విజన్ 2020, విజన్ 2040 అంటూ చంద్రబాబు రెచ్చిపోవడమే కానీ.. అసలైన విజన్ ని ఆయనెప్పుడూ చూపించలేదు, అసలాయనకంత సీన్ లేదు. అయితే విజన్, గిజన్ అనే పేరు లేకుండానే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు సీఎం జగన్.
అలాంటి మరో సంచలనానికే ఇప్పుడాయన సిద్ధమవుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా.. ప్రభుత్వానికి అదనపు భారం అనుకున్నారంతా. కానీ ఆ భారాన్నే.. బాధ్యతగా తీసుకున్న జగన్ ఆర్టీసీని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ లన్నీ ఇకపై షాపింగ్ మాల్స్ లాగా కళకళలాడపోతున్నాయి. గత ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నా.. అది పట్టాలెక్కలేదు. అయితే జగన్ మాత్రం అధికారికంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి దీనికి మార్గం సుగమం చేశారు.
ఇకపై ఆర్టీసీ బస్టాండుల్లో ఆప్కో చేనేత వస్త్ర దుకాణాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఎంపిక చేసిన 15 ప్రధాన బస్టాండుల్లో వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. ఆ తర్వాత అమూల్ సంస్థ పాల ఉత్పత్తుల అమ్మకం కేంద్రాలకు కూడా ఆర్టీసీ చోటు కల్పించబోతోంది.
ఇప్పటికే విశాఖపట్నం ద్వారకా బస్టాండ్ లో మత్స్యశాఖకు ఓ స్టాల్ కేటాయించిన అధికారులు, రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరించాలనుకుంటున్నారు. ప్రభుత్వరంగానికి చెందినవే కాదు, ప్రైవేటు వారికి కూడా బస్టాండుల్లో చోటు కల్పించబోతున్నారు.
ఇప్పటి వరకూ వాటర్ బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లే బస్టాండుల్లో కనిపించేవి. ఇకపై అవి షాపింగ్ మాల్స్ గా మారబోతున్నాయనమాట. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో నగరం నడిబొడ్డునే బస్టాండ్ లు ఉంటాయి. వాటి చుట్టుపక్కల షాపింగ్ విస్తరించి ఉంటుంది. బస్టాండ్ లో ఉన్న రద్దీని ఉపయోగించుకుంటే ఆర్టీసీకి మరింత లాభం. కానీ ఇప్పటి వరకూ ఎవరూ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. జగన్ విజన్ తో ఇప్పుడు ఆర్టీసీ రూపు రేఖలు మార్చుకుంటోంది.
ఇటీవల టికెటింగ్ వ్యవస్థను మొత్తం ఆన్లైన్ చేసేలా నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు, ఇప్పుడు బస్టాండ్ ల ను ఆధునిక షాపింగ్ మాల్స్ లాగా తీర్చిదిద్దబోతోంది. దీంతో కేవలం టికెట్లపై వచ్చే ఆదాయమే కాకుండా.. ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరుతోంది. ఆర్థిక కష్టాలనుంచి గట్టెక్కుతుంది.