బ్లూ వేల్.. బ్లూ ఫిలిం.. దానికీ దీనికీ పెద్దగా తేడాల్లేవ్.! అందుకే మరి, ఇండియాలో పోర్న్ మూవీస్‌ని బ్యాన్ చేసినట్లే, బ్లూ వేల్స్‌ని కూడా బ్యాన్ చేసిపారేశారు. అయినా బ్లూ వేల్కీ బ్లూ ఫిలింకీ లింకేంటి.? అంటారా.. లింక్ కేవలం రెండిట్లోనూ వున్న 'బ్లూ' మాత్రమే. అయితే, బ్లూ ఫిలింస్ కంటే కూడా బ్లూ వేల్ ప్రమాదకరమైనది.
బ్లూ వేల్ అంటే సముద్ర జీవి నీలి తిమింగలం కానే కాదు. ఇదొక రాక్షస క్రీడ. ఆత్మహత్యకు ప్రేరేపించే ఓ ఆట. సోషల్ మీడియా నుంచి పుట్టుకొచ్చిన 'టెక్నాలజీ వైపరీత్యం' ఈ బ్లూ వేల్. ఎక్కడ పుట్టిందో ఎలా పుట్టిందోగానీ, చాలా తక్కువ కాలంలోనే చాలా పాపులర్ అయిపోయింది. చెడు ఎంత వేగంగా పాపులర్ అవుతుందో చెప్పడానికి ఇదొక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు.
భారతదేశంలోనే ఈ వికృత క్రీడ పుణ్యమా అని చాలామంది ప్రాణాలు కోల్పోయారు.. కోల్పోతూనే వున్నారు. అధికారిక లెక్కల ప్రకారం బయటకొస్తున్న 'ఫిగర్' చిన్నదే అయినా, అనధికారికంగా ఎవరూ ఊహించని స్థాయిలో బ్లూ వేల్ మరణాలున్నాయనేది జీర్ణించుకోలేని వాస్తవం.
సరదాగా ప్రారంభమై, చివరికి ప్రాణం తీసెయ్యడం ఈ బ్లూ వేల్ స్పెషాలిటీ. మరి, ఇన్నాళ్ళూ ఈ బ్లూ వేల్ గురించి ఎందుకు బయటకు పొక్కలేదు.? అంటే, అదంతే. ఎలాగైతేనేం.. విషయం వెలుగు చూసింది, కేంద్రం బ్లూ వేల్పై బ్యాన్ విధించింది. అంతేనా, ఇక్కడితో 'బ్లూ వేల్' పైత్యం ఆగిపోతుందా.? అన్న ప్రశ్న తలెత్తడం సహజమే. ఇక్కడే బ్లూ ఫిలింస్ ప్రస్తావన తీసుకురావాల్సి వస్తోంది. దేశంలో పోర్న్ సినిమాలకు సంబంధించి నిషేధాజ్ఞలు వున్నాయి.
కానీ, ఇంటర్నెట్ విప్లవం పుణ్యమా అని, ఆ బ్యాన్‌కి అర్థం పర్థం లేకుండా పోయింది. కొంతమంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పోర్న్ వెబ్సైట్లను బ్లాక్ చేసినా, చాలామంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు మాత్రం కేంద్రం ఆదేశాల్ని పట్టించుకోవడంలేదు. ఇంకేముంది, యధేచ్ఛగా దేశంలోకి పోర్న్ సినిమాలు డౌన్లోడ్ అయిపోతున్నాయి. ఈ బ్లూ వేల్ బ్యాన్ వ్యవహారం కూడా ముందు ముందు అలాగే మారుతుందేమో.!