వాలంటీర్ వ్య‌వ‌స్థ కావాలి…వాలంటీర్లు వ‌ద్దు!

వాలంటీర్ల‌పై ఒక ప‌థ‌కం ప్ర‌కారం ప్ర‌తిప‌క్షాలు దుష్ప్ర‌చారం చేస్తున్నాయి. ఇందుకు జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను టీడీపీ చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటోంది. చంద్ర‌బాబు ఆదేశిస్తే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏ ప‌నైనా చేస్తార‌నే వైసీపీ ఆరోప‌ణ‌ల‌కు బ‌లం క‌లిగించేలా ఆయ‌న…

వాలంటీర్ల‌పై ఒక ప‌థ‌కం ప్ర‌కారం ప్ర‌తిప‌క్షాలు దుష్ప్ర‌చారం చేస్తున్నాయి. ఇందుకు జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను టీడీపీ చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటోంది. చంద్ర‌బాబు ఆదేశిస్తే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏ ప‌నైనా చేస్తార‌నే వైసీపీ ఆరోప‌ణ‌ల‌కు బ‌లం క‌లిగించేలా ఆయ‌న న‌డ‌వ‌డిక కూడా వుంటోంది. అతి పెద్ద వ్య‌వ‌స్థ అయిన వాలంటీర్ల‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఎందుకంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ సార‌థ్యం వ‌హిస్తున్న జ‌న‌సేన‌కు ఇంత వ‌ర‌కూ తాడు బొంగ‌రం లాంటివేవీ లేవు.

వాలంటీర్లు, ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చినా త‌న‌కు కొత్త‌గా రాజ‌కీయంగా పోయేదేమీ లేద‌నేది ప‌వ‌న్‌క‌ల్యాణ్ భావ‌న‌. అందుకే ఆయ‌న వాలంటీర్ల‌ను బ్రోక‌ర్లుగా, రేపిస్టులుగా అభివ‌ర్ణించారు. టీడీపీ విష‌యానికి వ‌స్తే లౌక్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. వాలంటీర్ల‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల్ని ముందుకు పెట్టి, వాటి కేంద్రంగా రాజ‌కీయం న‌డుపుతోంది. మ‌రోవైపు వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కు తాము వ్య‌తిరేకం కాద‌ని స్ప‌ష్టం చేసింది.

టీడీపీ అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తామ‌నే ప్ర‌చారంలో నిజం లేద‌ని టీడీపీ ప్ర‌క‌టించింది. అయితే ఇక్క‌డ కిటుకు వుంది. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను స‌మ‌ర్థించ‌డం వెనుక టీడీపీ భారీ వ్యూహం వుంది. సుమారు 2.50 లక్ష‌ల మంది ఉన్న వాలంటీర్ల‌ను చెడ్డ చేసుకోకూడ‌ద‌ని టీడీపీ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. వాలంటీర్ల‌తో శ‌త్రుత్వం అంటే రాష్ట్ర వ్యాప్తంగా 10 ల‌క్ష‌ల ఓట్ల‌ను వ‌దులుకోవ‌డ‌మే అని టీడీపీకి బాగా తెలుసు.

వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగిస్తామ‌ని చెప్ప‌డం అంటే…జ‌గ‌న్ తీసుకొచ్చిన వాలంటీర్ల‌ను మాత్రం కొన‌సాగించేది లేద‌నే నిగూఢ‌మైన అర్థం దాగి వుంది. కానీ ఆ మాట‌ను బ‌య‌టికి చెప్ప‌రు. ఎందుకంటే టీడీపీకి వ్య‌తిరేకంగా వాలంటీర్లంతా ప‌ని చేస్తార‌నే భ‌యం వారితో నిజాలు మాట్లాడ‌నివ్వ‌డం లేదు. జ‌గ‌న్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కు జై కొడుతూనే, వాలంటీర్ల‌ను మాత్రం ప‌క్క‌న పెట్ట‌డం ఖాయం.