పుత్ర ప్రేమ అంటే అలాగే వుంటుంది మరి. డబ్బున్న బాబులు తమ కొడుకు కోరిక తీర్చాలనో, కొడుకును హీరోగా చూడాలనో అనుకుంటారు. సినిమా జనాలయితే ఓకె. ఎవరో ఒక నిర్మాత దొరుకుతారు. మరి కాని వారికి? స్వంత డబ్బులు పెట్టుకోవాల్సిందే. ఇదేం కొత్త సంగతి కాదు. ఎందరో బిజినెస్ పీపుల్, పొలిటికల్ జనాలు తమ తమ పిల్లల్ని హీరోలను చేయడానికి ప్రయత్నిస్తూనే వున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మరి కొంత మంది వస్తున్నారు.
విజయవాడ-విశాఖ, హైదరాబాద్ లో పేరు పొందిన స్వీట్ మ్యాజిక్ యజమాని కుమారుడు రక్షిత్ సినిమాల్లో తన లక్ ట్రయ్ చేసుకోబోతున్నాడు. డైరక్టర్ మారుతి నిర్మాతగా లండన్ బాబులు సినిమా పూర్తయి రెడీగా వుంది. ఈ సినిమాకు చిన్ని కృష్ణ దర్శకుడు. అలాగే నిర్మాత శైలేంద్ర బాబు కుమారుడు సుమంత్ శైలేంద్రన్ తో కూడా మారుతి నిర్మాతగానే ఓ సినిమా రెడీ అవుతోంది.
ఈ రెండు ఇలా వుంటే, దుబాయ్ లో, ఇండియాలో పలు వ్యాపారాలున్న వ్యాపారవేత్త తన కుమారుడు ఆకాష్ సహదేవ్ హీరోగా ఓ ఫాంటసీ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దగ్గర దగ్గర 40కోట్ల బడ్జెట్ కుమ్మరిస్తున్నారు. పూర్తి సోషియో ఫాంటసీ సినిమా ఇది. దాంతో విజువల్ ఎఫెక్ట్స్ కు డబ్బులు బాగానే ఖర్చు చేస్తున్నారు.
అదే విధంగా సీనియర్ నిర్మాత కృష్ణారెడ్డి తన కొడుకు నాగ అన్వేష్ హీరోగా సోషియో ఫాంటసీ సినిమా నిర్మిస్తున్నారు. ఏంజెల్ అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు 20కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు.
ఇటీవలే తన తొలి సినిమా అందించిన మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవి కూడా తన మళ్లి సినిమా తెరకెక్కించడానికి మంచి ప్రాజెక్టు కోసం చూస్తున్నారు. మొత్తం మీద సినిమా రంగంతో సంబంధం లేని ఎంతో మంది కొడుకుల్ని హీరోలను చేయడానికి కోట్లు కుమ్మరిస్తున్నారు.