నిలకడగా విజయాలు సాధిస్తోన్న నాగచైతన్యకి భారీ బ్లాక్‌బస్టర్ మాత్రం రావడం లేదు. వరుసగా అర్థ సెంచరీలు సాధించే బ్యాట్స్‌మన్‌ని అందరూ మెచ్చుకుంటారు కానీ సెంచరీలు మాత్రమే ఎక్కువ గుర్తుంటాయి. చైతన్యకి హాఫ్ సెంచరీలు చాలానే వస్తున్నాయి కానీ సెంచరీ చిత్రాలే దొరకట్లేదు. మరోవైపు తన తర్వాత వచ్చిన వాళ్లు, తనలా బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోలు కూడా పెద్ద విజయాలు అందుకుంటున్నారు.
మిడ్ టేబుల్ ఇప్పుడు చాలా మంది హీరోలతో కిటకిటలాడిపోతోంది. ఈ జోన్లో వున్న హీరోలందరికీ ప్రతి సినిమా పెద్ద పరీక్షగా మారింది. నాని, శర్వానంద్ నెమ్మదిగా మంచి రేంజ్‌కి చేరుకున్నారు. వరుణ్ తేజ్ కూడా ఫిదాతో ఘన విజయాన్ని అందుకున్నాడు. నితిన్‌కి 'అ..ఆ' లాంటి పెద్ద హిట్ వుంది. కానీ చైతన్యకి ఇంకా సోలోగా ముప్పయ్ కోట్ల షేర్ వచ్చిన సినిమా లేదు.
'యుద్ధం శరణం' సినిమాతో అయినా చైతన్యకి ఆ లోటు తీరిపోతుందా? ఈ చిత్రం ఇప్పటికైతే సినీ ప్రియులని అంతగా ఎక్సయిట్ చేయలేకపోయింది. అసలే ముందు పైసా వసూల్ వెనుక జై లవకుశ రిలీజ్ అవుతున్నాయి కనుక దీనికి ఎక్కువ స్పేస్ లేదు. సెప్టెంబర్ 8న రిలీజ్ అయ్యే యుద్ధం శరణం చైతన్యని టేబుల్లో పైకి తీసుకెళుతుందా లేక మరో హాఫ్ సెంచరీతో సరిపెట్టేస్తుందా?