డ్రీమ్ వారియర్స్… సౌత్ లోని పెద్ద ప్రొడక్షన్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. మరీ ముఖ్యంగా కోలీవుడ్ లో చురుగ్గా ఉన్న కంపెనీ ఇది. ఏడాదికి కనీసం 2 లేదా 3 సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఇలాంటి కంపెనీ ఇప్పుడు కంటెంట్ పరంగా రూటు మార్చినట్టు కనిపిస్తోంది.
స్టార్ హీరోలతో సినిమాలు పక్కనపెట్టి ఒకేసారి 2 ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ లాంచ్ చేసింది ఈ బ్యానర్. ఈమధ్య రష్మిక లీడ్ రోల్ లో రెయిన్ బో అనే సినిమాను ప్రారంభించింది డ్రీమ్ వారియర్స్.
ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకముందే, మరో లేడీ ఓరియంటెడ్ మూవీ స్టార్ట్ చేసింది. ఈసారి కీర్తిసురేష్ లీడ్ రోల్ లో గణేశ్ రాజ్ అనే వ్యక్తిని డైరక్టర్ గా పరిచయం చేస్తూ కొత్త సినిమాను ప్రారంభించింది.
గమ్మత్తైన విషయం ఏంటంటే… రష్మిక, కీర్తిసురేష్ చేయబోతున్న సినిమాలు రెండూ థ్రిల్లర్ జానర్ కు చెందినవే. ఈ రెండు సినిమాల కంటే ముందు ఫర్హానా అనే మరో సినిమాను ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసింది డ్రీమ్ వారియర్స్. ఇందులో ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ పోషించింది. ఇది కూడా మహిళా ప్రాధాన్యంగా తెరకెక్కిన సినిమానే.
మొన్నటివరకు స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన ఈ బ్యానర్ ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా హీరోయిన్లతో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యానర్ చేతిలో ఉన్న ఒకే ఒక్క హీరో కార్తి.