మీడియం రేంజ్ హీరో చక్కగా మాంచి లవ్ స్టోరీలు చేసుకుంటూ ఫామ్ లోకి వచ్చాడు హీరో నితిన్. అలాంటి టైమ్ లో అ.. ఆ సినిమా వచ్చి అతనికి మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నిజానికి నితిన్ స్థాయికి ఆ సినిమా పెద్ద సాహసమే. 35కోట్ల మేరకు వసూళ్లు సాగించడం అంటే మాటలు కాదు. కానీ అక్కడ త్రివిక్రమ్ వున్నారు. కానీ ఆ సంగతి విస్మరించి, నితిన్ మార్కెట్ పెరిగిందని భావించి మళ్లీ అంతటి సాహసం చేసారు లై సినిమా ద్వారా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాలేదు. అందువల్ల డబ్బులు రాలేదు అని అనుకోవడం మాట అలా వుంచుదాం.
బ్లాక్ బస్టర్ అయితే మాత్రం డబ్బులు వస్తాయా? అన్నది ఆలోచించాలి. ముఫై అయిదు కోట్లు (అన్నీ కలిపి) ఖర్చు చేసారు. లై సినిమా డైరక్టర్ ఇంతకు ముందు రెండు ప్రాజెక్టులు కాస్త మీడియం బడ్జెట్ తో వచ్చినవే. అందాల రాక్షసి కాస్త నష్టాలు మిగిల్చింది. కృష్ణగాడి వీర ప్రేమగాథ, అలా అలా గట్టెక్కింది. మరి అలాంటి డైరక్టర్ ను, నితిన్ ను కలిపి 35కోట్లు పెట్టి, ఎలా రికవరీ అవుదామనుకున్నారో?
నేనే రాజు నేనే మంత్రి బ్లాక్ బస్టర్ అయింది. అయినా ఇప్పటికి వచ్చిన కలెక్షన్లు ఏమేరకు? ఇరవై కోట్ల వరకు. శాటిలైట్ అన్నీ కలుపుకుంటే ముఫై అయిదు కోట్ల మేరకు. లై కూడా అంతటి బ్లాక్ బస్టర్ అయితే వచ్చేది ఆ ముఫై అయిదు కోట్ల మేరకు. అంతకు మించి ఎలా వస్తుంది అని అనుకున్నారు? విడుదల తరువాతి సంగతి అలా వుంచండి. విడుదల ముందు రావాల్సినంత వస్తే, అది హీరో గొప్పదనం అవుతుంది. నేనే రాజు నేనే మంత్రికి విడుదల ముందు 16కోట్ల వరకు వచ్చిదంటే అది హీరో క్రేజ్.
అలా వచ్చేదే అయి వుంటే విడుదలకు ముందే శాటిలైట్, హిందీ డబ్బింగ్ వగైరాల ద్వారా లై సినిమాకు ఓ పది పదిహేను కోట్లకు పైగా వచ్చేయాలి కదా? మరి అలా రానపుడు అలాంటి హీరో మీద 35కోట్లు ఇన్వెస్ట్ చేయడం ఏ మేరకు సబబు. దాన్ని సాహసమే అనాలి. ఎందుకంటే విడుదలకు ముందు 15కోట్లు వచ్చేస్తాయి అనుకున్నా, మరో ఇరవై కోట్లు లాగాలి అంటే అది బ్లాక్ బస్టర్ కావాలి.
ఆ పైన రెండో వారం నుంచి మాత్రమే లాభాలు మొదలవుతాయి. నేనే రాజు నేనే మంత్రికి ఇదే విధంగా 35కోట్లు పెట్టి వుంటే, ఇప్పటికీ ఇంకా నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ కాకపోయి వుండేది. ఆ సినిమా బడ్జెట్ కేవలం 15 కోట్ల రేంజ్ లో వుండబట్టి కదా? ఇంత హ్యాపీగా వున్నారు.
జయ జానకీ నాయక సినిమానే తీసుకోండి. అది కూడా దాదాపుగా ఫస్ట్ వీక్ లో అన్నీ కలిపి 16కోట్ల వరకు వసూలు చేసింది. మిగిలినవన్నీ కలిపి పాతిక వరకు వచ్చేసింది అనుకుందాం. అయినా కష్టమేగా? ఎందుకంటే ఖర్చే నలబై కోట్ల వరకు అయింది. అందువల్ల, ఇవ్వాల్టి రోజుల్లో మీడియం రేంజ్ హీరో మీద 15కోట్లకు మించి పెట్టడం అన్నది పూర్తిగా సాహసమే. మీడియం రేంజ్ హీరో, మీడియం రేంజ్ డైరక్టర్, మీడియం రేంజ్ బడ్జెట్ మంచి కథ, కథనాలు, అన్నది ఇఫ్పుడు టాలీవుడ్ కు సేఫెస్ట్ ఫార్ములా అనుకోవాలి.
ఫిదా ఖర్చు 16కోట్లు. మీడియం రేంజ్ హీరో, మీడియం రేంజ్ డైరక్టర్. సినిమా హిట్ అయింది కాసులు కురుస్తునాయి. అదే సినిమాకు నలభై కోట్ల బడ్జెట్ పెడితే ? బ్లాక్ బస్టర్ అయినా సుఖం వుండదు. ఈ విషయంలో శర్వానంద్, నాని బెటర్. వాళ్లు తమ సినిమాల బడ్జెట్ ను అదుపు దాటనివ్వడం లేదు. 15కోట్ల లోపు రేంజ్ లోనే వుంచుతున్నారు.
సినిమా ఏవరేజ్ అనిపించుకున్నా, నిర్మాత కుదేలైపోరు. రాధ సినిమా ఏవరేజ్ గా మిగిలిపోయింది. కానీ జస్ట్ 10కోట్ల రేంజ్ బడ్జెట్. అందువల్ల మరీ దారుణాలు జరిగిపోలేదు. నిర్మాతలే కాదు, నితిన్ కూడా ఈ విషయం తెలుసుకుని, సేఫ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. నిర్మాతల వల్ల నితిన్ ములిగిపోవడం కన్నా, నితిన్ కారణంగా నిర్మాతలు మునిగిపోకుండా వుండాలి. అప్పుడే నితిన్ కెరీర్ అలా స్మూత్ గా సాగిపోతుంది.
తరువాతి సినిమాకు ఎంత?
నితిన్ తరువాతి ప్రాజెక్టు స్వంత బ్యానర్ పైనే. పేరుకు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లాంటి పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి కానీ పెట్టుబడి అంతా నితిన్ ఫ్యామిలీదే అని వినికిడి. పవన్, త్రివిక్రమ్ గుడ్ విల్ తోడు చేస్తున్నందుకు ప్రాఫిట్ షేరింగ్ తప్పనిసరి. అలాంటపుడు కచ్చితంగా పెట్టుబడి దగ్గర జాగ్రత్తగా వుండాల్సిందే. ఎందుకంటే లాభాలు మూడు వాటాలు, పెట్టుబడి ఒక్క వాటా అన్నపుడు కచ్చితంగా వీలయినంత మీడియం బడ్జెట్ లో వెళ్లాలి.
పైగా ఆ సినిమాకు కూడా డైరక్టర్ వాల్యూ తోడు లేదు. డైరక్టర్ వాల్యూ తోడు లేకుండా మార్కెట్ కష్టం. అందువల్ల ఆ సినిమాకు నితిన్ 15కోట్ల రేంజ్ లో సరిపెడతారా? లేదా బయట వాళ్లు తనపై పెట్టినట్లు ముఫై అయిదు కోట్లు పెడతారా? చూడాలి.