బ్లూవేల్.. ఎక్కడో రష్యాలో తయారైన ఆన్‌లైన్ గేమ్ ఇది. చిత్రంగా ఇది, భారతదేశాన్ని కబళించేస్తోంది. నిజ్జంగా నిజమిది.! 12 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళలోపు వారే ఈ బ్లూ వేల్ ఆన్‌లైన్ గేమ్‌కి బానిసలుగా మారుతుండడం గమనార్హం. అందులోనూ, 15 నుంచి 19 ఏళ్ళలోపువారి సంఖ్య చాలా ఎక్కువగా వుంటోంది. ఆన్‌లైన్‌లో బ్లూ వేల్ గేమ్‌కి సంబంధించిన లింక్‌లపై న్యాయస్థానాలు కొరడా ఝుళిపించినా, ఇంటర్నెట్‌లో అలాంటి పప్పులేవీ ఉడకవని తేలిపోయింది.
దాదాపుగా ప్రతిరోజూ భారతదేశంలో ఎక్కడో ఏదో ఒక చోట బ్లూ వేల్ గేమ్ తాలూకు ఆనవాళ్ళు కన్పిస్తున్నాయి. అయితే మరణం.. లేదంటే, ప్రాణాపాయం.. ఇదీ బ్లూ వేల్ గేమ్‌కి సంబంధించి బానిసలైపోయినవారి పరిస్థితి. చెన్నయ్‌లో ఓ యువతి, ఢిల్లీలో ఓ పధ్నాలుగేళ్ళ కుర్రాడు, రాజస్థాన్‌లో ఓ మహిళ, ముంబైలో ఓ యువకుడు.. ఇలా ఈ మధ్యకాలంలో వెలుగుచూస్తోన్న 'బ్లూ వేల్' పైత్యాలు అన్నీ ఇన్నీ కావు.
టెలివిజన్ గేమ్ షోల తరహాలో కొన్ని టాస్క్‌లు ఈ బ్లూ వేల్ గేమ్‌లో వుంటాయి. అయితే, బ్లూ వేల్ గేమ్ టాస్క్‌లు కొన్ని ప్రాణాంతకమైనవి. స్మశానాల్లో అర్థరాత్రి వేళ ఎలాంటి భయం లేకుండా సంచరించడం, ప్రమాదకరమైన పరిస్థితుల్లో రైలు పట్టాలపై నడవడం.. ఇలాంటివి ఆ బ్లూ గేమ్ టాస్క్‌లలో కొన్ని. చివరగా, 'మీరు ఛస్తారా.? లేదంటే చచ్చిపోతున్నవారిని దగ్గరగా చూస్తారా.?' అనే అతి భయంకరమైన టాస్క్ పార్టిసిపెంట్ల ముందుకు వస్తుంది.
ఏ టాస్క్ చేసినా, అంతా సెల్ఫీలోనే చేయాల్సి వుంటుంది. అదీ బ్లూ వేల్ నిబంధన. వినడానికి ఎంత భయంకరంగా వుందో కదా.! అయినాసరే, సరదాగా స్టార్ట్ అవుతోంది గనుక, పెద్ద సంఖ్యలో ఈ బ్లూవేల్ 'ఎడిక్ట్స్' తయారైపోతున్నారు. వందలు, వేల సంఖ్యలోనే భారతదేశంలో బ్లూ వేల్ బాధితులున్నారన్నది ఓ అంచనా. తాజాగా ఈ బ్లూ వేల్‌కి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగు చూస్తోంది. 'చచ్చిపోవడమే కాదు, చంపడం కూడా ఓ టాస్క్..' అంటూ కొత్త సందేశాలు వస్తున్నాయట సదరు ఆన్‌లైన్ గేమ్ నుంచి. ఇది ఇంకా ప్రమాదకరమైన రాక్షస క్రీడ అని చెప్పక తప్పదు.
చేతిలో ఓ మొబైల్ ఫోన్, దానికి 4జీ కనెక్షన్.. అది కూడా ఉచిత ఇంటర్నెట్‌తో.. ఇకనేం, బ్లూవేల్ కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు.. పైత్యానికి పరాకాష్ట.. రాక్షసత్వానికే పరాకాష్ట.. అన్నట్టు చెలరేగిపోతున్నారన్నమాట. మరి, దీనికి అడ్డుకట్ట వేసేదెలా.? షేర్ చేస్తే కేసులు, లింక్‌లు కన్పిస్తే చర్యలు.. అంటూ తూతూ మంత్రం హెచ్చరికలతో ఇలాంటి పైత్యాల్ని అడ్డుకోలేం. పటిష్టమైన ప్రత్యేక యంత్రాంగం ఆన్‌లైన్ మీద ఫోకస్ పెట్టేలా వుండాలి. సాధ్యమేనా.? సాధ్యం కాకపోతే మాత్రం, 'ప్రపంచంలోనే యువత ఎక్కువగా వున్న దేశం..' అని చెప్పుకుంటోన్న మనం, 'ప్రపంచంలోనే యువత ప్రాణాల్ని ఎక్కువగా బలిపెడ్తోన్న దేశం'గా కూడా మన గురించి చెప్పుకోవాల్సిన దుస్థితి దాపురించొచ్చు.