తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఇప్పుడు బీభత్సమైన ఉత్సాహం తాండవిస్తోంది. చంద్రబాబునాయుడును అరెస్టు చేసి జైల్లోపెట్టడం వలన తమకు అపరిమిత మైలేజీ వచ్చిందని, ప్రజలందరిలో ఆయన పట్ల సానుభూతి వెల్లువెత్తుతోందని, ఈ సానుభూతి ఒరవడిలో కళ్లు మూసుకుని సైకిలు గుర్తుకు ఓట్లు గుద్దేస్తారని తాము అధికారంలోకి వచ్చేస్తామని వారు కలలు కంటున్నారు.
తమాషా ఏంటంటే.. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే.. ఎవరెవరు ఏయే మంత్రిత్వ శాఖలు పంచుకోవాలోకూడా వారు ఇప్పుడే ప్లాన్ చేసేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అయితే వారి ప్రగల్భాలు మాటలను బట్టి గమనిస్తే.. హోం శాఖ మీద వారికిచాలా కీలకంగా కనిపిస్తున్నట్టుంది.
గతంలో అచ్చెన్నాయుడు ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తెలుగుదేశం సర్కారు వచ్చిన తర్వాత.. తాను హోంశాఖను చేపట్టి ఇప్పుడు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పోలీసులకు బుద్ధి చెబుతానని, ఇప్పుడు అరాచకాలు చేస్తున్న వైసీపీ నాయకులందరి భరతం పడతానని అన్న సంగతి పలువురికి గుర్తుండే ఉంటుంది. అయితే హోంశాఖ మీద అచ్చెన్నకు మాత్రమే కాదు.. చంద్రబాబు యొక్క ఇద్దరు పుత్రులకు కూడా చాలా ఆశ ఉన్నట్టుగా ఉంది.
చంద్రబాబు నాయుడు అసలు పుత్రుడు నారా లోకేష్, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఇద్దరూ ఇండైరక్టుగా ఈ పోస్టు మీద తమ మమకారాన్ని చాటుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో సాధారణంగా ప్రతి పార్టీ కూడా ప్రజలకు బోలెడు రకాల హామీలు ఇస్తుంటుంది. కానీ తెలుగుదేశం నాయకుల తమాషా ఏంటంటే.. తాము అధికారంలోకి వస్తే.. వైసీపీ నాయకులను ఎలా వేధిస్తామో, పోలీసులను ఎలా వెంటాడి పగ తీర్చుకుంటామో ప్రధానంగా చెప్పుకుంటూ బతుకుతోంది.
కేవలం తెలుగుదేశం మాత్రమే కాదు.. పవన్ కల్యాణ్ కు కూడా ఇదే పని. ప్రత్యేకించి నారా లోకేష్, పవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా.. తాము హోం మంత్రులు అయిపోయినట్టుగానే మాట్లాడుతున్నారు. లోకేష్ యువగళం పునఃప్రారంభ యాత్రలో మాట్లాడుతూ.. తన మీద కూడా బోలెడు కేసులుపెడుతున్నారని, అయితే ఆ కేసులకు భయపడేది లేదని అంటున్నారు. భయాన్ని వారికే పరిచయం చేస్తానని హెచ్చరిస్తున్నారు.
వైసీపీ నాయకుల మీదకేసులు పెట్టే బాధ్యత మొత్తం తాను తీసుకుంటా అనడం ద్వారా.. ఆయన హోం శాఖ తనదే అని చాటుకుంటున్నట్టుగా ఉంది. పవన్ కల్యాణ్ తీరు కూడా ఇంతే. ఆయన నేరుగా హోం మంత్రి అవుతానని చెప్పడం లేదు గానీ.. పోలీసులంటే గౌరవం అంటూనే.. వారు దారి తప్పిపోతున్నారని, తనను అడ్డుకుంటున్నారని, తాము అధికారంలోకి రాగానే దుర్మార్గాలు చేస్తున్న వైసీపీ నాయకులు అందరి భరతం పట్టే బాధ్యత తాను తీసుకుంటానని హోం మంత్రి రేంజిలోనే చెబుతున్నారు. పైగా తాను కానిస్టేబుల్ కొడుకును అంటూ పదేపదే చెప్పుకోవడం ద్వారా.. హోంమంత్రి కావడానికి వారసత్వ అనుభవం ఉందన్నట్టుగా పవన్ గప్పాలు కొడుతుంటారు.
ఎన్నికలకు ముందు తెలుగుదేశం – జనసేన పార్టీలు సీట్ల పంచాయతీలతో కొట్టుకునే పరిస్థితి ఉంది. అదే ఎన్నికల తర్వాత.. వీరు అధికారంలోకి వస్తే గనుక, మంత్రిత్వ శాఖల గురించి ప్రత్యేకించి.. చంద్రబాబునాయుడు యొక్క అసలు- దత్త పుత్రులు ఇద్దరూ హోంశాఖ గురించి కొట్టుకుంటారని ప్రజలు అనుకుంటున్నారు.