ప్రొఫెసర్.. అంటే, మాట ఎంత స్పష్టంగా వుండాలి.? ఆ మాటలో ఎంత నిదానం వుండాలి.? ఆ మాట ఎంత సూటిగా వుండాలి.? ఆ మాట ఎంత బాధ్యతాయుతంగా వుండాలి.? కానీ, అవేవీ లేకపోవడమే ఆయనగారి ప్రత్యేకత. 'పెద్ద కులాలు' అని ఆయన అనుకుంటే చాలు, ఇక ఆ కులాలపై చెలరేగిపోవడానికి ఆయనగారికి ఆకాశమే హద్దు.!
పరిచయం అక్కర్లేని పేరది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. ఆయనే, కంచె ఐలయ్య. 'కిందిస్థాయి కులాలకు ప్రతినిథి' అన్పించుకోవడం ఆయనకు అలవాటు. అసలు 'కిందిస్థాయి' అన్న మాటకి ఈ రోజుల్లో అర్థం వుందా.? అని 'పైస్థాయి' కులాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ, 'పెద్ద పేరు' పెట్టుకుని, 'దిగువకి తొక్కేబడ్తున్న' ఆ 'పెద్ద కులాల'పై ప్రొఫెసర్ కంచె ఐలయ్య, 'అస్త్రాల్ని' ఎక్కుపెట్టడం చాలాకాలంగా జరుగుతున్నదే.
సామాజిక డాక్టర్లు.. అని కొన్ని వర్గాల్ని అత్యద్భుతంగా అభివర్ణించిన కంచె ఐలయ్యే, ఆర్యవైశ్యుల్ని ఉద్దేశించి 'సామాజిక స్మగ్లర్లు' అనేశారు. వ్యాపారం చేయడమే ఆ సామాజిక స్మగ్లర్లు చేస్తున్న వ్యాపారం. అలాగైతే, పుస్తకాలు రాసి అమ్ముకుంటున్నవారిని ఏమనాలి.? ఆ కేటగిరీలో కంచె ఐలయ్య పేరుని ఎలా ప్రస్తావించాలట.!
ముందే చెప్పుకున్నాం కదా.. ఏ వ్యక్తి అయినా మేధావి అయితే, ఆ మేధావితనం ప్రపంచానికి ఉపయోగపడాలి. కానీ, ఈ మేధావి తాలూకు మేధావితనం సామాజిక వర్గాల మధ్య విభజన, సమాజంలో ఆందోళనకు కారణమవుతోంది. ఇంతా చేసి, 'నన్ను చంపేస్తామంటున్నారు మొర్రో..' అంటూ అమాకత్వం ప్రదర్శించడం కంచె ఐలయ్యకే చెల్లింది.
రాముడు దేవుడు కాదు, రావణుడే దేవుడన్నది కంచె ఐలయ్య వాదన. అది ఆయన అభిప్రాయం. అలాగని, ఓ సామాజిక వర్గాన్ని పట్టుకుని, 'సామాజిక స్మగ్లర్లు' అంటే ఎలా.? రాజకీయ నాయకులే మాట్లాడేస్తుంటారు రాజకీయ వ్యభిచారం గురించి. ఆ సంగతి వేరు. టైటిల్ అదిరిపోయింది కదా.. అని పెట్టేసుకున్నారో ఏమో, ఇప్పుడిక కంచె ఐలయ్య సమాధానం చెప్పుకోలేని పరిస్థితి మాత్రం వచ్చేసింది. అందుకే, 'ప్రాణభయం' అంటూ ఇటీవల బెంగళూరులో హత్యకు గురైన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ఉదంతాన్ని అడ్డంపెట్టుకుని తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.