భారాస ఓడితే హరీష్ వాటా ఉన్నట్లే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణం అసలే ఉత్కంఠభరితంగా నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంతగానో బలం పుంజుకుని, ఈదఫా అధికారమార్పిడి తథ్యం అనే వాతావరణాన్ని ఆల్రెడీ తెలంగాణ వ్యాప్తంగా సృష్టించింది.  Advertisement భారాస ప్రస్తుతానికి వందకు…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణం అసలే ఉత్కంఠభరితంగా నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంతగానో బలం పుంజుకుని, ఈదఫా అధికారమార్పిడి తథ్యం అనే వాతావరణాన్ని ఆల్రెడీ తెలంగాణ వ్యాప్తంగా సృష్టించింది. 

భారాస ప్రస్తుతానికి వందకు పైగా ఎమ్మెల్యే సీట్లను కలిగి ఉండి, ఎన్నికల్లో తలపడుతున్నప్పటికీ.. అందులో సగం స్థానాలనైనా నిలబెట్టుకోగలుగుతుందా అనే ప్రశ్నార్థకాలు ఆ పార్టీ నాయకులలోనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా ఒకవేళ భారాస ఓడిపోయేటట్లయితే, అందులో హరీష్ రావుకు కూడా ఖచ్చితంగా కొంత వాటా పెట్టాల్సిందే. ఇలాంటి అభిప్రాయం కలిగించే పరిణామాలు తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి.

రైతు బంధు నిధుల విడుదల వ్యవహారం భారత రాష్ట్ర సమితి పార్టీ పట్ల అన్నదాతల్లో ఏర్పడగల సానుకూల అభిప్రాయాన్ని కొంతమేర దెబ్బతీస్తున్నది. రైతు బంధు కింద అన్నదాతలకు నిధులు ఈ నెలలో విడుదల కావాల్సి వుంది. ఎన్నికల కోడ్ అమలులో వున్నప్పటికీ ఎప్పటినుంచో జరుగుతున్న కార్యక్రమం మాత్రమే గనుక, ఈ నిధుల విడుదలకు ఎన్నికల కమిషన్ పచ్చ జెండా వూపింది. 

అయితే ఈ నిధుల విడుదల అంశాన్ని అధికార పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఎక్కడా వాడుకోకూడదని నిబంధన విధించింది. అంటే, భారాస నాయకులు తమ ప్రభుత్వం రైతు బంధు వంటి పథకాన్ని తీసుకు వచ్చిందని చాటుకోవచ్చు కానీ… ఇప్పుడు కోడ్ అమలులో ఉన్న సమయం లో నిధుల విడుదల అంశాన్ని మాత్రం ప్రస్తావించ కూడదు.

భారాస మంత్రి హరీష్ రావు ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రైతు బంధు నిధులు ఫలానా తేదీన రాబోతున్నాయని వుత్సాహంగా ప్రకటించారు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆగ్రహించిన ఈసీ నిధుల విడుదలను అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసింది. దీంతో అది ఆగిపోయినట్టే.

పోలింగుకు ముందుగా రైతుల బ్యాంక్ అకౌంట్లో సొమ్ములు పడితే పాలక పక్షానికి ఎంతో కొంత ఎడ్వాంటేజీ వుంటుంది. ఇప్పుడు ఆ అవకాశం వారు కోల్పోయారు. కొంత శాతం ఐనా రైతుల ఓట్లు గులాబీలకు దూరం అవుతాయి. 

అసలే భారాస- కాంగ్రెస్ మధ్య పోటా పోటీగా, నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికలు తయారైన ఈ కీలక తరుణంలో, స్వల్ప తేడాలు విజయాలను నిర్దేశించే క్రమంలో ఇలాంటి దెబ్బ భారాస కు తప్పకుండా చేటు చేస్తుంది. ఇలాంటి నష్టం వాటిల్లితే అందుకు పూర్తి బాధ్యత హరీష్ రావుదేనని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి.