పోలింగ్ డే దగ్గర పడుతోంది. మరికొన్ని రోజుల్లో తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువగానే నమోదవుతుంది. ఆరోజు శెలవు ప్రకటించినా ఓటర్లు హాలిడేలా ఫీల్ అవుతున్నారు తప్ప, పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయాలని అనుకోవడం లేదు.
హైదరాబాద్ లో పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వం, ఎన్నికల సంఘం కొన్ని ఏర్పాట్లు చేసింది. నగరంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా వీలైనన్ని ఎక్కువ పోలింగ్ బూత్స్ ఏర్పాటుచేసింది. మరోవైపు ఓటర్లలో చైతన్యం రగిల్చేలా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది.
ఇప్పుడీ ప్రచారానికి తోడు, ఓ బంపరాఫర్ ప్రకటించింది ర్యాపిడో. హైదరాబాద్ లోని 2600 పోలింగ్ కేంద్రాలకు ఉచితంగా బైక్ రైడ్స్ ఎనౌన్స్ చేసింది. యువతను పోలింగ్ వైపు ఆకర్షించేందుకు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ ఆఫర్ ను పొందాలనుకునే వినియోగదారులు కమ్ ఓటర్లు.. యాప్ లో రైడ్ బుక్ చేసిన తర్వాత 'ఓట్ నౌ' అనే వన్-టైమ్ కోడ్ ను ఎంటర్ చేస్తే సరిపోతుంది.
గడిచిన 3 అసెంబ్లీ ఎన్నికల సరళిని పరిశీలిస్తే.. గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. ప్రతిసారి 40 నుంచి 55శాతం మధ్య మాత్రమే పోలింగ్ నమోదవుతోంది. ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఇలా ఉచిత రైడ్ ఆఫర్ చేసింది ర్యాపిడో.