పోస్టల్ బ్యాలెట్లపై పెద్ద కుట్ర నడుస్తోందా?

2018 తెలంగాణ ఎన్నికల సందర్భం ఎవరికైనా గుర్తుంటే.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. అప్పట్లో కౌంటింగ్ మొదలు కాగానే.. తొలుత పోస్టల్ బ్యాలెట్లను ఎంచారు. మేగ్జిమమ్ భారాసకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి.…

2018 తెలంగాణ ఎన్నికల సందర్భం ఎవరికైనా గుర్తుంటే.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. అప్పట్లో కౌంటింగ్ మొదలు కాగానే.. తొలుత పోస్టల్ బ్యాలెట్లను ఎంచారు. మేగ్జిమమ్ భారాసకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. అప్పటినుంచి ఇప్పటిదాకా పోస్టల్ బ్యాలెట్లువేసే ఉపాధ్యాయులు, పోలీసులు తదితర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరంగా తెలంగాణ సర్కారు ఎలాంటి మంచి చర్యలు తీసుకుంది? సరిగ్గా గమనిస్తే ఒక్కటి కూడా కనిపించదు.

గతంలోనే వ్యతిరేకించిన వారు.. ఇప్పుడు ఈ సర్కారును ప్రేమించడానికి ఒక్కటంటే ఒక్క కొత్త కారణం లేదు. పైగా డీఏలు ఆపేశారని, తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నారని, తమకు అందవలసిన మొత్తాలను పీఎఫ్ ఖాతాలకు పంపేస్తూ మోసం చేస్తున్నారని రకరకాల కొత్త ఆరోపణలు కూడా ఈ ప్రభుత్వం మీద ఉద్యోగ వర్గాల్లో ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఈసారి పోస్టల్ బ్యాలెట్ లు గతంలో కంటె ఎక్కువగా..కేసీఆర్ వ్యతిరేకతనే చాటే అవకాశం ఉంది. అందుకే కాబోలు.. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ లను అందించడంలోనే రకరకాల మతలబులు చేస్తున్నారు. సగం మందికి పైగా ఇంకా పోస్టల్ బ్యాలెట్లే అందలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

టీచర్లు, ఇతర ఉద్యోగుల నుంచి వారు ఏ నియోజకవర్గాలకు చెందిన వారో వివరాలు తెలుసుకునే పత్రాలను, వారి చిరునామాలను చాలా కాలం కిందటే ప్రభుత్వం తీసుకుంది. ఆ మేరకు వారి నియోజకవర్గాలకు చెందిన బ్యాలెట్ పేపర్లను వారికి పోస్టు ద్వారా పంపేయాలి. వారు దానిని భర్తీచేసి అందజేస్తారు. అలాకాకుండా, పోలింగ్ శిక్షణలు జరిగిన సమయంలో కూడా అక్కడకు వచ్చిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది.

ఈ రెండు రకాల ప్రయత్నాల్లోనూ ప్రభుతవం, ఎన్నికల సంఘం సిబ్బంది దారుణంగా విఫలం అయ్యారు. చాలా వారాల కిందట ఉద్యోగుల అడ్రసు, ఇతర వివరాలు తీసుకున్నప్పటికీ.. వారికి ఇప్పటిదాకా పోస్టల్ బ్యాలెట్లు పోస్టు ద్వారా పంపబడలేదు. శిక్షణకు వచ్చినవారికి కూడా కొందరికే పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చ చేతులు దులుపుకున్నారు.

ఉద్యోగ వర్గాల్లో చాలా వ్యతిరకత వ్యక్తం కావడంతో.. ఏదో కంటితుడుపులాగా మరో చర్య ప్రారంభించారు. ఆది సోమ వారాల్లో జిల్లా పరిషత్ కార్యాలయానికి వచ్చి.. పోస్టల్ బ్యాలెట్ తీసుకోవచ్చునని.. ఒక మాట చెప్పారు. నిజానికి ఆది, సోమ వారాలు రెండు రోజులూ కూడా ప్రభుత్వ కార్యాలయాలకు, టీచర్లకు సెలవు రోజు. అంటే సెలవురోజుల్లో జడ్పీ ఆఫీసుకు రమ్మనడం ద్వారా వారిని మరికొంత అదనపు ఇబ్బందికి గురి  చేయడానికి ప్రయత్నించారు.

దీనితో అసలే ప్రభుత్వం పట్ల వ్యతిరకత ఉన్న వారు విసిగి, వాటి గురించి పట్టించుకోకుండా వదిలేస్తారని.. కొంతలో కొంత మేరకు అయినా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే ఓట్లు అసలు పోల్ కాకుండా పక్కకు తప్పించవచ్చునని భారాస అనుకూల కుట్ర జరిగినట్టుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.