ఆంధ్రలో బిజెపి పరిస్థితి ఏమీ బాగా లేదు. చాలాకాలంగా టిడిపి మఱ్ఱిచెట్టు నీడలో ఉండిపోయి, ఎదగకుండా ఉందని పార్టీ పగ్గాలను కన్నాకు అప్పగిస్తే ఆయన దాన్ని ఆ నీడలోనే ఉంచుదామని చూశాడు. దాంతో విసుగెత్తి బాబు అంటే అస్సలు పడని సోముకి అప్పగిస్తే, ఆయన బాబుని నిందించడం తప్ప వేరేమీ చేయలేక పోయాడు. గుళ్లలో చోరీలు అంటూ కాస్త హడావుడి చేయబోయినా జగన్ వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుని దాని ప్రభావం లేకుండా చేశాడు. ఇక బిజెపికి, జనసేనకు ఉన్న పొత్తు వట్టి నోటిమాటగానే నిలిచింది తప్ప ఆచరణలో అమలు కాలేదు. దానికి కారణం పవన్ కళ్యాణ్ ధోరణి, బిజెపి అధిష్టానం జాగ్రత్త అనుకోవాలి తప్ప సోము వ్యక్తిగతంగా దీనిలో చేసినది, చేయగలిగినదీ ఏమీ లేదు. పవన్‌ను దూరం చేసుకున్నావంటూ కన్నా సోమును తప్పుపట్టడంలో అర్థం లేదు. పవన్ కేంద్ర బిజెపితోనే తప్ప రాష్ట్ర బిజెపిని ఎప్పుడూ పట్టించుకోలేదు. సోము స్థానంలో వేరెవరున్నా అంతకంటె ఏమీ చేసేవారు కాదు.
పవన్ టిడిపికి ఆప్తుడు కాబట్టి, సోము అతనితో కలిసి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి, సోము వైసిపికి ఆప్తుడంటూ బిజెపిలోని టిడిపి అనుకూల వర్గాల సోముపై నింద వేశాయి. సోము సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయి కల నాయకుడు కాదు. అధిష్టానం ఏం చెప్తే అదే చేస్తాడు. ఇప్పుడీ పదవి నుంచి తీసేసినంత మాత్రాన కన్నాలా వెళ్లి వేరే పార్టీలో చేరడు. ఆంధ్ర బిజెపిలో టిడిపి అనుకూల, వ్యతిరేక (వీళ్లను వైసిపి అనుకూల అనలేము) వర్గాలు ఎప్పణ్నుంచో ఉన్నాయి. అందుకే అది ఎదగడం లేదు. పైగా విభజనాంతరం బిజెపి ఆంధ్రకు అన్యాయం చేసిందన్న ఫీలింగ్సూ ఓటర్లలో ఉన్నాయి. మేం కేంద్ర నిధులిచ్చామంటూ ఎన్ని అంకెలు వల్లించినా లాభం లేదు. ఇవి తక్కిన రాష్ట్రాలకూ యిస్తున్నవే అని పెదవి విరిచేస్తున్నారు. రాష్ట్రానికి బిజెపి అనుకూలంగా వ్యవహరిస్తోంది అని ఏ పత్రికా రాయదు, ఏ టీవీ చెప్పదు. టీవీ చర్చల్లో బిజెపి ప్రతినిథులు ఆ విషయానికి వచ్చేసరికి డిఫెన్సివ్‌గా ఉంటారు.
ప్రత్యేక హోదా ఏది అనగానే వద్దన్న చంద్రబాబు తప్పది అంటూ ఆయనపై తోసేస్తారు. తప్పు చేస్తే సవరించాలి కదా. ఆంధ్రప్రజల పట్ల మీకు బాధ్యత లేదా? రాజ్యసభలో మీ పార్టీ ప్రతినిథి వెంకయ్య నాయుడు ఏం మాట్లాడారు? మీ మానిఫెస్టోలో ఏం రాశారు? అని అడిగితే సమాధానం ఉండదు. 2024లో పార్లమెంటు స్థాయిలో మోదీకి ఓట్లు పడవచ్చు కానీ, ఆంధ్ర ఎసెంబ్లీకి మాత్రం స్థానిక బిజెపి అభ్యర్థులకు ఓట్లు పడడం కష్టం. ఎందుకంటే యిన్నాళ్లూ వీళ్లు చేస్తున్న కార్యక్రమాలేవీ లేవు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు టిడిపికి పోతుంది తప్ప, బిజెపికి రాదు. పైకి ఏం చెప్పినా, ఎంత అరుచుకున్నా బిజెపి, వైసిపి పరస్పరానుబంధం అందరికీ తేటతెల్లం. బిజెపి పట్ల రాష్ట్రంలో వ్యతిరేక వాతావరణం ఉన్న యిటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పురందేశ్వరి బాధ్యత చేపడుతున్నారు.
