సై…రా…ఆ సినిమా లక్షణాలే వేరు

కొన్ని ప్రయత్నాలు ఆరంభం నుంచే డిఫరెంట్ గా వుంటాయి. స్లో అండ్ స్టడీ క్లియర్ గా కనిపిస్తుంది. బాహుబలి విషయంలో ఇలాంటి లుక్ క్లియర్ గా తెలుస్తుంది. ఆరంభం నుంచి చాలా స్టడీగా, ప్లాన్డ్…

కొన్ని ప్రయత్నాలు ఆరంభం నుంచే డిఫరెంట్ గా వుంటాయి. స్లో అండ్ స్టడీ క్లియర్ గా కనిపిస్తుంది. బాహుబలి విషయంలో ఇలాంటి లుక్ క్లియర్ గా తెలుస్తుంది. ఆరంభం నుంచి చాలా స్టడీగా, ప్లాన్డ్ గా వెళ్తూ, బయట ఏం వినిపిస్తోందన్నది పట్టించుకోకుండా, తమేంటో, తమ గోల్ ఏంటో చూసుకుంటూ ముందుకు వెళ్లడం. మళ్లీ మెగాస్టార్ చిరు 151వ సినిమా సై రా విషయంలో అలాంటి లుక్ కనిపిస్తోంది.

చిరు 150వ సినిమా తరువాత ఏమిటి అన్నపుడు ఉయ్యాలవాడ పేరు వినిపించింది. ఇలా వినిపించడం ఇది కొత్త కాదు కాబట్టి ముందు పెద్దగా ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు. పైగా చిరు 150వ సినిమా మేకింగ విషయంలో మెగా ఫాదర్, అండ్ మెగా సన్ చేసిన ఖర్చు అదీ చూసిన వాళ్లు, ప్రెస్టీజియస్ 150వ సినిమాకే ఇలా గీసి గీసి ఖర్చు చేసి, లాభాలు చేసుకోవడమే ధ్యేయంగా వెళ్లడం గమనించిన వాళ్లు, అలాంటి జనాల దగ్గర నుంచి ఉయ్యాలవాడ లాంటి భారీ సినిమాను లైట్ తీస్కున్నారు.

ఎవరు లైట్ తీస్కున్నా, తీసుకోకున్నా, ఇద్దరు మాత్రం లైట్ తీస్కోలేదు. రామ్ చరణ్, అతను నమ్మిన డైరక్టర్ సురేందర్ రెడ్డి. ఆ ఇద్దరూ. ఏనాడో పరుచూరి బ్రదర్స్ తయారుచేసిన స్క్రిప్ట్ బూజు దులపడం ప్రారంభమైంది. సురేందర్ రెడ్డి నేరుగా ఉయ్యాలవాడ బతికిన, తిరిగిన, పోరాడిన ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ చాలా ఎక్కువగా జనాలను పలకరించి, విషయ సేకరణ చేసి వచ్చారు. ఆపైన మొదలయింది చిరంజీవి నమ్మే భూపతి రాజా, సత్యానంద్, పరుచూరి తదితరులు అంతా కలిసి కొత్త కథ తయారు చేసే ప్రయత్నం.

కథ తరువాతే

కథ పూర్తిగా వచ్చేవరకు తెర వెనుక సైలెంట్ గా పని చేస్తూనే వచ్చారు. అప్పటికి ఉయ్యాలవాడ చేయబోతున్నారు చిరంజీవి అన్నది ఫిక్స్ అయింది కానీ జనాలు ఏం జరుగుతోందో తెలియలేదు. కానీ తెలియచెప్పే హడావుడి చేయలేదు. సైలెంట్ గా పని చేసుకుంటూ వచ్చారు. కథ తయారయిన తరువాత దాని స్పాన్ ను, బడ్జెట్ ను, ప్రాజెక్టును ఫిక్స్ చేసారు. అప్పుడు రాజీవన్ వచ్చి చేరారు. టోటల్ ప్రాజెక్టు స్వరూపమే మారిపోయింది. 150కోట్ల నుంచి 200కోట్ల బడ్జెట్ తో సినిమా ప్లానింగ్ ప్రారంభమైంది.

రెండు పనులు

అదే టైమ్ లో రెండు పనులు ఒకేసారి ప్రారంభమయ్యాయి. ఒకటి తయారైన కథపై అభిప్రాయ సేకరణ. సై..రా కథను రహస్యంగా వుంచాలని అనుకోలేదు మెగా యూనిట్. గట్టి దర్శకులు, సినిమా జనాలు అనుకునేవారు చాలా మందికి ఉయ్యాలవాడ స్క్రిప్ నెరేషన్ జరిగింది. ఒకటి రెండు సిటింగ్ లు చిన్నపాటి సమావేశాల మాదిరిగా, కొద్ది మంది క్లోజ్ సర్కిళ్లతో కలిపి. స్క్రిప్ట్ విన్నవాళ్లంతా ఫీలయింది ఒక్కటే.

