సౌత్‌ సినిమాకు కొత్త బంగారు బాతు.. భలే గిట్టుబాటు!

తెలుగు సినిమా సత్తా చాటుతోంది. సరికొత్త ఆదాయ వనరులతో దూసుకుపోతోంది. వందకోట్ల వ్యాపారం టాలీవుడ్‌ సినిమాకు చాలా చిన్న విషయం. నవ్యత లేదు, రొటీన్‌గా రొడ్డ కొట్టుడుగా పోతోంది.. గొప్ప సినిమాలను అందించలేకపోతోంది.. అని…

తెలుగు సినిమా సత్తా చాటుతోంది. సరికొత్త ఆదాయ వనరులతో దూసుకుపోతోంది. వందకోట్ల వ్యాపారం టాలీవుడ్‌ సినిమాకు చాలా చిన్న విషయం. నవ్యత లేదు, రొటీన్‌గా రొడ్డ కొట్టుడుగా పోతోంది.. గొప్ప సినిమాలను అందించలేకపోతోంది.. అని మనదగ్గర మనకే అసహనం ఉన్నప్పటికీ, బయట మాత్రం టాలీవుడ్‌ సినిమాలు సత్తా చాటుతున్నాయి. బోలెడన్ని ఆదాయ వనరులతో దూసుకుపోతున్నాయి.

అందివచ్చిన అవకాశాలను టాలీవుడ్‌ ఒకవైపు అందిపుచ్చుకుంటోంది. అందిపుచ్చుకోవడంతోనే కాదు.. టాలీవుడ్‌కే తెలియకుండా కొన్నిరకాల అవకాశాలు కలిసి వస్తున్నాయి. కోట్ల రూపాయలను తెచ్చిపెడుతున్నాయి. అదొక ఆదాయమార్గమని మొన్నటి వరకూ తెలియదు.. ఇప్పుడు మాత్రం కొత్త కొత్తగా బంగారు బాతులు పుట్టుకు వస్తున్నాయి.

కొన్నేళ్ల కిందటి వరకూ టాలీవుడ్‌కు శాటిలైట్‌ రైట్స్‌ లేవు. టీవీలు, టీవీ ఛానళ్లు విస్రృతం అయ్యాకా.. ఇరవై యేళ్ల నుంచి శాటిలైట్‌ రైట్స్‌ పుట్టుకు వచ్చాయి. మొదట్లో పావలా అర్ధాకు.. సినిమాలను ఛానళ్లకు తాకట్టు పెట్టేవారు నిర్మాతలు. ఎంతో సూపర్‌ హిట్‌ సినిమాలను కూడా టీవీ ఛానళ్ల ఓనర్లు తక్కువ మొత్తానికి తనఖా పెట్టుకున్నారు.

ఆ సమయంలో టీవీ ఛానళ్లకూ అంత ఆదాయంలేదు, పోటీనూలేదు. దీంతో 99 సంవత్సరాలకు అంటూ.. బాండ్లు రాయించేసుకున్నారు కొంతమంది తెలివైన టీవీ ఛానళ్ల ఓనర్లు. ఆ తర్వాత మార్పు వచ్చింది. ఛానళ్ల సంఖ్య పెరిగింది.. సినిమాలపై క్రేజ్‌ పెరిగింది, టీవీ ఛానళ్లకు ఆదాయం పెరిగింది. ఫలితమే.. ఇప్పుడు కోట్ల రూపాయలు పలుకుతున్న శాటిలైట్‌ రైట్స్‌. లక్షలు, కోటి, ఐదారు కోట్లు, పదికోట్లు.. ఇప్పుడు పదుల కోట్లు.. ఇదీ శాటిలైట్‌ రైట్స్‌ రూపంలో ఆరోహణా క్రమంలో పెరుగుతున్న ఆదాయం.

ఛానళ్ల మధ్యన పోటీ పెరిగింది.. దీంతో కోట్ల రూపాయలు పోసి కొనుక్కోవడానికి అవి వెనుకాడటం లేదు. మధ్యలో ఈ గ్రోత్‌రేట్‌కు కొంత బ్రేక్‌పడినా.. పెద్ద హీరోల సినిమాలకు, చోటామోటా హీరోల క్రేజున్న సినిమాలకూ శాటిలైట్‌ ఒక బంగారు బాతే నిస్సందేహంగా, మరి వీరి ఆదాయ వనరులు శాటిలైట్‌ రైట్స్‌ ఆగిపోవడం లేదు. 

