Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: పైసా వసూల్‌

సినిమా రివ్యూ: పైసా వసూల్‌

రివ్యూ: పైసా వసూల్‌
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: భవ్య క్రియేషన్స్‌
తారాగణం: నందమూరి బాలకృష్ణ, శ్రియా శరన్‌, ముస్కాన్‌ సేతి, కైరా దత్‌, విక్రమ్‌జీత్‌ విర్క్‌, కబీర్‌ బేడి, పవిత్ర లోకేష్‌, అలోక్‌ జైన్‌, పృధ్వీ, అలీ తదితరులు
కూర్పు: జునైద్‌ సిద్ధికీ
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
ఛాయాగ్రహణం: ముకేష్‌ .జి
నిర్మాత: వి. ఆనంద్‌ ప్రసాద్‌
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: పూరి జగన్నాధ్‌
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 1, 2017

టీజర్‌, ట్రెయిలర్‌ కనుక చూసినట్టయితే, 'పైసా వసూల్‌' సినిమా చూసేసినట్టే. 'పోకిరి' లాంటి బ్లాక్‌బస్టర్‌ ఎంటర్‌టైనర్‌ని మరోసారి తెరకెక్కించే ప్రయత్నం పూరి జగన్నాధ్‌ చాలాసార్లు చేసినా కానీ అలాంటిది మళ్లీ ఇంకోటి రాలేదు. అయినప్పటికీ బాలకృష్ణతో ఇంకోసారి పోకి-రీమేక్‌ చేసేసాడు. రిజల్ట్‌ పరంగా మునుపటి రీమేక్‌లకి ఏమాత్రం తేడా లేదు.

బాలకృష్ణ రెగ్యులర్‌గా చేసే మాస్‌ క్యారెక్టర్స్‌కి భిన్నమైన వాచకం, ఆంగీకం వున్న 'తేడా సింగ్‌' పాత్ర అభిమానులకి బాలయ్యలోని న్యూ యాంగిల్‌ చూపిస్తుంది. అయితే పాత్ర తీరుతెన్నులే తప్ప పాత్ర చిత్రణపై దృష్టి పెట్టలేదు. ఈ తేడా సింగ్‌ని బలమైన సన్నివేశాల మధ్య నిలబెట్టినట్టయితే విలక్షణమైన వినోదానికి బోలెడంత అవకాశముండేది. కానీ క్యారెక్టర్‌ మాత్రం రెడీ చేసి సీన్లపై, సిట్యువేషన్లపై అంతగా దృష్టి కేంద్రీకరించకపోవడంతో ఒక మంచి అవకాశం వృధా అయింది.

బాలకృష్ణ స్వభావం, సంభాషణలు మినహా 'పైసా వసూల్‌'లో ఆకట్టుకునే అంశాలేమీ లేకపోవడంతో మొదలైన కాసేపటికే ఆసక్తి సన్నగిల్లుతుంది. కథాపరంగా కదలిక లేకపోయే సరికి చీటికీ మాటికీ పాటో, ఫైటో వస్తూ ప్రేక్షకులని ఏదో విధంగా ఎంగేజ్‌ చేసే ప్రయత్నం జరుగుతుంటుంది.

పోకిరిలో చిన్న త్రెడ్‌ అయినా కానీ ప్రతిదానినీ పకడ్బందీగా రాసుకుని, ఒక రౌండెడ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేసిన పూరి జగన్నాధ్‌ ఎందుకో అందులోని 'క్లయిమాక్స్‌ ట్విస్ట్‌' లాంటిది రిపీట్‌ చేస్తే చాలన్నట్టుగా ఆ తర్వాతి కథలు రాస్తున్నాడు. అడపాదడపా ఒక పంచ్‌ డైలాగ్‌ లేదా చిన్న జోక్‌ లాంటిది పేలడం మినహా 'పైసా వసూల్‌' అనిపించే దృశ్యం ఒక్కటీ లేకపోవడం ఇందులోని పెద్ద లోటు.

ప్రథమార్ధంలో కథ జోలికి పోకుండా హీరో పాత్ర స్వభావాన్ని, వివిధ పాత్రలతో అతని ఇంటరాక్షన్‌ని మాత్రం చూపిస్తూ కాలం గడిపేసినా కానీ సెకండాఫ్‌లో కథ ఏమిటో చెప్పక తప్పింది కాదు. విదేశీ సెటప్‌లోకి స్టోరీ షిఫ్ట్‌ అయ్యేసరికి చాలా రిస్ట్రిక్షన్స్‌ వచ్చి పడిపోతాయి. ఆర్టిస్టులు, లొకేషన్లు అన్నీ లిమిటెడ్‌గా వుంటాయి. దీంతో దర్శకుడికి ఫ్రీ హ్యాండ్‌ వుండదు. 'పోకిరి' చిత్రానికి విదేశీ బ్యాక్‌డ్రాప్‌ అనేదే అవసరం పడనంత పకడ్బందీ కథ, కథనాలున్నాయి.

