గతంలో 'పద్మ' పురస్కారాలు ఎలా వచ్చేవో అందరికీ తెలుసనీ, ఆ అవార్డుల్ని భ్రష్టుపట్టించేశారనీ, ఇకపై ఎవరికి పద్మ అవార్డులు ఇవ్వాలో ఎవరైనా నామినేట్ చేయొచ్చంటూ ప్రధాని నరేంద్రమోడీ కొత్త విధానాన్ని చాలా గొప్పగా ప్రకటించేసుకున్న విషయం విదితమే. ఎవరైనా, ఎవర్నయినా నామినేట్ చేసెయ్యొచ్చంటే ఆ 'కిక్కు' ఎలా వుంటుందో, ఆల్రెడీ 'సోకాల్డ్ అభిమానులు' చూపించేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'డేరా' చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కి పద్మ పురస్కారం ఇవ్వాలంటూ 4 వేలకు పైగానే నామినేషన్స్ వచ్చాయట. ఈ నామినేషన్స్‌తో 'పద్మ' పురస్కారాల కమిటీనే షాక్‌కి గురయి వుంటుంది. ఇలాంటోళ్ళకి ఫాలోవర్స్ వందల్లో, వేలల్లో కాదు.. లక్షల్లో వుంటారు. మొత్తంగా 4 కోట్ల మంది గుర్మీత్ ఫాలోవర్స్ వున్నారన్నది ఓ అంచనా. ఆ లెక్కన, వారందరి కోరిక మేరకు 'రేప్ కేసులో 20 ఏళ్ళ జైలు శిక్ష పడ్డ' గుర్మీత్‌కి పద్మ పురస్కారం ఇచ్చేస్తుందా కేంద్రం.?
సినిమా స్టార్స్, క్రికెటర్స్, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల్లో 'కొందరు' పద్మ పురస్కారాల కోసం ప్రభుత్వాల్ని ప్రసన్నం చేసుకోవడం, ఆయా ప్రముఖుల పేరుతో రాజకీయ లబ్ది పొందే క్రమంలో అధికారంలో వున్న పార్టీలు అప్పనంగా 'పద్మ' పురస్కారాలు కట్టబెట్టేయడం తెల్సిన విషయమే. అలా 'పద్మ' పురస్కారాల ఇమేజ్ పలచనైపోతూనే వుంది. ఇప్పుడిదిగో, ఈ తరహా నామినేషన్ల ప్రక్రియతో ఆ గౌరవం మరింత పతనావస్థకి చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.