సోము వీర్రాజు ర్యాంక్స్ నుంచి వచ్చినవారు. సామాన్య కార్యకర్త కూడా ఆయన్ని ఎప్రోచ్ కాగలడు. పురందేశ్వరి స్టేచర్ వేరు. ఎన్టీయార్ కూతురిగా, విద్యాధికురాలిగా, మాజీ కేంద్రమంత్రిగా ఆవిడకున్న గ్లేమర్ వేరు. ఏ సమయంలోనైనా వెళ్లి యీవిడింటి తలుపు తట్టవచ్చు అని ఎవరూ అనుకోరు. భర్తకు ప్రజలతో నిత్యసంపర్కం ఉన్నా, ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది 45 ఏళ్లు దాటాకే! తండ్రిని అనుక్షణం వేధించిన కాంగ్రెసు పార్టీలో చేరి ఎకాయెకీ ఎంపీ అయిపోయి, ఆపై కేంద్రమంత్రి అయిపోయి, రాష్ట్రవిభజనలో ఓ చెయ్యి వేసి, సరిగ్గా ఎన్నికలకు ముందు విభజనకు వ్యతిరేకంగా అంటూ కాంగ్రెసు లోంచి రాజీనామా చేసి, విభజనలో పాలుపంచుకున్న మరో పార్టీ బిజెపిలోకి గెంతేసిన అవకాశవాది. ఆమె భర్త కూడా చాలా పార్టీలే మారి, ప్రస్తుతం వైసిపిలో ఉన్నట్లున్నారు.
ఆరెస్సెస్ నేపథ్యమో, బిజెపి నేపథ్యమో ఉన్న కార్యకర్తలు, నాయకులు యీవిణ్ని ఏ మేరకు ఆమోదంచగలరో నాకు తెలియదు. మోదీ మొహం చూసి… అంటూ పని చేయాలంతే. పైగా యీవిడ ఆంధ్రకు చుట్టపుచూపుగా వచ్చే హైదరాబాదీ. ఎన్నికలు మంచుకొస్తున్నాయి. ప్రెస్ మీట్‌లలో చక్కటి ఉపన్యాసం యివ్వడం వేరు. సామాన్య కార్యకర్తలతో కలిసి తిరిగి, రాష్ట్రమంతటా కార్యక్రమాలు నిర్వహించడం వేరు. ఈ ఎసైన్‌మెంట్ ఎలా నిర్వహిస్తారో వేచి చూడాలి. అది కాలమే చెపుతుంది. ఈ లోపున ఆవిణ్ని ఎంపిక చేయడంలో బిజెపి పరిగణించిన అంశాలేమిటి అనేది మనం ఆలోచిస్తే, కుల సమీకరణాలు ప్రధానంగా తడతాయి.
