ప్రతి వ్యవస్థలో కొన్ని మంచి విషయాలుంటాయి, అదే విధంగా కొన్ని అవలక్షణాలు కూడా ఉంటాయి. టాలీవుడ్ లో కూడా అలాంటి కొన్ని అవలక్షణాలున్నాయి. మరీ ముఖ్యంగా 3 అంశాలు, టాలీవుడ్ ను పట్టిపీడిస్తున్నాయి. వీటిని వదిలించుకుంటే, ఇక టాలీవుడ్ కు తిరుగుండదంతే.
బడ్జెట్ తగ్గించుకోవాలి..
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరినోట విన్నా పాన్ ఇండియా మాట. పాన్ ఇండియా అని చెప్పి బడ్జెట్ పెంచడం కామన్ అయిపోయింది. అయితే అలా పాన్ ఇండియా బ్రాండ్ తో వస్తున్న సినిమాల్లో ఫ్లాపులే ఎక్కువగా ఉంటున్నాయి. ఓ రేంజ్ సినిమాకు బడ్జెట్ 100 కోట్లు దాటి 150 కోట్లకు చేరుకుంది. ఇక పెద్ద సినిమాలకైతే బడ్జెట్ పరిమితులు పెట్టుకోవడం మానేశారు నిర్మాతలు.
మొన్నటికిమొన్న రవితేజ చేయాల్సిన ఓ సినిమాను హోల్డ్ లో పెట్టారు. దీనికి కారణం రవితేజ మార్కెట్ ను మించి బడ్జెట్ పెరిగిపోవడమే. అంతేకాదు, మట్కా నిర్మాతలు కూడా ఒకటికి రెండు సార్లు పేపర్-పెన్ను పట్టుకున్నారంటే దానికి కారణం సినిమా బడ్జెట్ పెరగడమే. ఇలా హీరో మార్కెట్ తో సంబంధం లేకుండా నిర్మాణ వ్యయం పెరగడం టాలీవుడ్ పుట్టి ముంచుతోంది.
కొత్త నిర్మాతలతో పాటు కొంతమంది ఎన్నారైలు, ఎలాంటి అవగాహన లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. హీరోహీరోయిన్లకు భారీగా రెమ్యూనరేషన్లు ఇచ్చి మార్కెట్ ను చెడగొడుతున్నారు. ఓటీటీలు కూడా తెలుగు సినిమాలు తీసుకోవడం తగ్గించేశాయని.. ఇవన్నీ బడ్జెట్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని నిర్మాత సి.కల్యాణ్ అంటున్నారు. హిందీ డిస్ట్రిబ్యూటర్లు కూడా తెలుగు సినిమాలకు భారీగా చెల్లించడం తగ్గించేశారని, ఫలితంగా మార్కెట్ నష్టాల్లోకి వెళ్తోందని అన్నారు.
రెమ్యూనరేషన్లు తగ్గాలి…
సి.కల్యాణ్ చెప్పింది అక్షర సత్యం. మొన్నటికిమొన్న ఓ బడా సినిమా తీసిన నిర్మాతకు గుండెపోటు వచ్చింది. మరో నిర్మాత సొంత ఆస్తులు అమ్మి సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చింది. తారలు తమ పారితోషికాల్ని 4-5 రెట్లు పెంచడం వల్ల బడ్జెట్ 6-7 రెట్లు పెరిగిపోతోంది. ఓవైపు నటీనటులు, టెక్నీషియన్లు పెద్ద పెద్ద విల్లాలు కొనుగోలు చేస్తుంటే.. నిర్మాతలు మాత్రం, ఫైనాన్షియర్లకు వడ్డీలు కడుతూ, నష్టాలతో మార్కెట్ నుంచి తప్పుకుంటున్నారు.
నాన్-థియేట్రికల్ మార్కెట్ చూపించి హీరోలు రేట్లు పెంచేశారు. జస్ట్ 6-7 నెలల కిందట వరకు అందుబాటులో ఓ మిడ్-రేంజ్ హీరో తన పారితోషికాన్ని ఏకంగా 20 కోట్లు దాటించాడు. దీంతో సినిమా బడ్జెట్ లో దాదాపు 30శాతం అతడికే ఇవ్వాల్సి వస్తోంది. మరోవైపు నాన్-థియేట్రికల్ మార్కెట్ తగ్గిపోయింది. కానీ ఇలాంటి హీరోలు మాత్రం తమ రేటు తగ్గించలేదు.
