మోడీ ఆయనకు ఏం బిస్కట్ వేశారో?

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చాలాకాలం తర్వాత ఇప్పుడు రాజకీయంగా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. చాలా చురుగ్గా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మాదిగలందరూ కూడా ఈ ఎన్నికల్లో బిజెపికి ఓటు…

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చాలాకాలం తర్వాత ఇప్పుడు రాజకీయంగా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. చాలా చురుగ్గా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మాదిగలందరూ కూడా ఈ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయాలని ఆయన చాలా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. దశాబ్దాలుగా మాదిగ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తూ ఉండగా, కాంగ్రెస్ పార్టీ తమను వంచించిందని, తమ ఉద్యమాన్ని అణచివేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ఆ రెండు పార్టీలకు ఓట్లు వేయవద్దని మంద క్రిష్ణ విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రధాని మోడీ మాట ఇచ్చారు గనక.. ఈసారి మాదిగ రిజర్వేషన్ ఖాయం అని ఆయన ప్రతి చోటా చెబుతున్నారు. కానీ ఇక్కడ సామాన్యులకు కలుగుతున్న సందేహాలు అనేకం ఉన్నాయి. ప్రధాని మోడీ మాట ఇచ్చారు సరే.. కానీ ఆయన మాట మీద నిలబడే వ్యక్తేనా? అనేది తొలి సందేహం. 

విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానని, అయిదు కాదు పదేళ్లపాటు హోదా ఇస్తాం అని మోడీ చాలా ఘనంగా ప్రకటించారు. ఆ ప్రజలకు మాట ఇచ్చారు. కానీ అస్సలు నిలబెట్టుకోలేదు. ఆ విషయంలో ఏపీని అనేక రకాలుగా వంచించారు. అలాంటిది మాదిగరిజర్వేషన్ విషయంలో మోడీ మాటను గుడ్డిగా నమ్మితే దెబ్బతింటాం కదా అనే అనుమానం కొందరిలో ఉంది. 

ఎస్సీ వర్గీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి కమిటీ ఏర్పాటుచేసినందుకు కృతజ్ఞతలు చెప్పడం ఓకే. కానీ అది ఫలితం ఇచ్చేది ఎప్పటికి అనే అనుమానం కూడా పలువురికి ఉంది. ఒకవేళ మోడీకి అంత చిత్త శుద్ధి ఉండి మాట నిలబెట్టుకునే వ్యక్తి అయినా కూడా.. కావలిస్తే.. లోక్ సభ ఎన్నికల్లో వేస్తే సరిపోతుంది కదా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు.

మోడీని వేనోళ్ల శ్లాఘిస్తున్న మంద క్రిష్ణకు కేవలం వర్గీకరణ గురించిన ఆయన హామీ మాత్రమే రుచించిందా? లేదా, ఇంకా ప్రత్యేకంగా ఆయనకు ప్రెవేటు హామీ ఏమైనా ఇచ్చారా? ఆ బిస్కట్ కు పడిపోయి.. పదేపదే మోడీ భజనచేస్తున్నారా? అనే అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి.

ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ సంగతేమో గానీ.. మొత్తం కులపరమైన రిజర్వేషన్లలోనే క్రీమీ లేయర్ తేవాలని అనుకుంటున్న మోడీ సర్కారు మూడోసారి గద్దె ఎక్కితే.. ఆ పని తప్పకుండా చేస్తుందని .. మాదిగలకు జరుగుతున్న అన్యాయం కూడా దారి ద్వారా సవరింపబడుతుందని చెప్పేస్తారేమోనని కొందరి భయం. క్రీమీలేయర్ ను అమల్లోకి తెస్తే దానిని కూడా హర్షించడానికి మంద క్రిష్ణ సిద్ధమేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.