ఆంధ్రుల హక్కు ఘనమైన ఉక్కు పరిశ్రమను ఓ వైపు కేంద్రం ప్రైవేట్ పరం చేసేందుకు ఢిల్లీలో రెడీ అయిపోతోంది. మరో వైపు మాత్రం తుక్కు రాజకీయం విశాఖ గల్లీలో విజయవంతంగా సాగిపోతోంది.
విశాఖ ఉక్కుని పరిరక్షించుకునేందుకు అంతా కలసి పోరాడాలన్న సోయి రాజకీయ నేతలకు లేకుండా పోయింది. ఇక ఇందులో కూడా స్వార్ధాలను ఓట్ల రాజకీయాలను చూసుకుంటున్నారు. విశాఖ వచ్చిన చంద్రబాబు ఉక్కు పోరాటం గురించి చెప్పకుండా వైసీపీ మీద బురద జల్లేసి వెళ్ళిపోయారు.
ఇక ఇపుడు కాంగ్రెస్ వంతు వచ్చిందేమో. పీసీసీ చీఫ్ శైలజానాధ్ విశాఖ ఉక్కు పరిశ్రమ గురించిన పోరాటం సంగతి పక్కన పెట్టి బీజేపీ వైసీపీ కలసి కుట్ర పన్ని ఉక్కు పరిశ్రమను అమ్మేస్తున్నాయంటూ పేలవమైన విమర్శలు చేస్తున్నారు. పాదయాత్రలు ఇక్కడ ఎందుకు ఢిల్లీలో చేయాలంటూ అచ్చం బాబు మాదిరిగానే గర్జిస్తున్నారు.
దీని మీద మండిపోయిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అయితే శైలజానాధ్ కమెంట్స్ మీద గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మేమేదో మాకు తోచిన తీరున పోరాడుతున్నాం, మీరు మాత్రం ఎక్కడా పోరాటం చేయకుండా మమ్మల్ని టార్గెట్ చేయడమేంటి అంటూ తాజాగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు.
మీకు పార్లమెంట్ లో మా కంటే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు కదా. మరి మీరేం చేస్తున్నారు. కేంద్రంలో పోట్లాడి ప్లాంట్ ని రక్షించవచ్చు కదా అంటూ బాగానే లాజిక్ పాయింట్ తీశారు. మొత్తానికి ఏ ఉక్కు అయితేనేం, తుక్కు రాజకీయం చేస్తే చాలు అన్నట్లున్న రాజకీయ పార్టీల వైఖరి విశాఖ జనాలకు బాగానే అర్ధమైపోయిందిగా.