విశాఖ నుంచి రాష్ట్ర పాలన.. డేట్ ఫిక్స్ చేసిన జగన్…!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చిరకాల కోరికను నెరవేర్చుకోనున్నారు. దాదాపుగా నాలుగేళ్ళుగా జగన్ విశాఖ నుంచి పాలించాలని చూస్తున్నారు. ఇప్పుడు అది సాకారం కాబోతోంది. మరి కొద్ది రోజులలో ముఖ్యమంత్రి విశాఖ నుంచి…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చిరకాల కోరికను నెరవేర్చుకోనున్నారు. దాదాపుగా నాలుగేళ్ళుగా జగన్ విశాఖ నుంచి పాలించాలని చూస్తున్నారు. ఇప్పుడు అది సాకారం కాబోతోంది. మరి కొద్ది రోజులలో ముఖ్యమంత్రి విశాఖ నుంచి పాలించబోతున్నారు.

విశాఖకు జగన్ ఈ నెల 8వ తేదీకి రానున్నారు అని తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి జిల్లా అధికార వర్గాలకు కీలకమైన సమాచారం అందింది. డిసెంబర్ 8, 9 తేదీలలో విశాఖలోనే జగన్ ఉంటారు. ఆ విధంగా జగన్ విశాఖ నుంచి పాలనను ఒక శుభ ముహూర్తాన లాంచనంగా ప్రారంభిస్తారు అని అంటున్నారు.

రాష్ట్రంలోని కీలకమైన శాఖలు ముప్పయి దాకా ఉన్నాయి అలా ఆయా శాఖల అధికారులకు విశాఖలో కార్యాలయాలు సిద్ధం అయ్యాయి. ముఖ్యమంత్రి బస చేయడానికి అలాగే ఆయన క్యాంప్ అఫీస్ కోసం భవనాలను రెడీ చేసి పెట్టారు. దాంతో ముఖ్యమంత్రి జగన్ రాక అన్నది కచ్చితం అని తెలుస్తోంది.  డిసెంబర్ 8 9 తేదీలలలో రెండు రోజుల పాటు జగన్ విశాఖలోనే ఉంటూ విశాఖ క్యాంప్ ఆఫీస్ నుంచే రాష్ట్ర పాలన సాగిస్తారని అంటున్నారు.

క్యాంప్ ఆఫీస్ నుంచే పలు శాఖలకు సంబంధించి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని అంటున్నారు. విశాఖ మన పరిపాలనా రాజధాని అని ఇప్పటికే మంత్రులు పలు మార్లు ప్రకటించి ఉన్నారు. అది ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. విశాఖ నుంచి సీఎం పాలన మొదలెడితే కనుక రాష్ట్ర రాజకీయాలలో సైతం సమీకరణలు మారిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. విశాఖను ఏ రాజకీయ పార్టీ కూడా కాదనలేని విధంగా పరిస్థితిని కల్పిస్తోంది వైసీపీ అని అంటున్నారు.