తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు చోట్ల బరిలో ఉన్నారు. ఆయనపై ప్రతిపక్ష నేతలు కూడా వ్యూహాత్మకంగా పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్, కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష నేతలిద్దరూ తమ సొంత నియోజకవర్గాల్లో కూడా బరిలో ఉన్నారు.
రెండు చోట్ల కేసీఆర్ పోటీలో వుండడాన్ని వ్యూహమని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. అయితే ఆ వ్యూహం ఏంటనేది స్పష్టంగా వివరించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో కేసీఆర్‌పై ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇవ్వడం విశేషం. కేసీఆర్ నుంచి కామారెడ్డి నియోజకవర్గ ప్రజల భూములను కాపాడేందుకే పోటీ చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు.
కామారెడ్డి భూములపై కేసీఆర్ కన్నేశాడని ఆయన అన్నారు. ఇక్కడి భూములు గుంజుకునేందుకే కామారెడ్డికి కేసీఆర్ వచ్చాడన్నారు. అయితే ఎన్నికలుండడంతో మాస్టార్ ప్లాన్‌ను తాత్కాలికంగా కేసీఆర్ రద్దు చేశాడన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ భూములను గుంజుకుంటాడని రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కామారెడ్డి భూములకు కంచె వేసి కాపాడేందుకే ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు.
కేసీఆర్ పాములాంటోడని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ను నమ్మడం అంటే పాముకు పాలు పోసి పెంచినట్టే అని ఆయన హెచ్చరించారు. కేసీఆర్‌కు ఓటు వేస్తే మిమ్మల్ని కాటు వేస్తాడని ప్రజానీకాన్ని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు ఇలా కామెంట్స్ చేస్తున్నారు.