వెంకటేష్‌తో ఒక మల్టీస్టారర్ సినిమా చేయడానికి 'సోగ్గాడే చిన్నినాయనా' దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ ఒక స్టోరీ చెప్పాడట. ఆ సినిమాలో యువ హీరో పాత్రకి పలువురు హీరోలని సంప్రదించారు. రానా దగ్గుబాటి, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ తదితర యువ హీరోల పేర్లు పరిశీలించి, నాగచైతన్య అయితే బెస్ట్ అని డిసైడ్ అయ్యారు.
కథాపరంగా మేనమామ, మేనల్లుడి పాత్రలు కనుక నిజ జీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చై అయితే బాగుంటుందని భావించి చైతన్యని సంప్రదించగానే అతను వెంటనే ఓకే చెప్పాడట. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో కళ్యాణ్‌కృష్ణపై చైతన్యకి గురి కుదిరింది. ప్రేమమ్‌లో అతిథి పాత్రలో మెరిసిన వెంకీ మొదటిసారి మేనల్లుడితో పూర్తి స్థాయి చిత్రం చేయబోతున్నాడన్నమాట.
ఆసక్తికరంగా అనిపిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకి వెళుతుందట. మారుతితో ఒక సినిమా కమిట్ అయితే అయ్యాడు కానీ ఇంకా కథ రెడీ కాకపోవడంతో ఆ సినిమాకి ఇచ్చిన డేట్స్ చైతన్య ఇటు కేటాయిస్తాడట. వచ్చే ఏడాదిలో ఈ కాంబినేషన్‌ని వెండితెరపై వీక్షించవచ్చునని అనధికార సమాచారం.