రెడ్లు వైసిపికి, కమ్మలు టిడిపికి విధేయత చూపుతున్న ఆంధ్ర రాజకీయాల్లో మరో ప్రధాన కులమైన కాపులను అక్కున చేర్చుకోవాలనే ఆలోచనతో కాబోలు బిజెపి కాపు కులస్తులను రాష్ట్రాధ్యక్షులుగా నియమించింది, కాపు ఓటు బ్యాంకు ప్రధానంగా కల జనసేనతో పొత్తు పెట్టుకుంది. అయినా యిప్పటిదాకా ఫలితం కనబడలేదు. ఇప్పుడీ నియామకంతో కమ్మ కులస్తులకు గేలం వేసిందని అనుకోవాలి. అబ్బే కాదు, జగన్ సిఫార్సు మీద, టిడిపితో తమకు పొత్తు లేదని చాటి చెప్పడానికి బాబంటే పడని పురందేశ్వరికి యీ పదవి యిచ్చారు అని కొందరంటున్నారు. జులై 18 నాటి ఎన్‌డిఏ మీటింగుకి టిడిపిని పిలవడం ద్వారానో, పిలకపోవడం ద్వారానో (యిప్పటిదాకా పిలుపు లేదు) బిజెపి టిడిపి పట్ల తన అభిప్రాయాన్ని చెప్పేయబోతోంది. ఆ భాగ్యానికి పురందేశ్వరిని నియమించ వలసిన పని లేదు. పైగా రేపుమర్నాడు బిజెపి టిడిపితో కలవాలనుకుని ‘బాబుతో చర్చలు జరుపు’ అంటే పురందేశ్వరి ‘నేనొప్పుకోను’ అనరు. రాజకీయాల్లో శత్రుత్వం శాశ్వతం కాదు.
అలాగే బిజెపి-వైసిపి స్నేహం కూడా శాశ్వతం కాదు. తమకు సీట్లు తగ్గే తక్కిన రాష్ట్రాలపై దృష్టి పెట్టడం చేత బిజెపి ఆంధ్రపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. పైగా అవసరం లేదు కూడా. ఎందుకంటే టిడిపి, వైసిపి, జనసేనల్లో ఏ పార్టీ నెగ్గినా, రాష్ట్రానికి చెందిన 25 ఎంపీలు పార్లమెంటులో బిజెపికే ఓటేస్తారు. దాని ప్రధాన శత్రువైన కాంగ్రెసు ఆంధ్రలో సోదిలో లేదు. 2024 తర్వాత బిజెపి ఆంధ్రపై గట్టిగా ఫోకస్ పెట్టవచ్చు. 2029 నాటికి తగుపాటి విజయం సాధించాలన్నా ఐదేళ్ల ముందే కృషి మొదలు పెట్టాలి కదా. గతంలో టిడిపికి అప్పచెప్పినట్లు, రాష్ట్రాన్ని పూర్తిగా వైసిపికే అప్పచెపితే తాము సొంతంగా ఎప్పుడు ఎదుగుతారు? వైసిపికి సాయం చేయడానికే చంద్రబాబుతో వైరం ఉన్న పురందేశ్వరిని ఎంపిక చేశారనడం సమంజసం కాదు. దానికి వేరే కారణం ఉండవచ్చు. అదేమిటో వెతకాలి.
ఇక్కడ మనం పరిగణనలోకి తీసుకోవలసినది ధనిక, మధ్యతరగతి కమ్మవారి భవిష్య ప్రణాళికల గురించి. వాళ్లకు వైసిపి అంటే అసహ్యం. టిడిపి అంటే వలపు. కానీ యీ ఎన్నికలలో టిడిపి గెలవకపోతే పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించాలి కదా! గెలవని పక్షంలో కనీసం ఓ 60 సీట్లయినా గెలిస్తే పార్టీ నిలబడుతుంది. 2029 వరకు బాబు పార్టీని లాక్కుని వెళతారు. కానీ ఆ నడక నీరసంగానే సాగుతుంది. దానిపై పెట్టుబడి పెట్టడానికి పార్టీ అభిమానులు శంకిస్తారు. ఇప్పటికే ‘నౌ ఆర్ నెవర్’ పోరాటం చేస్తూన్నా లోలోపల శంకలున్నాయి. ఉప యెన్నికలలోనో, స్థానిక ఎన్నికలలోనే బాగా గెలిచి ఉంటే ఆ పరిస్థితి వేరేలా ఉండేది. వైసిపి అంటే ప్రజలు అసహ్యించు కుంటున్నారని తమకు తామే చెప్పుకుని మురుస్తున్నారు తప్ప క్షేత్రస్థాయి ఎన్నికలలో అది నిరూపితం కావటం లేదు. 25కి 24 ఎంపీ సీట్లు వైసిపికి వచ్చేస్తాయని చెప్పిన టైమ్స్ నౌ సర్వే బోగస్ కావచ్చు. కానీ మోదీ కారణంగా బిజెపికి 3-4 పోయినా, వైసిపికి ఏ పదహారో వస్తే మూడింట రెండు వంతులు వచ్చినట్లేగా, అది అసెంబ్లీ సీట్లకు తర్జుమా అయితే 115 సీట్లవుతాయి. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే తమను బతకనిస్తాడా? అనే చింత యీ వర్గాలకు ఉండడంలో ఆశ్చర్యం లేదు. టిడిపి అధికారంలోకి రాలేకపోతే తమ ప్లాన్ బి ఏమిటి?
