రానున్న ఎన్నికల్లో టికెట్ల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగానే సంకేతాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై సీఎం తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. చిత్తూరులో ఎమ్మెల్యే శ్రీనివాసులు, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి మధ్య కొంత కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది.
ప్రభుత్వ, వైసీపీ కార్యక్రమాలను ఎమ్మెల్యే, విజయానందరెడ్డి వర్గాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. వైసీపీ నిర్వహిస్తున్న సర్వేల్లో తనకే అనుకూలంగా ఉన్నట్టు విజయానందరెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇటీవల చిత్తూరులో నిర్వహించిన బస్సుయాత్రలో మరోసారి శ్రీనివాసులును గెలిపించాలని డిప్యూటీ సీఎం అంజాద్ బాష, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ప్రజలకు పిలుపునిచ్చారు.
దీనిపై విజయానందరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు వైసీపీ అభ్యర్థిని ప్రకటించడానికి అంజాద్ బాష, రెడ్డెప్ప ఎవరని బహిరంగంగానే విజయానందరెడ్డి ప్రశ్నించారు. చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిని సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయిస్తారని, తనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో చిత్తూరు ఎమ్మెల్యే, విజయానందరెడ్డి మధ్య వార్ పతాక స్థాయికి చేరినట్టైంది.
ఈ నేపథ్యంలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులుతో తాజాగా జగన్ కీలక కామెంట్స్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. చిత్తూరులో మీ కంటే విజయానందరెడ్డికే రాజకీయ అనుకూలత ఉందని నేరుగా శ్రీనివాసులుతోనే జగన్ చెప్పినట్టు తెలిసింది. జగన్ మాటలతో చిత్తూరు ఎమ్మెల్యేకు మతి పోయినట్టైంది. ఇక టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సిందే అనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్టు సమాచారం. ఏది ఏమైనా టికెట్ల విషయంలో జగన్ మానసికంగా కొందరు నేతల్ని సన్నద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.