కొందరు ఔత్సాహికులు ఏదో ఆశించి రాజకీయాల్లో వేలు పెడతారు. ఆట ఆడే శక్తిలేక, ఆసక్తి చావక దైనందిన రాజకీయాల మీద కామెంట్రీ చెప్పడానికి తయారవుతారు. ఆ క్రమంలో ఏదో ఒక పార్టీకి వత్తాసు పలుకుతుంటారు. అది చూసి ఆ పార్టీకి కొమ్ముగాసే మీడియా చానల్స్ వాళ్లకి వేదికనిచ్చి, చర్చలకి పిలిచి మాట్లాడిస్తాయి.
ఈ సోషల్ మీడియా రోజుల్లో ఎవరు ఏది కూసినా ఎంతో కొంతమంది ఫాలోవర్స్ రావడం సహజం. అలా నలుగురు ఫాలోవర్స్ రాగానే తాము హీరోల్లా ఫీలౌతారు వీళ్లల్లో కొందరు. తమలో వాగ్ధాటి చాలా ఉందని, దాంతో రాజకీయంగా ఏదో చెసేయొచ్చనీ, లేదా కోటానుకోట్లు ప్యాకేజీ తీసుకుని నచ్చిన పార్టీకి డప్పు కొట్టచ్చని పగటి కలలు కంటుంటారు.
అవి కచ్చితంగా పగటి కలలే. ఎందుకంటే అవసరానికి వాడుకుని తర్వాత ఏరి పారేసే కరివేపాకుల్లా వీళ్లని పార్టీ అధిష్టానం చూస్తుంది తప్ప, ఇన్నేళ్లూ నోరుని చిడతలా వాడి తమ గొప్పని చాటాడు కదా అని పదవులు, ప్యాకేజీలు ఏమీ ఇచ్చేయరు.
ఈ సత్యం తెలిసి, లేదా అసలేమీ ఆశించకుండా ఒక పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతుంటే పర్వాలేదు. అలా కాకుండా ఆశపడితే మాత్రం ఆశాభంగం తప్పదు.
తాజాగా తెదేపాకి చెందిన విశ్లేషకుడు జడ శ్రవణ్ కుమార్ ప్లేట్ మార్చి చంద్రబాబుని,లోకేష్ ని అనరాని మాటలు (తెదేపా వారి దృష్టిలో) అంటూ వీడియోలు వదిలాడు. “భంగపడ్డ దిగ్గజ (?) విశ్లేషకుడు” అంటూ తెగ ట్రోల్స్ వస్తున్నాయి యూట్యూబులో.
చంద్రబాబు వోట్ కి నోట్ కేసులో తెరాసా ప్రభుత్వం తనను బొక్కలో తోస్తుందని భయపడి హైద్రాబాదునుంచి పారిపోయి ఆంధ్రాకి వచ్చాడని… అలాగే లోకేష్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడని తెగ తిట్టిపోసాడు శ్రవణ్ కుమార్.
లోకేష్ ని అంతమాట ఎందుకన్నాడంటే ఎన్నో ఏళ్లుగా వైకాపా తరపునుంచి చంద్రబాబుని, లోకేష్ ని పచ్చిగా తిట్టిన ఉండవల్లి శ్రీదేవి కండువా మార్చుకుని తెదేపాలోకి రాగానే ఆమెని వేదికలెక్కించి గౌరవించాడట. అది జీర్ణించుకోలేక శ్రవణ్ కుమార్ అంతటి బిర్దునిచాడు లోకేష్ కి.
ఎందుకీ సడెన్ రివెర్స్ గేర్.. అంటే తనకే తెలియాలి.
ఇన్నేళ్లు చూపిన విశ్వాసానికి తగిన ఫలితమేదో రాక భంగపడి ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నట్టుగా ఉంది చూస్తున్నవాళ్లకి.
నిజానికి ఇలాంటి సో-కాల్డ్ దిగ్గజ విశ్లేషకుల్ని ఏ పార్టీ అయినా భరించడం కష్టం. వాళ్ల కోరికలు పెద్దవైతే గుదిబండల్లా మారతారు.
