తన ప్రభుత్వంలో పారదర్శక గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. సంక్షేమ పథకాల అమల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయనే సాటి. దివంగత వైఎస్సార్ హయాంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేశారు. కానీ జగన్ హయాంలో మాత్రం అగ్రస్థానం సంక్షేమానికే. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపికలో అర్హతలే ప్రామాణికం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నట్టు రాజకీయాలు, కులాలు, ప్రాంతాలు, సిఫార్సులు, అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. నేరుగా బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ అవుతోంది. ఇది నిజం. ఇదే సందర్భంలో అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు ఇవ్వడంలో విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటోంది. జగన్ ప్రభుత్వంలో సర్కార్ పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు భయపడే పరిస్థితి.
ఈ నేపథ్యంలో తెలిసోతెలియకో ప్రభుత్వ పనులు చేసిన వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రెండేళ్లుగా బిల్లులు రాక నానాయాతన పడుతున్నారు. వీరిలో అత్యధికులు వైసీపీ కాంట్రాక్టర్లే ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో బుధవారం ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఖాజీపేట మండలం అప్పన్నపల్లి గ్రామ సచివాలయానికి కాంట్రాక్టర్ తాళం వేశాడు. రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన కాంట్రాక్టర్ చివరికి చేసేదేమీ లేక సచివాలయాన్ని మూసివేశాడు.
వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. అప్పట్లో జగన్ అంటే మాట తప్పడు, మడమ తిప్పడు అనే నినాదానికి బ్రాండ్ అంబాసిడర్. ఈ నేపథ్యంలో అప్పన్నపల్లెలో సచివాలయ నిర్మాణానికి వాసుదేవరెడ్డి అనే కాంట్రాక్టర్ ఉత్సాహంగా ముందుకొచ్చాడు. రూ.48 లక్షలతో అందంగా సచివాలయాన్ని నిర్మించాడు. భారీ మొత్తంలో తీసుకొచ్చిన అప్పునకు వడ్డీ చెల్లించడం భారమైంది. మరోవైపు బిల్లుల చెల్లింపుపై పంచాయతీ అధికారులు పట్టించుకోలేదు.
బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగి విసుగెత్తిన వాసుదేవరెడ్డి …చివరికి తన బిల్లుల కోసం సచివాలయానికి ఇవాళ తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశాడు. సచివాలయ ఉద్యోగులు సమీపంలోని చెట్ల కింద విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. ఇటీవల ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి భూమి తీసుకుని, 60 సెంట్లకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో రైతు షెడ్లను తొలగించి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు సీఎం జిల్లాలో ఏకంగా సచివాలయానికి తాళాలు వేయడం ప్రభుత్వానికి ప్రతిష్టో, అప్రతిష్టో అధికారులు, పాలకులు ఆలోచించాల్సి వుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నేరుగా బటన్ నొక్కి డబ్బు జమ చేస్తున్న జగనన్న… తమ విషయంలోనూ అట్టే ఆలోచించి బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.