మాంఛి మ్యూజికల్ హిట్ ఇచ్చిన సంగీత దర్శకుడి వెంట పడుతుంది ఇండస్ట్రీ. కనీసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టినా అతడికి పిలిచి మరీ అవకాశాలిస్తుంది. మరి ఈ రెండూ లేని సంగీత దర్శకుడికి అవకాశాలు వస్తాయా? ఎందుకు రావు.. కచ్చితంగా వస్తాయి. జీవీ ప్రకాష్ కుమార్ దీనికి ఎగ్జాంపుల్.
ఇతడు మంచి టాలెంటెడ్. తన సంగీతంతో జాతీయ అవార్డ్ కూడా అందుకున్న ఘనుడు. కానీ టాలీవుడ్ లో మాత్రం ఇప్పటివరకు ఇతగాడి వర్క్ మెరవలేదు. అయితేనేం మేకర్స్ మాత్రం వెంటపడుతున్నారు. వరుస అవకాశాలతో జీవీ ప్రకాశ్ ను ముంచెత్తుతున్నారు. అదే విచిత్రం.
తాజాగా ఆదికేశవ సినిమాకు వర్క్ చేశాడు జీవీ ప్రకాష్ కుమార్. ఆ సినిమాలో అతడి వర్క్ పెద్దగా కనిపించలేదు. అంతకంటే ముందు టైగర్ నాగేశ్వరరావు సినిమా చేశాడు. ఆ సినిమాలో కూడా అతడి పనితీరు ఆకట్టుకోలేదు. ఈ రెండు సినిమాలతో పాటు వచ్చిన జపాన్ సినిమా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో జీవీ టాలెంట్ ను ఎలివేట్ చేయలేకపోయింది.
ఓవైపు ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ, మరోవైపు జీవీకి అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో మట్కా లాంటి సినిమాలు ఈ సంగీత దర్శకుడి చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్, తమన్ కొన్ని సినిమాలకు, కొంతమందికి పరిమితం అయిపోవడం వల్ల జీవీ ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లకు కాలం కలిసొచ్చింది.
ఈ సిచ్యుయేషన్ ను క్యాష్ చేసుకోవాలన్నా, ఇప్పుడున్న క్రేజ్ ను నిలబెట్టుకోవాలన్నా, అర్జెంట్ గా తెలుగులో ఇతడో మ్యూజికల్ హిట్ ఇవ్వాల్సిందే. లేదంటే ఛాన్సులు తగ్గిపోవడానికి ఎక్కువ రోజులు పట్టదు.