గుజరాత్ జట్టుకు కెప్టెన్ హోదాలోని హార్దిక్ పాండ్యాను ముంబై తిరిగి తమ జట్టులోకి రప్పించుకుంది. మరి ఇది రోహిత్ శర్మను సాగనంపడానికే అని అనుకోవాలి.
గతంలో అంబానీల జట్టుకే ప్రాతినిధ్యం వహించిన హార్దిక్ పాండ్యాకు 15 కోట్ల రూపాయల సీజన్ ఫీజుతో ముంబై జట్టు గుజరాత్ జట్టు నుంచి తీసుకుంది. మరి ఆల్రెడీ కెప్టెన్ హోదాలో ఉండిన పాండ్యా తిరిగి రోహిత్ కెప్టెన్సీలో ఆడటానికి రాకపోవచ్చు అనే అభిప్రాయాలు మాజీల నుంచి వినిపించాయి. అయితే అలాంటి విశ్లేషణలకు భిన్నంగా పాండ్యా ముంబై జట్టుతో చేరుతున్నాడు. బహుశా భవిష్యత్తులో కెప్టెన్సీ హామీని పొంది ఉండొచ్చు కాబోలు!
ఇక పాండ్యాను తీసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిన ముంబై జట్టు ఇదే సమయంలో తాము భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన కామరన్ గ్రీన్ ను వదులుకుంది. 17.5 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్న ఇతడిని ముంబై వదులుకుంది. ఇదే సమయంలో గ్రీన్ ను తీసుకోవడానికి బెంగళూరు ఉత్సాహం చూపించింది. భారీ ధర అయినప్పటికీ.. అతడిని వేలంలోకి వదలకుండా.. బెంగళూరు జట్టు అదే బేరానికి గ్రీన్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఐపీఎల్ వేలం ఈ డిసెంబర్ 19న దుబాయ్ లో జరగనుంది. ఇంతలో ప్రాంచైజ్ లో ఆటగాళ్ల బదిలీల అవకాశాలను చూసుకుంటున్నాయి. గ్రీన్ ను వదలుకోవడం ద్వారా ముంబై జట్టుకు హార్దిక్ కు 15 కోట్లను వెచ్చించడానికి అవకాశం లభించింది. ఇంతటితో ఐపీఎల్ వచ్చే సీజిన్ కు సంబంధించి, రీటెయిన్ చేసుకోవడం వదులుకోవడానికి గడువు దాదాపు ముగిసింది. పాండ్యా, గ్రీన్ డీల్స్ విషయంలో బీసీసీఐ ఆమోదం ఉన్నట్టే అని వార్తలు వస్తున్నాయి.