ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత సంజీవనిలాగా మారదగినటువంటి ప్రత్యేకహోదా అనే అంశం.. ప్రజల మనసుల్లోంచి, ఆలోచనల్లోంచి, పోరాటాల్లోంచి ఎన్నడో కనుమరుగు అయిపోయింది. ఏ ఒక్క పార్టీని కూడా ప్రత్యేకంగా నిందించాల్సిన అవసరమే లేదు. అన్ని పార్టీలూ కలిసి చాలా సమర్థంగా ప్రత్యేకహోదా డిమాండును మంటగలిపేశాయి.
ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారు చూసుకున్నారు తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదు. ప్రధానిగా నరేంద్రమోడీ ఉండగా.. ఏపీకి ప్రత్యేకహోదా రావడం అనేది కల్ల అని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్న పార్టీలు.. చాలా కన్వీనియెంట్ గా దానిని పక్కన పెట్టేశాయి. ఇన్నాళ్లకు ఏపీలో ఒక పార్టీ నుంచి.. ఆ హోదా గురించిన డిమాండ్ వినిపిస్తోంది. బలహీనమైన స్వరమే అయినప్పటికీ.. వారు ప్రత్యేకహోదా డిమాండును గుర్తు చేస్తున్నారు. ఆ పార్టీ కాంగ్రెస్! వారిప్పుడు ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం చేస్తున్న మోసాన్ని గుర్తుచేస్తూ.. ప్రధానికి మోడీకి లేఖలు రాయడం ద్వారా వార్తల్లోకి వచ్చారు.
నిజానికి కాంగ్రెస్ కు ఏపీలో అస్తిత్వం లేదు. వారు కూడా తామేదో అద్భుతాలు చేసేస్తాం అనడం లేదు. తమను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తే ప్రత్యేకహోదా వస్తుందని ప్రగల్భాలు పలకడం లేదు. రాష్ట్రంలో తమ బలహీనత పట్ల స్పష్టతతోనే ఉన్నారు. అందుకే.. రాష్ట్రంలో తమ మనుగడను కాపాడుకునే మాటలు చెప్పకుండా, రాష్ట్రంలో తమకు ఓట్లు వేయాలనే మాట చెప్పకుండా.. ప్రధాని మోడీకి జరిగిన మోసం గురించి లేఖ రాసి, రాహుల్ ప్రధాని అయితే చాలు.. ప్రత్యేకహోదా వస్తుందనే మాట ఇస్తున్నారు.
కేంద్రంలోని బిజెపి సర్కారుకు వ్యతిరేకంగా ఏపీలో ఏ ఒక్క పార్టీ కూడా ఏ మాటా మాట్లాడలేని స్థితిలో ఉండగా.. కాంగ్రెస్ తరఫున గిడుగు రుద్రరాజు తదితర నాయకులందరూ కలిసి.. రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. అంబేద్కర్ కు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బిజెపి వైఖరిని, రాష్ట్రానికి జరుగుతన్న ద్రోహాన్ని ప్రస్తావించారు. రైల్వేజోన్, పోలవరం పూర్తి లాంటి అణగదొక్కిన, పక్కన పెట్టిన అనేక హామీలను గుర్తుచేశారు. రాష్ట్ర పర్యటనకు ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలని అంటున్నారు.
ఏపీలో దాదాపుగా పడకేసిన కాంగ్రెసు పార్టీ.. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది కావొచ్చు. కానీ వారి ప్రశ్నలు సహేతుకకమైనవి అనడంలో సందేహం లేదు. ప్రత్యేకహోదా అంశాన్ని చట్టం ముసాయిదాలో పొందుపరచకుండా ద్రోహం చేసినప్పటికీ.. ఇప్పుడు ప్రశ్నించడానికి వారికి హక్కు లేదని అనలేం.
కాంగ్రెసు డిమాండు చేసినది గనుక.. పట్టించుకోకుండా ప్రధాని మోడీ మౌనం పాటించవచ్చు. ఏపీ ప్రజలు అసహ్యించుకున్నా ఈ రాష్ట్రంలో తమ పార్టీ ఎదగకపోయినా పర్లేదని సరిపెట్టుకోవచ్చు. కానీ.. ఆయన తిరుమల దేవుడి దర్శనానికి వస్తున్నారు. ఆ దేవుడి పాదాల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట గురించి కనీసం దేవుడికైనా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ సంగతి బిజెపి వారుతెలుసుకోవాలి.