దారుణాతి దారుణమైన విషయం ఇది. ఒకే కుటుంబంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఏడుగురు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘోరం గుజరాత్ లో జరిగింది.
సూరత్ లోని ఓ ఇంట్లో ముగ్గురు పిల్లలతో సహా, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఏకకాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్లలో ఆరుగురు విషం తీసుకొని చనిపోగా, మరొకరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
మనీష్ సోలంకి ఫర్నిచర్ వ్యాపారం చేస్తాడు. అతడి దగ్గర వడ్రంగులు, ఇతర కార్మికులు కలిపి దాదాపు 35 మంది పనిచేస్తారు. ఈ రోజు ఉదయం అతడి ఉద్యోగులు కొంతమంది మనీష్ ను సంప్రదించడానికి ప్రయత్నించారు. అయితే అతడి ఫోన్ ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు.
దీంతో కొంతమంది ఉద్యోగులు అతడి ఇంటికి వెళ్లి తలుపుకొట్టారు. అయితే ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు ఇంట్లోంచి దుర్వాసన కూడా రావడంతో ఇంటి వెనక వైపు నుంచి కిటికీ పగులకొట్టి ఇంట్లోకి వెళ్లి చూశారు. అక్కడున్న పరిస్థితి చూసి ఉద్యోగులు నిర్ఘాంతపోయారు.
మనీష్ సోలంకి భార్య రీటా, తండ్రి కాను, తల్లి శోభ, ముగ్గురు పిల్లలు దిశ, కావ్య, కుశాల్ విషం తిని ఆత్మహత్య చేసుకోగా.. మనీష్ మాత్రం ఉరేసుకొని కనిపించాడు. ఇంట్లోంచి సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక నష్టాల గురించి ఆ ఉత్తరంలో ప్రస్తావించాడట సోలంకి. అయితే పోలీసులు మాత్రం ఆత్మహత్యకు కారణాల్ని ఇంకా వెల్లడించలేదు.