టీటీడీకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వారాహి యాత్రలో భాగంగా జనసేన అధిపతి పవన్‌కల్యాణ్ శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించి పారదర్శకత లేదని, ఆ నిధులన్ని ఏమవుతున్నాయో తెలియడం లేదని విమర్శించారు. ఆ తర్వాత టీడీపీ కూడా ఆ విమర్శల్నే కొనసాగించింది. వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే శ్రీవాణి ట్రస్ట్‌ను అడ్డు పెట్టుకుని రాజకీయ విమర్శలు చేశారనేది బహిరంగ సత్యమే.
ఈ నేపథ్యంలో శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించి వాస్తవాల్ని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఇవాళ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించి నిధులు, వాటిని ఎలా ఖర్చు చేస్తారో వివరించారు. ఇప్పటి వరకూ శ్రీవాణి ట్రస్ట్ కింద 9 లక్షల మంది కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్నారన్నారు. శ్రీవాణి ట్రస్ట్‌కు భక్తుల ద్వారా రూ.880 కోట్లు విరాళాలు వచ్చాయన్నారు.
ఈ నిధుల ద్వారా 2,500 ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విరాళాలు ఇచ్చిన భక్తుల నుంచి ఒక్క ఆరోపణ కూడా రాలేదన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ఆలయ నిర్మాణాలు కొంత మంది కాంట్రాక్టర్లకే ఇస్తున్నామనే ఆరోపణలు అసంబద్ధమైనవని ఆయన కొట్టి పారేశారు.
ఆలయాల నిర్మాణాలు నాలుగు దశల్లో జరుగుతాయని ఆయన వివరించారు. దేవాదాయశాఖ, టీటీడీ, ఆలయాల కమిటీలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా మాత్రమే ఆలయ నిర్మాణాలు చేపట్టినట్టు ఆయన వివరించారు.