వైకాపాలో ఏదో పెద్ద తాయిలం ఆశించి అది రాక భంగపడ్డ ట్రిపులార్ గా పిలవబడే రాజుగారు ఎదురు తిరిగాడు. ఎంపీగా గెలిచినా తనకి కావాల్సింది అది కాదు… మరొకటేదో అనే విధంగానే సాగింది తన తిరుగుబాటు పర్వం. ఆ క్రమంలో ఎంతపడితే అంత, ఏది పడితే అది మాట్లాడి రాజద్రోహం కేసు ఎదుర్కొని రకరకాల ఇబ్బందులు పడ్డాడు. అయినప్పటికీ తన పంథా మార్చుకోకుండా తెదేపా పక్షాన దుర్యోధనుడి యశోరక్షకుడైన కర్ణుడి టైపులో చంద్రబాబు యశోరక్షణకి పాటు పడుతున్నాడు. ఆయనకి ఇతిహాసాల్లోని పాత్రలతో ఉపమానాలు చెప్పడం ఇష్టం కనుక ఇక్కడ ఈ ఉపమానం చెప్పడం జరిగింది.
రేపు తెదేపా పవర్లోకి రాకపోయినా, లేదా పవర్లోకి వచ్చాక తనకి కావాల్సింది చంద్రబాబు ఇవ్వలేకపోయినా సీన్ రివర్సవుతుంది.
ఇక్కడ చెప్పేదేంటంటే నెలకింతని జీతమో, ఏదో మెయింటేనెన్స్ కి తగ్గ చిన్నమొత్తమో ఆశించి పార్టీల భజన చేస్తే కొంతవరకు ఓకే. లేదా ఏదీ ఆశించకుండా కేవలం ఆత్మానందం కోసం చేసుకుంటే గొడవేలేదు.
ఆ మధ్యన కుండబద్దలు సుబ్బారావుగారని ఒకాయన తెదేపా తరపున నిత్యం వీడియోలు చేసేవారు. అనారోగ్యంతో కాలం చేసారు. ఏమి ఆశించి ఆయన అన్నేళ్లు ఆ వీడియోలు చేశారని అడిగితే.. కేవలం అభిమానం తప్ప ఏ ఆశా ఆయనకి లేదని కొందరు చెప్పారు. ఆ పంథాలో వెళ్లడం తప్పులేదు. ఎటువంటి భంగపాటులు, వెన్నుపోటు ఫీలింగులు ఉండవు.
ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ విషయానికొస్తే ఆయన టైపులో ఇంకెవరు తయారవుతారో అనిపిస్తుంది. మహాసేన రాజేష్, కొలికిపూడి శ్రీనివాస్ లు ఇప్పటికీ తమ జోరు కొనసాగిస్తున్నారు.
అయితే ఎందుకో టీవీ5 మూర్తి, ఎబీయన్ వెంకటకృష్ణలు గతంలో చూపినంత స్పీడ్ ఇప్పుడు చూపించడం లేదు. బహుశా వారిలో తెదేపా నెగ్గుతుందన్న నమ్మకం సన్నగిల్లినట్టు ఉంది. ఎందుకంటే వాళ్ల వ్యవహారశైలి అలా ఉంది. అయితే సాంబశివారావు మాత్రం ఇంకా అదే ఊపులో తనదైన వినోదాన్ని పంచుతున్నాడు.
వీరిలో ఎవరి ఆశలు, ఆలోచనలు ఏవిటో తెలీదు. సమీప భవిష్యత్తులో వారు తీసుకునే టర్న్ ని బట్టి అప్పుడు విశ్లేషించుకోవాలి ఈ దిగ్గజ విశ్లేషకుల గురించి.
ఇది ఒక్క తెదేపా వైపు నిలబడి గొంతులు చించుకుంటున్న వారికే కాదు, వైకాపా తరపున కంఠశోష ప్రదర్శిస్తున్నవారికి కూడా వర్తిస్తుంది.
ఇక్కడ పెద్దచేపలకే పదవులుంటాయి. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా చివారాఖర్లో పార్టీలోకి చేరిన వారికి మంత్రి పదవులు కూడా దక్కేయొచ్చు.. ముందునుంచీ ఉన్నవారిని మూలన కూర్చోమనొచ్చు.
అన్నిటికీ ప్రిపేరైతేనే రాజకీయాల్లో వేళ్లు పెట్టాలి.. ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా! లేకపోతే జడ శ్రవణ్ కుమార్ లాగ హైరానపడాలి.
– హరగోపాల్ సూరపనేని