తెలుగుదేశం పార్టీ చినబాబు నారా లోకేష్ యువగళం పాదయాత్రను పునః ప్రారంభించబోతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబునాయుడును అరెస్టు చేసిన నేపథ్యంలో.. తనను కూడా అరెస్టు చేస్తారని భయపడిన నారా లోకేష్.. పాదయాత్రను అర్థంతరంగా ముగించుకుని వచ్చేశారు.
అప్పటినుంచి.. అప్పుడప్పుడూ మీడియా ముందు కనిపిస్తూ, లాయర్లతో మంతనాల పేరిట సుదీర్ఘకాలం అజ్ఞాతంలో గడుపుతూ రకరకాలుగా వ్యవహరిస్తున్నారు. ఇలా 79 రోజుల గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మళ్లీ ప్రారంభించడానికి కూడా ఒక మంచి ముహూర్తం నిర్ణయించుకున్నారు. సోమవారం ఉదయం 10.19 గంటలకు ఆయన తిరిగి నడక ప్రారంభిస్తారట.
గతంలో తూర్పుగోదావరి జిల్లా పొదలాడ వద్ద లోకేష్ పాదయాత్ర ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి అదే చోటు నుంచి ప్రారంభిస్తున్నారు. కాకపోతే గతంలో గతంలో ప్లాన్ చేసిన విధంగా కాకుండా పాదయాత్ర కురచ అయిపోయింది. ప్రారంభించిన సమయంలో.. కుప్పం నుంచి ఇచ్ఛాపురం దాకా సాగించేలాగా అనుకున్నారు.
అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయాత్రను విశాఖపట్నంలోనే ముగించబోతున్నారు. మూడు రాజధానులను తెలుగుదేశం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తీవ్రమైన ప్రతికూల పవనాలు ఉన్నాయి. నారా లోకేష్ పాదయాత్రలో రసాభాస అయ్యే ప్రమాదం ఉందని ఆ పార్టీ వారికే భయం ఉంది. అందుకే చంద్రబాబునాయుడు అరెస్టు, ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయని సాకులు చూపి పాదయాత్రను విశాఖలోనే ముగించాలని అనుకుంటున్నారు.
అలాగే యువగళం పాదయాత్ర యొక్క లక్ష్యాలు కూడా మారిపోతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ప్రజల కష్టాలు తెలుసుకోవడం, పార్టీకి సమగ్రమైన మేనిఫెస్టో రూపొందించడం, అన్ని ప్రాంతాల్లో పాదయాత్ర ద్వారా.. అందరి సమస్యలను తెలుసుకోవడం లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు దాని బదులుగా.. చంద్రబాబునాయుడు అరెస్లు గురించి అన్ని ప్రాంతాల్లో ప్రజలకు చెప్పడం, వారి సానుభూతి పొందడానికి ప్రయత్నించడం, ప్రభుత్వం మీద నిందలు వేయడం మాత్రమే లక్ష్యాలుగా మార్చుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
లోకేష్ పాదయాత్ర పూర్తిస్థాయిలో..జగన్ ను తిట్టడం మీదనే సాగబోతున్నదని.. ప్రజల నుంచి కష్టాలు తెలుసుకోవడం ఇక సెకండ్ ప్రయారిటీగా మారుతుందని అంటున్నారు.
అయినా.. చంద్రబాబునాయుడు అరెస్టు అక్రమం అని నిజంగా ప్రజలు నమ్మేట్లయితే.. ఈపాటికే అది ప్రజల్లోకి వెళ్లిపోయి ఉండాలి. ఇప్పుడు ప్రత్యేకంగా లోకేష్ మళ్లీ అదే పాట పాడితే ప్రజలకు చిరాకు కలుగుతుంది తప్ప మరో ప్రయోజనం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.