మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మంత్రి రోజా విరుచుకుపడ్డారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలెవరినీ ఆమె విడిచిపెట్టలేదు. పంచ్ డైలాగ్‌లతో చెలరేగిపోయారు. ఇంతకాలం ఎమ్మెల్యేగా ఒక లెక్క, ఇకపై మంత్రిగా మరో లెక్క అని ఇటీవల రోజా అన్నట్టుగానే మాటలకు పదును పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చంద్రబాబు ఉన్మాది అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుకంటే ఉన్మాది ఈ రాష్ట్రంలో, దేశంలో ఎవరున్నారని ప్రశ్నించారు. సభ్యత, సంస్కారంతో మాట్లాడాలని టీడీపీ నేతలకు హితవు చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని రోజా హెచ్చరించారు.
సీఎం జగన్‌పై తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని రోజా హెచ్చరించారు. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చంద్రబాబు, ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ చీరలు కట్టుకోవాలని ఎద్దేవా చేశారు. చీర కావాలో.. చుడిదార్ కావాలో టీడీపీ నేతలు తేల్చుకోవాలన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.14,500 కోట్లు ఎగ్గొట్టినందుకు చీరలు పంపడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. కరకట్టకా లేక హైదరాబాద్‌లో మీ ఇంటికి పంపమంటారా చంద్రబాబు అని ప్రశ్నించారు. పచ్చచీరా, పసుపు చీర కావాలో చెప్పు… పంపిస్తామయ్యా అని రోజా వెటకరించారు.
మహిళ కనిపిస్తే వాటేసుకోవాలి లేదా ముద్దుపెట్టుకోవాలని చంద్రబాబు వియ్యంకుడు అనలేదా అని ఎమ్మెల్యే బాలకృష్ణను దెప్పి పొడిచారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతని ధ్వజమెత్తారు. మహిళలను బూటుకాలితో తన్నిన చరిత్ర టీడీపీదని అన్నారు. బాధితురాలికి పరామర్శ పేరుతో హడావుడి చేశారని, టీడీపీ ఎందుకు నిరసనలు చేస్తుందో అర్థం కావడం లేదని రోజా అన్నారు. మహిళల అభివృద్ధికి పాటుపడుతున్న వైసీపీ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. తాను జగన్ కేబినెట్‌లో మహిళా మంత్రి అయ్యినందుకు గర్విస్తున్నట్టు రోజా చెప్పారు.
సాధ్యమైనంత వరకూ మహిళలకు ఎలాంటి హాని జరగకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఒకవేళ ఏదైనా జరిగినా 24 గంటల్లోపు చర్యలు తీసుకుంటున్నట్టు రోజా చెప్పారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన వారిని 24 గంటల్లో అరెస్ట్ చేశామన్నారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేశామన్నారు.
ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాదిరిగా దేశంలో ఏ సీఎం కూడా వేగంగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రధానంగా చంద్రబాబు తన జీవిత కాలంలో వెంటనే చర్యలు తీసుకున్న పరిస్థితి లేదన్నారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సాయం కోరిన వాళ్లకు వెంటనే ఏ విధంగా సాయం అందించారో ఆధారాలతో సహా చూపిస్తానన్నారు.
సొంత కుటుంబంలో ఆడబిడ్డలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారో, ఆ విధంగా ఇతర మహిళల విషయంలోనూ సీఎం జగన్ ఆలోచించి చేస్తున్నారన్నారు. కానీ టీడీపీ నాయకులు, మహిళా నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడ్డం సరైంది కాదని రోజా అన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఇట్లే మాట్లాడితే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని రోజా హెచ్చరించారు.
బాధితులతో ఎలా మాట్లాడాలో, ఎలా అండగా నిలవాలో సీఎం జగన్‌ను చూసి నేర్చుకోవాలని హితవు చెప్పారు. ఎలా వుండకూడదో చంద్రబాబునాయుడిని చూసి నేర్చుకోవాలని పంచ్ విసిరారు.