సంక‌ల్ప బ‌లం ఏదీ లోకేశ్‌!

ఒక మంచి కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టే ముందు… ఎవ‌రైనా శుభ ముహూర్తం చూసుకుంటారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే అడుగులు ముందుకేస్తారు. నారా లోకేశ్ యువ‌గ‌ళం పేరుతో కుప్పం నుంచి పాద‌యాత్ర చేయ‌డానికి జ‌య‌రామ్‌రెడ్డి అనే కుటుంబ…

ఒక మంచి కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టే ముందు… ఎవ‌రైనా శుభ ముహూర్తం చూసుకుంటారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే అడుగులు ముందుకేస్తారు. నారా లోకేశ్ యువ‌గ‌ళం పేరుతో కుప్పం నుంచి పాద‌యాత్ర చేయ‌డానికి జ‌య‌రామ్‌రెడ్డి అనే కుటుంబ ఆప్తుడు ముహూర్తాన్ని ఖ‌రారు చేశారు. చంద్ర‌బాబు కుటుంబంలో ఏ శుభ‌కార్యానికైనా జ‌య‌రామ్‌రెడ్డే ముహూర్తాలు పెడుతుంటార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

కేవ‌లం ముహూర్త బ‌లాలే ముందుకు న‌డిపిస్తాయ‌ని అనుకుంటే అంత‌కు మించిన అజ్ఞానం వుండ‌దు. ఆయా వ్య‌క్తుల్లో సంక‌ల్పం బ‌లం వుండాలి. అది లేన‌ప్పుడు ఎంత మంచి ముహూర్తంలో శ్రీ‌కారం చుట్టినా ప్ర‌యోజ‌నం వుండ‌దు. చంద్ర‌బాబు అరెస్ట్‌తో ఆగిపోయిన లోకేశ్ పాద‌యాత్ర తిరిగి పునఃప్రారంభం కానుంది.

తాజాగా మ‌రోసారి ముహూర్తాన్ని ఖ‌రారు చేశారు. ఈ నెల 27న కార్తీక సోమ‌వారం ఉద‌యం 10.17 గంట‌ల‌కు యువ‌గ‌ళం పాద‌యాత్ర ఆగిన ప్రాంతం కోన‌సీమ జిల్లా రాజోలు మండ‌లం నుంచే లోకేశ్ తిరిగి అడుగులు వేయ‌నున్నారు. నారా లోకేశ్ పాద‌యాత్ర మొద‌లు పెట్టిన రోజు నంద‌మూరి తార‌క‌ర‌త్న గుండెపోటుకు గురై, బెంగ‌ళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అప్పుడు కూడా పాద‌యాత్ర ముందుకే సాగింది.

అయితే స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబును ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 9న అరెస్ట్ చేయ‌డం, అదే రోజు లోకేశ్ పాద‌యాత్ర ఆగ‌డం తెలిసిందే. బాబు అరెస్ట్‌తో టీడీపీని న‌డిపే బాధ్య‌త‌ల్ని లోకేశ్ భుజాన వేసుకుని వుంటే ఆయ‌న‌కు క్రేజ్ వ‌చ్చేది. కానీ లోకేశ్ అలా చేయ‌లేదు. త‌న‌ను కూడా అరెస్ట్ చేస్తార‌నే భ‌యంతో ఢిల్లీకి ప‌లాయ‌నం చిత్త‌గించారు. దీంతో అంత వ‌ర‌కూ పాద‌యాత్ర ద్వారా తెచ్చుకున్న ఇమేజ్ అంతా పోయింది.

ఇప్పుడు మ‌ళ్లీ పాద‌యాత్ర‌ను పూర్తి చేస్తాన‌ని ముందుకు రావ‌డం విశేషం. పాద‌యాత్ర ఎలా సాగాలి? ఎన్నాళ్లు చేయాల‌నే విష‌య‌మై ఇంకా స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌ధ్య‌లోనే పాద‌యాత్ర‌ను ఆపేశాడ‌నే చెడ్డ‌పేరు రాకుండా ఉండేందుకే లోకేశ్ అడుగులు ముందుకేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. అంతే త‌ప్ప ఆయ‌న‌కంటూ ఒక ల‌క్ష్యం లేకుండా పోయింది. అందుకే ముహూర్త బ‌లం కంటే సంక‌ల్ప బ‌లం ముఖ్య‌మ‌ని పెద్ద‌లు చెబుతారు. లోకేశ్‌లో అదే లోపించింది. అందుకే ఆయ‌న పాద‌యాత్ర చివ‌రికి గ‌మ్యం లేని ప్ర‌యాణ‌మైంది.