ఉయ్యాలవాడ కథలో మాంచి కమర్షియల్ సినిమాకు పనికి వచ్చే ఇన్ని అంశాలు వున్నాయా? ఇన్నాళ్లు ఎవరికీ పట్టలేదే? అన్నదే. ఇలా కథ విన్న కొంతమంది చెబుతున్నది ఒకటే. మిగిలిన అంశాలు ఎలా వున్నా, కథ పరంగా సినిమా ఫెయిలయ్యే ప్రసక్తే లేదు. అంత పకడ్బందీగా స్క్రిప్ట్ తయారైంది. వింటుంటే పలు చోట్ల ఒళ్లు గగుర్పొడిచింది.. అని, ఇలా కథ విన్నవాళ్లలో మెగా సర్కిల్ కు దగ్గరగా వున్న పెద్ద దర్శకులు, ఒకరిద్దరు నిర్మాతలు తదితరులు వున్నారు.

అదే సమయంలో సినిమాను నేషనల్ సినిమాగా మార్చడానికి వీలయిన పని జరడం ప్రారంభమైంది. పాత్రలు, వాటి కోసం అన్ని భాషల స్టార్స్ ను ఎంపికచేయడం, వాళ్లతో సైలెంట్ గా మాట్లాడడం, అగ్రిమెంట్ చేసుకోవడం అన్నీ చకచకా జరిగాయి. అమితాబ్ ను బాలయ్య, కృష్ణ వంశీ కలిసి వస్తే నానా హడావుడి జరిగింది. కానీ ఫలితం దక్కలేదు. అదే సై..రా యూనిట్ ఎప్పుడు కలిసిందో? ఎప్పడు ఫిక్స్ అయిందో? ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో చిరంజీవి ఆయన సన్నిహితుడు నాగార్జున సాయం చేసినట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

రాజీవన్ అయితే టెక్నికల్ సపోర్ట్ విషయంలో చురుగ్గా వ్యవహారించారు. రెహమాన్ తో డిస్కషన్ కు సురేందర్ రెడ్డి ఏకంగా విదేశం వెళ్లి వచ్చారు. అన్ని రంగాల్లో ది బెస్ట్ అనుకునేవారిని రంగంలోకి దింపారు. ఫైట్ మాస్టర్ గా అంతర్జాతీయ ఫేమస్ టోనీ చింగ్ నే రంగంలోకి దింపారు. అంతకన్నా టాప్ టెక్నీషియన్ ఎవరుంటారు?

మీడియాకు కూడా

బాహుబలి విషయంలో తెలుగు మీడియా కన్నా ఇంగ్లీష్ మీడియానే ఎక్కువ నమ్ముకున్నారు. ఇంగ్లీషు మీడియా నుంచి తెలుగు మీడియా ఎలాగూ తీసుకుని, భుజాన వేసుకుని మోస్తుందని సినిమా జనాలకు తెలుసు. అందుకే నేషనల్ మీడియాకే లీకులు ఇస్తూ, ప్రీ పబ్లిసిటీ హ్యాపీగా సంపాదించారు. బాహుబలి వన్, టూ ల విషయంలో నిర్మాతలు పబ్లిసిటీ కి చేసిన ఖర్చు మామూలు రెగ్యులర్ పెద్ద కమర్షియల్ సినిమాల అంత కూడా వుండదు.

ఇప్పుడు సై..రా కూడా అదే అడుగుజాడల్లో నడుస్తోంది. సినిమా విషయాలు ముందుగా ఇంగ్లీష్ మీడియాకే లీకులు ఇస్తూ, సైలెంట్ గా వుంటున్నారు. అవి అక్కడి నుంచి తెలుగు మీడియాలోకి, సోషల్ మీడియాలోకి చేరి వైరల్ అవుతున్నాయి.

మొత్తం మీద రామ్ చరణ్, సురేందర్ రెడ్డి తమ సై..రా ప్రాజెక్టు విషయంలో ఓ పూర్తి ప్లాన్ తో క్లియర్ గా వున్నారని ఇప్పటికి అర్థం అయిపోయింది. కచ్చితంగా తెలుగు సినిమా రంగం నుంచి మళ్లీ ఓ భారీ, మంచి ప్రయత్నం దేశ వ్యాప్త సినిమా అభిమానులకు అందబోతోందన్నది క్లియర్ అయింది. సై..రా..నరహింహారెడ్డి.

-ఆర్వీ​