వారెవ్వా.. గులాబీల వాక్చాతుర్యం.. భళా!

తమ స్వయంకృతాపరాధాల ఫలితంగా.. పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినా సరే.. ఆ ప్రతికూలతల నుంచి గరిష్టమైన రాజకీయ లబ్ధిని పిండుకోవడం ఎలాగో గులాబీ నాయకులను చూసే నేర్చుకోవాలేమో. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే…

తమ స్వయంకృతాపరాధాల ఫలితంగా.. పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినా సరే.. ఆ ప్రతికూలతల నుంచి గరిష్టమైన రాజకీయ లబ్ధిని పిండుకోవడం ఎలాగో గులాబీ నాయకులను చూసే నేర్చుకోవాలేమో. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే పాపులర్ సామెతను.. అన్ని రకాలుగానూ.. వాడుకలోకి తీసుకురావడంలో గులాబీ నాయకత్రయం చాలా ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. 

రైతుబంధు నిధులు.. రైతుల ఖాతాల్లో పడకుండా ఆగిపోవడానికి ఏకైక కారణం హరీష్ రావు నోటి దూకుడు, ప్రచార కాంక్ష, అడ్డదారి ప్రచారం ద్వారా అనుచితమైన లబ్ధిని ఆశిస్తున్న తీరు మాత్రమే అయినప్పటికీ.. ఇప్పుడు వారు ప్రత్యర్థి కాంగ్రెసు పార్టీ మీద ఏ రేంజిలో ఎదురుదాడికి దిగుతున్నారంటే.. రైతులకు డబ్బులు అందకుండా కాంగ్రెసు పార్టీనే కుట్ర చేసినట్టుగా మాట్లాడుతున్నారు.

ఇవాళ (మంగళవారం) వరకు తెలంగాణలోని రైతులకు రైతుబంధు కింద ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి పంపిణీ చేయడానికి, అంటే రైతుల ఖాతాల్లో వేయడానికి ఎన్నికల కమిషన్ తొలుత అనుమతి ఇచ్చింది. అంతవరకు అంతా బాగానే ఉంది. కానీ.. ఈ నిధుల విడుదల అంశాన్ని తమ ఎన్నికల ప్రచారంలో వాడుకోవడానికి వీల్లేదని నిబంధన విధించింది. ఆ నిబంధన కూడా చాలా సహజం. అయితే హరీష్ రావు తన ఎన్నికల ప్రచార ప్రసంగంలో నిబంధనను అతిక్రమించి ప్రస్తావించడం.. ఫిర్యాదులు రావడంతో రైతుబంధు నిధుల విడుదలను నిలిపివేయడం జరిగింది.

30వ తేదీన తెలంగాణలో పోలింగ్ కాగా, 28వ తేదీ వరకు రైతుంబంధు నిధులు రైతుల ఖాతాల్లోకి వేయడం అంటే.. దాని ద్వారా ఖచ్చితంగా అధికార పార్టీకి ఎడ్వాంటేజీ వస్తుంది. ప్రచారం ముగిసిపోయి అన్ని పార్టీల నాయకులు డబ్బు సంచులను బయటకు తీసి ఓటర్లకు పంచే పనిలో బిజీగా ఉండే రెండు రోజుల సీజన్ 28నే మొదలవుతుంది. సరిగ్గా అదే సమయానికిరైతుల ఖాతాల్లో డబ్బులువేస్తే.. ప్రచారానికి వాడుకోవచ్చు. 

రైతులు ప్రభుత్వ పార్టీ పట్ల కృతజ్ఞతతో ఉంటారు కూడా. అందుకే 28దాకా నిధులువేయకుండా భారాస వెనక్కు నెడుతూ వచ్చింది. తీరా ఇప్పుడు వారి నోటిదూకుడు వల్లనే రాకుండా ఆగిపోయాయి. అయితే వారంతా కలిసి కాంగ్రెస్ పై దాడికి దిగుతున్నారు.

గులాబీ నాయకత్రయం హరీష్ రావు, కేటీఆర్, కవిత కలిసి కాంగ్రెస్ ను నేరంచేసిన పార్టీగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నారు. రైతుల నోటి వద్ద బుక్క కాంగ్రెసు లాక్కున్నదని, ఆ పార్టీకి  రైతులు ఓట్లు వేయకూడదని అంటున్నారు. రైతులంటే కాంగ్రెసుకు ఎప్పుడూ గిట్టదని, అది రైతు వ్యతిరేక పార్టీ అని అంటున్నారు. రైతుబంధును ఆపేయించిన కాంగ్రెసుకు 30న ఓట్లు వేయకూడదని పిలుపు ఇస్తున్నారు.

వీరు చేస్తున్న ఈ ప్రచారాన్ని గమనిస్తోంటే.. అసలు కాంగ్రెసును  తిట్టడం కోసం ఎంతో సీనియర్ అయిన హరీష్ రావు.. రైతుబంధుప్రస్తావన ఎన్నికల ప్రచారంలో తెచ్చి నిధుల విడుదల ఆగిపోయేలా వ్యూహం పన్నారేమోనని, ఆగిపోగానే.. కాంగ్రెసును తిట్టడం ప్రారంభించారని అనుమానం కలుగుతోంది.