పైసా వసూల్‌ పోర్చుగల్‌కి షిఫ్ట్‌ అయిన దగ్గర్నుంచీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పూర్తిగా బ్యాక్‌ సీట్‌ తీసుకోగా, విలన్‌ త్రెడ్‌ మరీ వీక్‌ అయిపోయేసరికి ఇక ఆడియన్స్‌ని హుక్‌ చేసే ఎలిమెంట్‌ పూర్తిగా మిస్‌ అయింది. ఎంతో ఎఫెక్టివ్‌గా వుండాల్సిన 'తేడా సింగ్‌' ఐడెంటిటీ రివీల్‌ అయ్యే సీన్‌ సైతం అత్యంత పేలవంగా తెరకెక్కింది. ఎలాగైనా ఎమోషన్‌ని పండించడానికి, ప్రేక్షకుల్లో చైతన్యం తేవడానికి పతాక సన్నివేశాల్లో దేశభక్తి డైలాగులని బలవంతంగా ఇరికించిన ఫీలింగ్‌ కలుగుతుంది.

ప్రథమార్ధంలో అంతో ఇంతో కాలక్షేపమైనా కానీ ద్వితీయార్ధంలో 'పైసా వసూల్‌'కి పూర్తిగా గాలి పోయింది. రెండు, మూడు పాటలు బాగున్నప్పటికీ టైటిల్‌ సాంగ్‌ మినహా మిగతా వాటి చిత్రీకరణ ఆకట్టుకోదు. నేపథ్య సంగీతమైతే అనూప్‌ రూబెన్స్‌ వీక్‌నెస్‌ భూతద్దంలో కనిపిస్తుంది. పోర్చుగల్‌కి లొకేషన్‌ షిఫ్ట్‌ అయినపుడు, తేడా సింగ్‌ థీమ్‌ వింటున్నపుడు, విలన్‌ ఎంటర్‌ అయినపుడు వినిపించే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ పేలవంగా వుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ స్టాండర్డ్‌ పూరి సినిమాని తలపిస్తాయి. పోర్చుగల్‌ ఎపిసోడ్‌ని మినహాయిస్తే మేకింగ్‌ వేల్యూస్‌ ఆకట్టుకోవు. సంభాషణల పరంగా ట్రెయిలర్స్‌లో చూపించినవే తప్ప బాలకృష్ణ ట్రేడ్‌ మార్క్‌ మాస్‌ పంచ్‌లు లేవు.

తన పాత్రపై తనే సెటైర్లు వేసుకునే హీరో పాత్రని అంగీకరించినందుకు బాలకృష్ణ అభినందనీయుడు. ఆయనని ఒక తరహా పాత్రల్లో చూడ్డానికి అలవాటు పడ్డ వారికి ఇందులో కొత్త బాలకృష్ణ కనిపిస్తారు. స్టయిలింగ్‌ దగ్గర్నుంచి డైలాగ్‌ మాడ్యులేషన్‌ వరకు అన్నిట్లోను బాలకృష్ణ వ్యత్యాసం చూపించారు. ఈ చిత్రానికి సంబంధించి పాజిటివ్‌ ఎలిమెంట్‌ ఏదైనా వుంటే అది బాలకృష్ణ విభిన్నంగా కనిపించడమే.

అయితే బాలకృష్ణ మినహా మరో చెప్పుకోతగ్గ పర్‌ఫార్మెన్స్‌ లేకపోవడాన్ని బట్టి ఆయా పాత్రలని ఎంత బలహీనంగా తీర్చిదిద్దారనేది తెలుసుకోవచ్చు. ముగ్గురు హీరోయిన్లలో ఏ ఒక్కరికీ గుర్తుండే పాత్ర లేదు. శ్రియని మినహాయిస్తే మిగతా ఇద్దరూ నటన పరంగా కంప్లీట్‌గా తేలిపోయారు. అలీ, పృధ్వీ వున్నా కానీ చెప్పుకోతగిన హ్యూమర్‌ లేదు. విలన్లు సైతం వీక్‌గానే వుండడంతో హీరో ఎలివేషన్‌కి అసలు స్కోపే లేదు.

హీరో కాస్త కొత్తగా కనిపించి, పాటలు, ఫైట్లు వుంటే 'పైసా వసూల్‌' అని సంతృప్తి పడిపోయే వారికి మినహా ఈ చిత్రం టైటిల్‌కి ఏ విధంగాను న్యాయం చేయలేదు. ''ఫాన్స్‌, ఫ్యామిలీ మాత్రమే. అవుటర్స్‌ నాట్‌ ఎలవుడ్‌'' అంటూ ఇంటర్వెల్‌కీ, ఎండింగ్‌కీ నొక్కి చెప్పిన ఈ సినిమా కూడా ఫాన్స్‌కే పరిమితం అయి, అవుటర్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయదు.

బాటమ్‌ లైన్‌: పోకిరికిరి!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?