్టేజ్ మీద చిన్నపిల్లాడైపోయి చేసిన అల్లరి, మిమిక్రీ, స్పాంటేనియస్ వ్యవహారాలు అన్నీ కలిసి ఇప్పుడు ఎన్టీఆర్ ను తెలుగింటి బిగ్ బాస్ ను చేసేసాయి.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమిటి? ఎవరైనా మళ్లీ ఎన్టీఆర్ ను దగ్గరకు తీయాల్సిందే. అయితే ఎన్టీఆర్ లో బిగ్ బాస్ లో చూసిన చిన్న పిల్లాడే కాదు, లోపల ఒరిజినల్ గా వుండే పరిణితి చెందిన పెద్ద మనిషి అలాగే వున్నాడు. ఎత్తుపల్లాలను చూసిన ఒరిజినల్ అలాగే వుంది. అందుకేనేమో? జై లవకుశలో ఆ డైలాగు.
'మ.. మ .. మనం అన్నది అబద్దం.. నేను అన్నది నిజం'.
ఇక మిగిలింది ఒక్కటే. జై లవకుశ సినిమా హిట్ అయితే చాలు. ఎన్టీఆర్ ఎక్కడో వుంటాడు. ఆ తరువాత వున్నవి త్రివిక్రమ్, కొరటాల శివ సినిమాలు. ఆపైన రాజమౌళి కన్ను ఎన్టీఆర్ పై వుండనే వుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
పడిలేచిన కెరటం అన్న తెలుగు పదానికి ఈ బుడ్డోడే ఉదాహరణ అనుకోవాలి.