ఇక్కడ సిపిఐ కథను గుర్తు చేసుకోవాలి. ప్రస్తుతం చలామణీ అయ్యే వాట్సాప్‌లను చదువుతూంటే కాంగ్రెసు విధానాలను నెహ్రూ ఒంటి చేత్తో శాసించేసే వాడని అనుకునే ప్రమాదం ఉంది. ఆనాటి పార్టీలలో ప్రముఖమైనది కాంగ్రెసు ఒకటే కాబట్టి, కాపిటలిస్టుల నుంచి సోషలిస్టుల దాకా ఫక్తు మతవాదుల నుంచి నాస్తికుల దాకా, వివిధ సిద్ధాంతాల, వివిధ విశ్వాసాల ప్రజలు దానిలో చేరేవారు. మతపరమైన విషయాల్లో, ఆర్థిక పరమైన విషయాల్లో నెహ్రూ మార్గాన్ని వ్యతిరేకించేవారే ఎక్కువ. నెహ్రూ సామ్యవాదానికి. ఉదారవాదానికి, సైంటిఫిక్ టెంపర్‌మెంట్‌కి ప్రజల్లో ఆదరణ, ఆకర్షణ ఉంది కానీ కాంగ్రెసులో మెజారిటీ నాయకులది పెట్టుబడిదారీ ధోరణే. నెహ్రూకి ఎప్పటికప్పుడు ముకుతాడు వేసి, ముందుకు నడన నిచ్చేవారు కాదు. అందుకే 1956 ఆవడి కాంగ్రెసు సమావేశంలో సామ్యవాదం మా మార్గం అని ప్రకటించినా ఆ దిశగా కాంగ్రెసు పెద్దగా అడుగులు ముందుకు వేయలేదు.
ఇటు సామ్యవాదం, సమసమాజం అని పలవరిస్తున్న కమ్యూనిస్టులకు ప్రజల్లో పెద్దగా ఆదరణ లేదు. అందువలన కమ్యూనిస్టుల్లో డాంగే వర్గం ఒక ప్రతిపాదన చేశారు. ‘మనం ఎన్నటికీ అధికారంలోకి రాలేము, సామ్యవాదాన్ని ఆచరణలోకి తేలేము. బలం ఉన్నది కాంగ్రెసుకే. మనమే దానిలో చేరిపోయి, దానిలోని సామ్యవాద వర్గాలకు అండగా నిలబడి, కాంగ్రెసులోని రియాక్షనరీ (ప్రతీప అని అనేవారు) శక్తులను ఓడించే ప్రయత్నం చేద్దాం, మన ఆలోచనలను, ప్రణాళికలను కాంగ్రెసు ద్వారా అమలు చేద్దాం.’ అని. ఆ విధంగా కొందరు కమ్యూనిస్టులు కాంగ్రెసులో ప్రత్యక్షంగా చేరారు, బయట సిపిఐ కాంగ్రెసుకి మద్దతుగా నిలిచింది. ఈ విధానంతో ఏకీభవించని సిపిఎం విడిగా ఉండిపోయింది. కాంగ్రెసులోని మొరార్జీ వర్గం వంటి రైటిస్టులను ఓడించడానికి ఇందిర మితవాద కమ్యూనిస్టుల మద్దతు తీసుకుని, వాళ్ల కోరిక మేరకు బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, కొన్ని పరిశ్రమలను స్మాల్ స్కేల్‌కు కేటాయించడం వంటి సామ్యవాద విధానాలను అమలు చేసింది. తను బాగా బలపడిన తర్వాత సంజయ్ ద్వారా వీళ్లను వదిలించుకోవడం తర్వాతి చరిత్ర.
