పవన్-త్రివిక్రమ్ సినిమా భారీగానే చెక్కుతున్నారు. ఈ సినిమా షూట్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ భారీ సెట్ లో జరుగుతోంది. ఆ మాటకు వస్తే, ఆర్ఎఫ్సీ లోనూ, వేరే చోట్ల చాలా భారీ సెట్లు వేసారు. అది వేరే సంగతి. ఇదిలా వుంటే, ఈ సినిమాకు రెండు ఫారిన్ షెడ్యూళ్లు వున్నాయి. ఒకదాని తరువాత ఒకటి. ఈ రెండూ కలిసి 60 రోజుల వరకు వుంటాయని తెలుస్తోంది. కానీ ఇప్పుడు కొంచెం మార్పులు చేసారని వినికిడి.
పవన్ సూచన మేరకు విదేశీ షెడ్యూలు తగ్గించి, ఆ మేరకు ఇక్కడే షూట్ చేస్తున్నారట. అందుకోసం ఓ భారీ సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో వేసారు. దీని వల్ల విదేళీ షెడ్యూలు ఓ పది నుంచి పదిహేను రోజులు తగ్గుతుందని అంచనా. అయితే సెట్ ఖర్చు పెరిగింది అనుకోండి.
ఈ సినిమాను జనవరి ఫస్ట్ వీకెండ్ లో విడుదల చేయాలన్నది ప్లాన్. ఇప్పటికి ఇంకా రెండు నెలల షూట్ వర్క్ పెండింగ్ లో వుంది. ఆఫైన పోస్ట్ ప్రొడక్షన్. అయితే నాలుగు నెలల సమయం వుంది కాబట్టి యూనిట్ ధీమాగా వుంది. కానీ ఈ సినిమాకు విపరీతంగా విఎఫ్ఎక్స్ పని పెట్టుకున్నారు. సినిమాలో మూడు వంతులు గ్రీన్ మ్యాట్ లోనే షూట్ చేస్తున్నారని వినికిడి. అందవల్ల ఆ వర్క్ ఏ మేరకు రెడీ అవుతుందన్నది చూడాలి.
సినిమా ఆరంభంలో అనుకున్న దాని ప్రకారం అయితే అక్టోబర్ వేళకు సినిమా రిలీజ్ కు రెడీ అయిపోవాలి. కానీ భారీ సినిమా కావడంతో, కేవలం సంక్రాంతి సీజన్ అయితేనే వర్కవుట్ అవుతుందని డేట్ మార్చుకున్నారు. డేట్ మార్చుకున్న కొద్దీ సినిమా బిహైండ్ ది షెడ్యూలు వెళ్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.