శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తపై బహిరంగంగా చేయి చేసుకున్నారనే కారణంతో అక్కడి సీఐ అంజూయాదవ్‌పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. మరి సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తుంటే చర్యలు తీసుకునే దిక్కు లేదా? అని ఆవేదనతో వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
తిరుపతి జిల్లా పరిధిలోకే శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట వస్తాయి. శ్రీకాళహస్తిలో తన కార్యకర్తపై చేయి చేసుకున్న సీఐపై చర్య తీసుకోవాలని ఎస్పీ పరమేశ్వరరెడ్డికి వినతిపత్రం సమర్పించేందుకు జనసేనాని పవన్‌కల్యాణ్ సోమవారం తిరుపతికి వెళుతున్నారు.
శ్రీకాళహస్తి సమీప నియోజకవర్గమే సూళ్లూరుపేట. ఈ నియోజకవర్గంలో వైసీపీ తరపున రెండో దఫా కిలివేటి సంజీవయ్య గెలుపొందారు. దీంతో ఆయనకు కొమ్ములొచ్చాయని వైసీపీ నేతలు అంటున్నారు. సూళ్లూరుపేటలో వరుసగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల దాడులు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త బాబురెడ్డిపై సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లురెడ్డి విచక్షణా రహితంగా దాడి చేశాడు.
సీఐ నేతృత్వంలో పోలీసులు బాబురెడ్డిని చితక్కొట్టారు. దీంతో అతని ఒళ్లంతా వాతలు తేలాయి. చేతికి గాయాలయ్యాయి. ఈ ఘటన సూళ్లూరుపేట వైసీపీ హృదయాన్ని గాయపరిచింది. ఇది మరిచిపోకనే మరొకటి అలాంటిదే ఇవాళ పునరావృతం అయ్యింది. ఈ దఫా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు సునీల్‌రెడ్డిని ఎస్ఐ టార్గెట్ చేశాడు. టీడీపీ హయాంలో నమోదైన రౌడీషీట్ కేసులో సునీల్‌రెడ్డిని స్టేషన్‌కు పిలిపించి మరీ కుళ్ల పొడిచారు.
దీంతో నియోజక వర్గంలోని వైసీపీ కేడర్ అంతా సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. అసలు తాము టీడీపీ పాలనలో ఉన్నామా? లేక వైసీపీ పాలనలోనా? అనేది అర్థం కావడం లేదని అధికార పార్టీ నాయకులు ఆవేదనతో ప్రశ్నించారు. జనసేన కార్యకర్తపై శ్రీకాళహస్తి సీఐ దాడి చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పుకొచ్చారు. మరి సూళ్లూరుపేటలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అదే పని చేసిన ఎస్ఐ, సీఐలపై ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిలదీస్తున్నారు. సూళ్లూరుపేట సీఐ, ఎస్ఐలపై చర్యలు తీసుకోకపోతే వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారంతా హెచ్చరించడం గమనార్హం.