జనసేన పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉన్నదంటే.. ‘మీ పార్టీలో చేరుతాను సార్’ అని ఎవరు వచ్చినా సరే.. తక్షణం వారిని చేర్చేసుకుని.. వారి వలన తమ పార్టీ ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా ఎదిగిపోతుందని గప్పాలు కొట్టే వాతావరణం కనిపిస్తోంది. తాము ఉన్న పార్టీలో ఠికానా లేక, జనసేనలోకి వస్తున్న నాయకులకు పవన్ కల్యాణ్ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు.
నిన్న- చీరాల నియోజకవర్గానికి చెందిన ఆమంచి రాములు, ఇవాళ- పెందుర్తి నియోజకవర్గం ఆశిస్తున్న పంచకర్ల రమేష్ బాబు! వీరి స్వాగత సంరంభాల సంగతి తర్వాత.. అయితే తెలుగుదేశంతో పొత్తు తలపెడితే మాత్రం ఇరు పార్టీల మధ్య ముసలం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విశాఖపట్టణం జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పవన్ కల్యాణ్ ను కలిసి జనసేనలో చేరడానికి 20 తేదీ ముహూర్తం ప్రకటించేశారు. పార్టీ జోష్ లోనే ఉంది. కాకపోతే పవన్ తో భేటీ తర్వాత పంచకర్ల మాట్లాడుతూ… జనసేన పార్టీలో ఒక సామాన్య కార్యకర్తలాగానే సేవలందిస్తానని.. అత్యంత నాటకీయమైన అబద్ధాలను చిలకపలుకుల్లాగా వల్లించారు.
పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానని, ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని ఆయన సెలవిచ్చారు. ఇంతకంటె కామెడీ మరొకటి ఉండకపోవచ్చు. కానీ, పార్టీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. పంచకర్ల రమేష్ బాబు.. తాను గతంలో ప్రజారాజ్యం పార్టీనుంచి గెలిచిన పెందుర్తి స్థానం నుంచి తనకు మళ్లీ టికెట్ దక్కేలా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతనే.. వచ్చి పవన్ ను కలిసినట్టుగా తెలుస్తోంది.
అయితే పవన్ తనంత తాను సీటు హామీలు ఇచ్చేస్తున్నారు గానీ.. తెదేపాతో పొత్తులదాకా వచ్చేసరికి ముసలం తప్పకపోవచ్చు! ఎందుకంటే.. పెందుర్తి నుంచి 2009లో పంచకర్ల చేతిలో ఓడిపోయిన తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి 2014లో గెలిచారు. 2019లో మళ్లీ వైసీపీ చేతిలో ఓడిపోయారు. తెదేపాలో ఆయన సీనియర్ నేత. పార్టీ కష్టకాలంలో అండగా ఉంటూ.. తరచూ మీడియా ముందు జగన్ మీద విమర్శలు కురిపిస్తూ ఉండే నేత. పంచకర్ల కోసం తెలుగుదేశం ఆయనను బలిచేయడానికి సిద్ధమేనా? అనేది ప్రజల సందేహం.
ఇప్పటికే సీట్ల సర్దుబాటు వద్ద తకరారు తప్పేలా లేదు. తెనాలి సీటు విషయంలో నాదెండ్ల మనోహర్ ఆల్రెడీ ఒక ఫిటింగ్ పెట్టారు. అక్కడ తెదేపా మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా తో మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు ఈ గొడవల జాబితాలోకి పెందుర్తి కూడా చేరుతోంది. ముందుముందు పొత్తు ప్రకటన వచ్చేలోగా.. ఇంకెన్ని ఫిటింగ్ నియోజకవర్గాలు ఆవిర్భవిస్తాయో చూడాలి.