విశాఖ కేంద్రంగా రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. విశాఖ ఇపుడు పొలిటికల్ క్యాపిటల్ గా మారిపోయింది. ఒక వైపు స్టీల్ ప్లాంట్ ఉద్యమం సాగుతోంది. మరో వైపు ఏపీలోనే అతి సిటీగా ఉన్న విశాఖలో మేయర్ సీటు కోసం ఎన్నిక వచ్చే నెల జరగనుంది.
ఇక వైసీపీ సర్కార్ ఎటూ విశాఖను పాలనారాజధానిగా చేయబోతోంది. దాంతో విశాఖ మీద అందరి చూపూ ఉంది. ఈ నేపధ్యంలో విశాఖ మరోసారి వేడి వేడి రాజకీయానికి కేంద్ర బిందువుగా మారబోతోంది.
మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన స్పీకర్ ఫార్మెట్ లోనే రెండవ సారి తన రాజీనామా పంపించారు.
అది అసెంబ్లీ కార్యదర్శి వద్ద ఇపుడు ఉంది. మరో వైపు స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా గంటా తో ఫోన్ ద్వారా మాట్లాడి ఆయన రాజీనామాను కన్ ఫర్మ్ చేసుకున్నారు. దీంతో గంటా రాజీనామా విషయంలో స్పీకర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు అని తెలుస్తోంది.
స్పీకర్ కనుక గంటా రాజీనామా ఆమోదిస్తే ఆరు నెలలు తిరగకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అక్కడ ఎన్నికలు వస్తాయి. ఇదిలా ఉండగా ఇప్పటి నుంచే విశాఖ ఉత్తరాన్ని వైసీపీ టార్గెట్ చేసింది. ఎంపీ విజయసాయిరెడ్డి సహా మంత్రి, ఇతర పెద్దలు అక్కడ పూర్తి దృష్టి పెట్టారు.
ఎపుడు ఎన్నికలు జరిగినా కూడా ఈసారి ఉత్తరాన్ని వైసీపీ కైవశం చేసుకుంటుంది అంటున్నారు. మొత్తానికి అధికార పార్టీ ఉత్తరంలో చేస్తున్న హడావుడి చూస్తే తొందరలోనే ఉప ఎన్నిక వచ్చేలాగా సీన్ కనిపిస్తోంది.