యూట్యూబ్‌ వచ్చింది, డిజిటల్‌ మార్కెట్‌ అంటున్నారు, ఇక మొబైల్‌ యాప్స్‌కు కూడా సినిమాలను అమ్మడం మొదలైంది, ఆ యాప్స్‌లో సినిమాలను ప్రదర్శించడానికి హక్కులను ఇస్తూ కోట్ల రూపాయలు కుప్ప పోసుకుంటున్నారు. ఇక కొన్ని ప్రొడక్షన్‌ హౌస్‌లు సొంతంగా యూట్యూబ్‌ ఛానళ్లను పెట్టుకుంటున్నాయి. మరి కొందరు దీనికీ ఒకరేటు కట్టి అమ్మేస్తున్నారు. టీవీ ఛానళ్లే యూట్యూబ్‌ రైట్స్‌ను కొంటున్నాయి. ఇలా ఆ వ్యాపారం సాగుతోంది.

ఇక డబ్బింగ్‌ రైట్స్‌ సరేసరి, ఇంతకు ముందురోజుల్లో.. పేరున్న హీరోలు, స్టార్ల సినిమాలు మాత్రమే డబ్బింగ్‌ అయ్యేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ప్రతి సినిమాకూ డబ్బింగ్‌ రైట్స్‌ కచ్చితంగా ఉంటున్నాయి. తమిళ, మలయాళీ, హిందీ భాషల్లోకి మనవాళ్ల సినిమాలు డబ్‌ అయిపోతూ ఉన్నాయంతే. అంత ఖాయమైన ఆదాయ వనరు అయ్యింది డబ్బింగ్‌.

ఇంకో బంగారు బాతు.. హిందీ టీవీ ఛానళ్లు!

అవును.. తెలుగు సినిమాకు మరో బంగారు బాతు దొరికింది. అదే.. హిందీ శాటిలైట్‌ రైట్స్‌. తెలుగు సినిమాలు హిందీలోకి అనువాదం అవుతున్నది థియేటర్లలో విడుదల కావడానికి ఏమీకాదు. ప్రతియేటా బాలీవుడ్‌ కొన్ని వందల సినిమాలను విడుదల చేస్తోంది. సో.. అడ్రస్‌ లేని వాళ్ల సినిమాలు అక్కడ అనువాదమై విడుదల అయితే.. జనాలు ఎగేసుకుని వచ్చేయరు కదా. ఈ డబ్బింగుల అసలు లక్ష్యం టీవీ ఛానళ్లు.

హిందీలో మూవీ ఛానళ్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇరవై నాలుగంటలూ సినిమాలే వేస్తామనే ఛానళ్లు దశాబ్దాల నుంచే ఉన్నాయక్కడ. వాటి మధ్య పోటీ ఎక్కువ అయ్యింది. దీంతో సినిమాల శాటిలైట్‌ రైట్స్‌ ప్రియం అయ్యాయి. పెద్ద హీరోల సినిమాలు, హిట్టు సినిమాలపై కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తోంది.

తెలుగులో ఇప్పుడిప్పుడు సినిమాల శాటిలైట్‌ రైట్స్‌ పది, పదిహేను కోట్ల రూపాయలు పలుకుతుంటే.. హిందీలో మాత్రం ఐదారేళ్ల కిందటే అలాంటి మొత్తాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలు పెట్టి సినిమాల హక్కులను కొనలేక ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకున్నాయి హిందీ సినిమా ఛానళ్లు. ఆ సమయంలో వాటికి డబ్బింగ్‌ సినిమాలు బంగారు బాతుల్లా అగుపించాయి.

మహా అంటే.. పది లక్షల రూపాయలు, ఇవ్వడం ఒక తెలుగు సినిమా హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ కొనుక్కోవడం.. మరో పదిలక్షలు ఖర్చుపెట్టి ఆ సినిమాను అనువదించి, విడుదల చేయడం.. ఇదీ నిర్మాతల పని. అలాంటి సినిమాను పాతిక లక్షలకు, ముప్పైకో ఏదైనా టీవీ ఛానల్‌కు అమ్మడం. ఓవరాల్‌గా ఐదారు నుంచి పదిలక్షల వరకూ గిట్టుబాటు. బాలీవుడ్‌లో అదో వ్యాపారంగా వర్ధిల్లింది. మొదట్లో టాలీవుడ్‌కు అలాంటి అనువాదాలతో దక్కింది చాలా చిన్న మొత్తం. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది!

