జనసేనాని పవన్‌కల్యాణ్ జ్ఞానంతోనో, అజ్ఞానంతోనో తెలంగాణ ఎన్నికల బరిలో దిగారు. బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్లలో జనసేన పోటీ చేస్తోంది. ఇందులో మళ్లీ ముగ్గురు అభ్యర్థులు బీజేపీ నేతలే కావడం విశేషం. కనీసం ఒక్కటంటే ఒక్క చోటైనా జనసేన గెలవలేకపోతే పరువు పోతుందని పవన్‌కల్యాణ్‌కు భయం పట్టుకున్నట్టుంది. లేదంటే డిపాజిట్ దక్కించుకోవాలన్న కోరికైనా వుండొచ్చు.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం కూకట్‌పల్లిలో పవన్‌కల్యాణ్ రోడ్ షో చేపట్టడం చర్చనీయాంశమైంది. జనసేన అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ను గెలిపించాలంటూ ఆయన కూకట్‌పల్లిలో ప్రచారం చేయడం ఆకట్టుకుంటోంది. ఇక్కడ టీడీపీ సానుభూతి ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తారనే టాక్ నడుస్తోంది. ఏపీలో టీడీపీకి జనసేన మిత్రపక్షమనే సంగతి తెలిసిందే.
దీంతో జనసేన పరువు కాపాడ్డం టీడీపీ చేతల్లో వుంది. కూకట్‌పల్లిలో జనసేన గెలిస్తే, ఆ ప్రభావం తప్పకుండా ఏపీపై పడుతుందని ఇటీవల పవన్‌కల్యాణ్ కామెంట్ చేశారు. ఇది నిజం కూడా. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి పోటీ చేస్తున్నారు. ఈయన కమ్మ సామాజికవర్గం నేత. కూకట్‌పల్లిలో టీడీపీ అనుకూల సామాజిక వర్గం ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి కాకుండా జనసేన నాయకుడికి ఎట్టి పరిస్థితుల్లో వేయరనే చర్చ నడుస్తోంది.
అదే జరిగితే జనసేనకు వచ్చే ఓట్లు ఎన్ని? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. కనీసం గట్టి పోటీ ఇచ్చైనా జనసేన అభ్యర్థి ఓడిపోయినా పర్వాలేదని, అలా కాకుండా డిపాజిట్ గల్లంతు అయితే మాత్రం, ఆ ప్రభావం ఏపీలో టీడీపీపై తీవ్ర ప్రభావం చూపుతుందనే చర్చకు తెరలేచింది. పవన్‌కల్యాణ్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.