ఇప్పుడు కమ్మల్లో కూడా సిపిఐ లాటి ఊహే వచ్చి ఉండవచ్చు. కేవలం టిడిపినే నమ్ముకుని కూర్చోవడం కంటె మనలో కొందరం బిజెపిలోకి వెళ్లి దానికి మద్దతిస్తూ మనకు అనుకూలమైన విధంగా అది వ్యవహరించేట్లా చూసుకుంటే మన ప్రయోజనాలు కాపాడబడతాయి అని. కేంద్రంలో బిజెపి యింకో దశాబ్దం దాకా పాలించేట్లు కనబడుతోంది. దాని ఛత్రచ్ఛాయలో మనం ఉన్నంతకాలం జగన్ ఏమీ చేయలేడు అనే లెక్క వేసి ఉండవచ్చు. బిజెపి ఆంధ్ర అధ్యక్ష పదవి చేపడదామని చూశారని వార్తల్లోకి వచ్చిన సుజనా చౌదరి, పురందేశ్వరి అందరూ ఆ కులస్తులే. దీన్ని పసిగట్టిన బిజెపి నువ్వొకందుకు పోస్తే నేను ఒకందుకు తాగుతున్నాను అన్నట్లు వాళ్లని ఆహ్వానించ దలచింది. ఎందుకంటే ఎలాగోలా వాళ్ల శ్రేణులు పెరగాలి. అదీ యిక్కడా ఒక పెద్ద పార్టీయేనని అందరికీ అనిపించాలి. దాని తరఫున మాట్లాడేవారు బహుళంగా ఉండాలి.
అందుకే పురందేశ్వరిని ఎంపిక చేసింది. బిజెపి పట్ల యిప్పటిదాకా చూపిన వైఖరికి విరుద్ధంగా తెలుగు మీడియా ఆమెకు ప్రస్తుతం యిస్తున్న కవరేజి చూస్తే యీ ఊహ మరింత బలపడుతోంది. దానికి తోడు చార్జి తీసుకున్న మర్నాడే అమరావతి రైతులు ఆవిణ్ని కలవడంతో, గతంలో కూడా ఆవిడ గాజులు యివ్వకపోయినా వాళ్లకు మద్దతు యివ్వడం చేశారని గుర్తుకు రావడం జరిగాయి. తెలంగాణలో యీ మధ్య ట్రెండ్ ఆగింది కానీ ఒక దశలో బిజెపిలో చాలామంది నాయకులు చేరబోయారు. ఆంధ్ర బిజెపికి ఆ భాగ్యం ఎన్నడూ దక్కలేదు. కాంగ్రెసు పతనం కాగానే వైసిపి అంటే పడని కొందరు కాంగ్రెసు నాయకులు టిడిపిలోకి బదులుగా బిజెపిలోకి వెళ్లారు. తర్వాత కొంతమంది టిడిపి వాళ్లు చేరి, టిడిపి ఏజంట్లగానే పని చేస్తూ వచ్చారు.
తాజా ఉదాహరణ బిజెపి-టిడిపి పొత్తు ఉంటుందని ఆదినారాయణ రెడ్డి చేసిన ప్రకటన. టిడిపితో ప్రత్యక్ష అనుబంధం లేని కమ్మ ప్రముఖులను పురందేశ్వరి పార్టీలోకి తీసుకుని వచ్చి నాయకుల్ని చేస్తారేమో చూడాలి. ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు అప్పటిదాకా రాజకీయాల్లో లేని యువతీయువకులు, ఔత్సాహికులు, మేధావులు, విద్యావంతులు టిడిపిలో చేరినట్లు, యిప్పుడు పురందేశ్వరి నాయకత్వంలోని బిజెపిలోకి సామాజిక ప్రముఖులు, మేధావులు చేరవచ్చేమో చూడాలి. బిజెపి అధిష్టానం ‘ఔట్‌రీచ్’ కార్యక్రమంలో భాగంగా అన్ని రంగాలలోని ప్రముఖులను కలుస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని కమ్మ కులస్తులు పెద్ద సంఖ్యలో బిజెపిలో చేరతారేమో చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2023)