కోట్ల రూపాయలు పలుకుతున్న హిందీ రైట్స్‌..

ఆది నుంచి సౌతిండియన్‌ ఫైటింగ్‌ సినిమాలు అంటే బాలీవుడ్‌లో కొంత క్రేజ్‌, హిందీలో ఇలాంటి సినిమాలు రాలేదప్పట్లో. హీరో ఒంటిచేత్తో ఇరగ్గొట్టే బీభత్సమైన ఫైటింగ్‌ సీన్లకోసమే సౌత్‌ సినిమాలను చూసే హిందీ జనాలున్నారు. హిందీలో అలాంటి ఫైట్లు ఉండవా.. అంటే ఉంటాయి, కానీ సౌత్‌ ఈ విషయంలో ప్రత్యేకం. అందుకే సౌత్‌లో హిట్టైన బీభత్సమైన మాస్‌ సినిమాలు హిందీలోకి అనువాదం అవడం మొదలైంది. ఆ వ్యాపారం ఇప్పుడు కోట్ల రూపాయల రేంజ్‌కు చేరింది, బాహుబలి వంటి తెలుగు సినిమా హిందీ ప్రియులను అమితంగా ఆకట్టుకున్న తర్వాత.. ఓవరాల్‌గా సౌత్‌ నుంచి హిందీలోకి అనువాదం అయ్యే సినిమాలకే క్రేజ్‌ పెరిగింది.

ఇటీవలే 'సరైనోడు' సినిమా హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ను పొందింది. తెలుగు ప్రేక్షకులు ఆ సినిమా వయోలెన్స్‌ను చూసి బోర్‌గా ఫీలైతే.. హిందీ వాళ్లకు మాత్రం వన్స్‌మోర్‌ అనిపించింది, దీంతో దానికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ వచ్చాయి. మరి యూట్యూబ్‌లో ఆ సినిమా హిట్‌ అయ్యే సరికి.. ఆ సినిమాను శాటిలైట్‌ రైట్స్‌ను ఒక ఛానల్‌ కొనుక్కొంది. కోట్ల రూపాయలు చెల్లించి ఆ ఛానల్‌ సరైనోడు హిందీ వెర్షన్‌ ప్రసార హక్కులను కొనుక్కొందని సమాచారం.

మరి ఆ ప్రభావం బోయపాటి తర్వాత సినిమాపై పడింది, అందుకే 'జయజనకీ నాయక' సినిమా హిందీ డబ్బింగ్‌, టెలివిజన్‌ రైట్స్‌ ధర ఏకంగా ఐదుకోట్లు పలికిందని సమాచారం! మరి ఇదంతా ఊహించని లాభమే కదా.

హిందీ ఛానళ్లపై డ్యామినేషన్‌..

ఒక్కసారి టీవీ ఆన్‌ చేసి.. హిందీ ఛానళ్లను పెట్టిచూస్తే.. వాటిల్లో అసలైన హిందీ సినిమాల కంటే. .తెలుగు, తమిళ, కన్నడ భాషల నుంచి డబ్‌ అయిన సినిమాలే ఎక్కువగా ప్రసారం అవుతూ ఉంటాయి. ఒక్కోపూటా.. అలా పది, పదిహేను సౌత్‌ సినిమాలు.. హిందీ వెర్షన్లో ప్రసారం అవుతున్నాయి. దీంతో.. హిందీ టీవీ ఛానళ్లు సౌత్‌ సినిమాల మీద ఎంతగా ఆధారపడ్డాయో అర్థం చేసుకోవచ్చు.

వాళ్ల అవసరం.. ఇక్కడి ఇండస్ట్రీలకు కలిసివచ్చే అంశం అవుతోంది. కోట్ల రూపాయలను పోగేసుకునే అవకాశాన్ని ఇస్తోంది. తెలివైన ప్రొడ్యూసర్లు.. ఈ మార్గాన్ని చక్కగా క్యాష్‌ చేసుకుంటున్నారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలు కూడా ఈ మార్గాన్ని కొత్త బంగారు బాతుగా మార్చుకున్నాయి.