‘ఛీ’మానిటైజేషన్‌: పతనం పరాకాష్టకి.!

దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకే అత్యంత వ్యూహాత్మకంగా 'డిమానిటైజేషన్‌'ని నరేంద్రమోడీ సర్కార్‌ తెరపైకి తెచ్చిందా.? ఇప్పుడీ ప్రశ్న దేశ ప్రజానీకాన్ని వేధిస్తోంది. ఎందుకంటే, డీమానిటైజేషన్‌.. అదేనండీ పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత…

దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకే అత్యంత వ్యూహాత్మకంగా 'డిమానిటైజేషన్‌'ని నరేంద్రమోడీ సర్కార్‌ తెరపైకి తెచ్చిందా.? ఇప్పుడీ ప్రశ్న దేశ ప్రజానీకాన్ని వేధిస్తోంది. ఎందుకంటే, డీమానిటైజేషన్‌.. అదేనండీ పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత దేశం ఆర్థికంగా వేగం పుంజుకుంటుందనీ, దేశ ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా బలపడ్తుందనీ ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకొచ్చారు.

ఇది 2016 నవంబర్‌ 8 నాటి మాట. అప్పట్లో నరేంద్రమోడీ మాత్రమే కాదు, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆఖరికి ఓ వర్గం మేధావులు సైతం భారతదేశం ఇకపై సూపర్‌ పవర్‌ కంట్రీ.. అనే స్థాయిలో హడావిడి చేశారు. 

అయితే, భారతదేశంలో పరిస్థితులు వేరు. ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులున్నాయి. దాంతో, పెద్ద నోట్ల రద్దు దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందని ఆర్థిక రంగ నిపుణులు కొందరు అంచనా వేశారు.. ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనే నిజమయ్యింది. పెద్ద పాత నోట్ల రద్దుతో కేంద్రం అంచనాలు తారుమారయ్యాయి. దేశ ప్రజానీకం ఆశలు గల్లంతయ్యాయి. పాలకులు చెప్పిన మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. 

వృద్ధి రేటు నానాటికీ గణనీయంగా పడిపోతుండడంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా తయారైందని సాక్షాత్తూ ప్రభుత్వ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హమిక్కడ. సమ్మెట పోటు.. ఒకదాని తర్వాత ఒకటి.. ఇలా దేశమ్మీద పెద్ద పాత నోట్ల రద్దు రూపంలో, జీఎస్టీ రూపంలో పడేసరికి.. దేశ ఆర్థిక వ్యవస్థ విలవిల్లాడిపోతోంది. తాజాగా వెల్లడైన లెక్కల ప్రకారం ఆర్థిక వృద్ధి రేటు పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. 

కేంద్రం మాత్రం, పరిస్థితి మరీ అంత ఆందోళనకరంగా ఏమీ లేదనీ, ఇలాంటి చిన్న చిన్న సమస్యల్ని ముందే ఊహించామని చెబుతుండడం గమనార్హం. 3 లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి తీయాలనే టార్గెట్‌తో పెద్ద నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్రం. 3 లక్షల కోట్లు కాదు, కనీసం లక్ష కోట్లు.. అందులో సగం కూడా బయటకు తీయలేకపోయింది. పైగా, కొత్త పెద్ద నోట్ల పేరుతో దేశమ్మీద మళ్ళీ అదనపు ఆర్థిక బారం పడింది. 

మిగతావన్నీ ఒక ఎత్తు.. పెద్ద పాత నోట్ల రద్దు సమయంలో దేశ ప్రజానీకాన్ని బిచ్చగాళ్ళలా మార్చేయడం ఓ ఎత్తు. తమ డబ్బుని బ్యాంకుల్లోంచి తీసుకోవడానికి.. అదీ నాలుగైదు వేల రూపాయల కోసం.. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవడం, ఛీత్కారాల్ని ఎదుర్కోవడం.. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం.. అత్యంత హేయమైన విషయమిది. 

ఓ రైలు ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ప్రధాని నరేంద్రమోడీ 'అయ్యోపాపం..' అనేస్తున్నారు.. పెద్ద పాత నోట్ల రద్దుతో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే కనీసం ఆ విషయాన్నే ఆయన లెక్క చేయని పరిస్థితి. పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత పది నెలలు పూర్తయిపోయాయి. దేశం గాడిన పడలేదు. ఇంతలోనే జీఎస్టీ దెబ్బ. ఈ పరిస్థితుల్లో దేశం ఇప్పట్లో కోలుకుంటుందా.? కష్టమే.!

కొసమెరుపు: రోమ్ తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడో లేదోగానీ, దేశం ఆర్థిక వ్వవస్థ కుదేలవుతోంటే, ప్రధాని నరేంద్రమోడీ మాత్రం ఇంకా పబ్లసిటీ స్టంట్లు చేస్తూనే వున్నారు.