ఓవైపు సి.కల్యాణ్ లాంటి నిర్మాతలు ఈ పోకడల్ని ఖండిస్తున్నప్పటికీ, మరోవైపు బన్నీ వాసు, అల్లు అరవింద్ లాంటి నిర్మాతలు ఈ భారీ రెమ్యూనరేషన్లను సమర్థించడం విశేషం. ఒక హీరో వంద కోట్ల మార్కెట్ కలిగి ఉన్నప్పుడు అతడు ఓ 30 కోట్లు తీసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నాడు నిర్మాత బన్నీ వాసు. అయితే ఇక్కడ అతడో లాజిక్ మిస్సవుతున్నాడు. హీరో ముందే 30 కోట్లు తీసుకుంటాడు, తన సినిమాకు వంద కోట్లు వచ్చిందా లేదా అనేది అతడు పట్టించుకోడు. సినిమా ఫ్లాప్ అయితే బయ్యర్లు ఆరిపోతున్నారు. అలాంటప్పుడు అతడు రెమ్యూనరేషన్ పెంచడం వల్ల ఎవరికి లాభం.
30శాతం హీరోకు ఇచ్చి, మిగతా 70శాతం పెట్టుబడితో లాభాలు అందుకోలేకపోవడం నిర్మాత ఫెయిల్యూర్ అంటున్నాడు బన్నీ వాసు. మరి అన్ని సినిమాల విషయంలో ఇలానే జరుగుతుందా? బన్నీ వాసు లాజిక్కే భగవద్గీత అనుకుంటే, లైగర్ నిర్మాతలు రోడ్డెక్కి ధర్నాలు ఎందుకు చేసినట్టు? అనీల్ సుంకర లాంటి నిర్మాత మింగలేక కక్కలేక ఎందుకు సైలెంట్ అయినట్టు?
మంచి కంటెంట్ అందించాలి…
ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక హిట్ వస్తే, డజను ఫ్లాపులొస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 45 భారీ ఫ్లాపులు చూసింది ఇండస్ట్రీ. ఇవన్నీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు. వీటిలో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ఓ మోస్తరు బడ్జెట్ తో తెరకెక్కిన మూవీస్ ఉన్నాయి. చిన్న సినిమాల్ని కూడా కలిపితే లెక్క వంద దాటుతుంది. ఈ పరిస్థితి మారాలి. ఇనిస్టెంట్ క్రేజ్ కోసం సినిమాలు తీసే నిర్మాతల్ని టాలీవుడ్ లోకి రానీయకూడదు.
కొత్త నిర్మాతలు వస్తేనే పరిశ్రమలో వేలాది మంది సినీకార్మికులకు ఉపాధి దొరుకుందని, ఇండస్ట్రీ కళకళలాడుతుందని లగడపాటి శ్రీధర లాంటి నిర్మాతలు చెబుతున్నారు. అయితే సి.కల్యాణ్ లాంటి వాళ్లు దీనికి మరో కోణాన్ని ఆపాదిస్తున్నారు. కంటెంట్ పై, బడ్జెట్ పై నియంత్రణ లేకుండా పరిశ్రమకొచ్చి ఇష్టమొచ్చినట్టు సినిమా తీసి పరిశ్రమను నష్టాల్లోకి లాగుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
సో.. స్క్రిప్ట్ స్టేజ్ నుంచే బడ్జెట్ లెక్కలుండాలి. కథకు ఎంత అవసరమో అంతే ఖర్చు చేయాలి. ఈ విషయంలో హీరోకు నిర్ణయాధికారం ఇవ్వకూడదు. హీరోను కాదనలేని పరిస్థితి ఉంటే ఆ ప్రాజెక్ట్ నుంచి నిర్మాత తప్పుకోవడం శ్రేయస్కరం అంటున్నారు సి.కల్యాణ్. నిర్మాతను డబ్బు సంచిలా కాకుండా, ఓ మేకర్ గా చూసినప్పుడు పరిస్థితి మారుతుందంటున్నారు.
ఏదేమైనా టాలీవుడ్ ను ప్రస్తుతం ఈ 3 అంశాలు ఇబ్బంది పెడుతున్నాయి. వీటిలో ఫ్లాప్స్ కు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాకపోవచ్చేమో కానీ.. భారీ పారితోషికాలు, హెవీ బడ్జెట్ ను నియంత్రించడం మాత్రం సాధ్యమే. కనీసం ఆ దిశగానైనా పురోగతి సాధించినప్పుడు టాలీవుడ్ కళకళలాడుతుంది.