ఇక బాబు చేతికి ఎముక వుండదు

కొత్త ప్రజాస్వామ్య విధానాలకు తెర పూర్తిగా లేచేసింది. అదేమీ కాదు. ప్రజల ముక్కుపిండి డబ్బులు పన్నుల రూపంలో వసూలు చేయండి. ఆపై చేతికి ఎముక లేకుండా ఓట్ల కోసం జనాలకు ధారపోయండి. కావాలంటే రాష్ట్రం…

కొత్త ప్రజాస్వామ్య విధానాలకు తెర పూర్తిగా లేచేసింది. అదేమీ కాదు. ప్రజల ముక్కుపిండి డబ్బులు పన్నుల రూపంలో వసూలు చేయండి. ఆపై చేతికి ఎముక లేకుండా ఓట్ల కోసం జనాలకు ధారపోయండి. కావాలంటే రాష్ట్రం కోసం అప్పులు చేయండి. మరో పదేళ్ల తరువాత ఇచ్చేలా బాండ్లు ఇచ్చేయండి. అప్పుడు వున్న ప్రభుత్వం చూసుకుంటుంది. ఇప్పటికైతే మన పబ్బం గడిచిపోతుంది కదా? 

బహుశా రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలు ఈ వ్యవహారం చుట్టూనే తిరుగుతాయేమో? ఒకరు రెండువేల పింఛను అంటే మరొకరు అయిదువేలు అంటారేమో? ఒకరు ఫీజు వెనక్కిస్తాం అంటే మరొకరు వారంవారం సినిమా టికెట్ లు కూడా ఇస్తాం అంటారేమో? ఒకరు పండగనాడు ఫ్రీ సరుకులు అంటే మరోకరు ప్రతినెలా ఫస్ట్ సండేకు ఫ్రీ సరుకులు అంటారేమో?

కొద్ది మంది ముక్కు పిండి వసూలు చేసిన సొమ్ములు ఇలా పప్పు బెల్లాల్లా పంచేస్తున్నా, ఎవరికీ ఏమీ పట్టడం లేదు. ప్రభుత్వంలో వున్నవాళ్లు ఎలాగూ తింటున్నారు. మనకు కనీసం కాస్తయినా పడేయడం బెటరే కదా? అన్న ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది. 

నంద్యాల తరువాత

నంద్యాల ఎన్నికల సీన్ చూసాక ముఖ్యమంత్రి చంద్రబాబు దృక్ఫధంలో మరింత మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. పైకి ఎన్ని చెప్పినా, ఆ ఎన్నిక కోసం చాలా కిందా మీదా పడింది వాస్తవం. ఫలితం దక్కింది. అది ఆనందం. కానీ 2019 నాటికి ఎలా? ఇప్పటి నుంచి ఫౌండేషన్ వేసుకోవాలి కదా? ప్రభుత్వం డబ్బులతో పార్టీకి ఓట్లు తెచ్చుకోవడం అన్న విద్యలో ఆరితేరిన రాజకీయ వాది చంద్రబాబు.

అందుకే కొత్త మార్గాలు అన్వేషించడం ప్రారంభించేసారు. ఫింఛన్ అంటూ వెయ్యి రూపాయిలు నెల నెలా ఇస్తున్నారు. ఇది సద్వినియోగం ఏ మేరకు అవుతోందో? దుర్వినియోగం ఏమేరకు అవుతోందో పల్లెల్లో వుండేవాళ్లకు, లేదా పల్లెలతో పరిచయం వున్నవారికి తెలుస్తుంది. ఇక ఏడాదికి మూడు నాలుగు సార్లు ఫ్రీ సరుకులు ఇస్తున్నారు. 

ఇక ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునేవారికి బట్టలు ఇవ్వడం అన్నది ప్లాన్ చేస్తున్నారు. ఆ జంటలకు నలభై వేల బాండ్ ఇస్తారట. ఏమీ బాండ్ ఇవ్వడం ఎందుకు ఇప్పుడే చెక్ లేదా క్యాష్ ఇవ్వచ్చుగా. అలా కాదు, అయిదో, పదో టైమ్ బౌండ్ పెట్టి ఇస్తే, ఇప్పటికి పోయేది కాగితం ముక్కే. ఆ తరువాత ఎప్పుడో అప్పుడు వున్న ప్రభుత్వం ఆ భారం చూసుకుంటుంది. ఇక ఇప్పుడు వికలాంగులకు మూడు చక్రాల హోండా ఏక్టివాలు. 

ఓట్లు రాబట్టకోవడానికి, ప్రతి పక్షం అడ్డం పడలేని పరిస్థితి కల్పిస్తూ పంచేయడానికి ఇంకేమున్నాయి దారులు. వెతకండి. దోబీలకు వాషింగ్ మెషీన్లు ఫ్రీగా ఇవ్వండి. ప్రతిపక్షం వద్దని అనగలదా? విలేజ్ కు రవాణా సదుపాయాలు కల్పించే మిషతో రన్నింగ్ ఆటోలు నడుపుకోవడానికి కొంత మందికి ఆటోలు ఫ్రీగా ఇవ్వండి, అర ఎకరాకు మించకుండా పొలం వున్నవారికి టాక్టర్లు అందించండి. ఇలా కొత్త కొత్త వితరణ అయిడియాలు, అది కూడా ప్రతిపక్షం కానీ, మరెవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయనవి ఆలోచించండి. ఇలా పంచేయండి.. పంచేయండి.. పంచేయండి. 

రాష్ట్రంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నవారు వున్నారు. వాళ్ల నుంచి అన్ని వైపులా తాళ్లు కట్టేసి, ముక్కు పిండి పన్నులు వసూలు చేయడానికి మోడీ వున్నారు. మన వాటా మనకు వస్తుంది. హ్యాపీగా పంచేయండి. చాలదంటే మళ్లీ అప్పులు చేయండి. వచ్చిన నష్టం ఏముంది? మనమేమన్నా గ్యారంటీ సంతకం పెడతామా? చెన్నారెడ్డి, ఎన్టీఆర్, విజయభాస్కర రెడ్డి, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలు ఏమన్నా ఈ స్టేట్ అప్పులకు గ్యారంటీలు ఇచ్చాయా? చంద్రబాబు ఇవ్వడానికి? భవిష్యత్ తరం చూసుకుంటుంది. 

విభజన నాటికి వున్న అప్పు ఎంత? మూడేళ్లలో పెరిగిన అప్పు ఎంత? ఎవరికన్నా పట్టిందా? ఈ జనం ఏమన్నా అడుగుతారా? మన మీడియా ఏమన్నా అలాంటి లెక్కలు తీసి నిలేస్తుందా? కావాలంటే వాళ్లకు కూడా ఏదో వంకన ఫుల్ పేజీ ప్రకటనలు గుప్పించండి. ఏదో ప్రకటనల రూపంలో ఏడాదికి కోట్లకు కోట్లు కుమ్మేయండి. మళ్లీ మాట్లాడతారా? జర్నలిస్టులకు కూడా ఇళ్లు ఇచ్చేస్తాం అని ఇప్పటికే చెప్పేసారాయె. 

ఇలా జాబితాలు తీయండి. ఎవరికి ఏం ఫ్రీ ఇవ్వాలో ఇస్తూ పోండి. అధికారం అందకపోతే చూడండి.