గులాబీల నమ్మకం సడలిపోతోందా?

కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి.. చాలా కాలం అయింది. కొన్ని చోట్ల ప్రకటించిన వారిని మార్చి మరొకరికి బీఫారాలు కేటాయించడం కూడా పూర్తయి చాలా రోజులు గడిచింది. అందువలన నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఏవైనా…

కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి.. చాలా కాలం అయింది. కొన్ని చోట్ల ప్రకటించిన వారిని మార్చి మరొకరికి బీఫారాలు కేటాయించడం కూడా పూర్తయి చాలా రోజులు గడిచింది. అందువలన నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఏవైనా రేగి ఉంటే.. వారు అప్పుడే పార్టీని వీడి వెళ్లిపోయి ఉండాలి. లేదా, ఇన్ని రోజుల వ్యవధిలో వారిని పార్టీ బుజ్జగించి ఉండాలి. ఆ రెండూ జరగకుండా.. ఇన్న రోజుల తర్వాత- మరో వారంలో పోలింగ్ ముగిసిపోతుందనగా.. బిఆర్ఎస్ కు చెందిన కీలక నాయకులు.. పార్టీ మారుతున్నారంటే ఆ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలి. 

భారాస ఓటమి బాటలో ఉన్నది గనుక.. ఆ పార్టీలోని వారు ఈ చివరి క్షణాల్లో కూడా సేఫ్టీజోన్ వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారని అనుకోవాలా? పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ఆలంపూర్ నియోజకవర్గ సిటింగ్ ఎమ్మెల్యే.. మళ్లీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించినప్పటికీ.. బీఫారం పొందలేకపోయిన అబ్రహాం తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తెలంగాణ ఎన్నికల్లో భాజపా స్థానం ఏమిటి అనేది ఇప్పుడు పెద్దగా చర్చ జరగడం లేదు. పోటీ ప్రధానంగా భారాస- కాంగ్రెసు మధ్యనే నడుస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య గెంతులాట కూడా ముమ్మరంగానే జరుగుతోంది. 

కాంగ్రెసు నాయకులను భారాసలో చేర్చుకుంటూ.. ఆ పార్టీ మీద సొంత వారికే నమ్మకం లేకుండా పోతున్నదంటూ.. గులాబీ దళాలు ఒకవైపు ప్రచారం చేసుకుంటున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ కూడా అలాంటి పనేచేస్తోంది. ఆ ఫలితమే.. ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం.. ఎన్నికలకు వారం ముందు కాంగ్రెసులో చేరడం. ఈ గెంతులాట ఉభయ పార్టీల్లోనూ జరుగుతున్నప్పటికీ.. ఏ స్థాయి నాయకులు వలస వెళుతున్నారనేది కీలకంగా గమనించాలి. 

సిటింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించారు సరే.. అసంతృప్తితో పార్టీని ధిక్కరించదలచుకుంటే ఆయన ఆరోజునే వెళ్లిపోవాలి. కానీ.. ఇన్నాళ్ల తర్వాత వెళ్లడం గమనిస్తే.. రాష్ట్రంలో ప్రజాదరణ గాలి మారుతోందని, అందుకే ఆయన జాగ్రత్త పడ్డారని ప్రజలు అనుకోవడంలో వింత లేదు.

భారత రాష్ట్ర సమితి గెలుస్తుందని, మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఆ పార్టీవారిలో సడలిపోతోందా? అనే అభిప్రాయం విశ్లేషకుల్లో కలుగుతోంది. అదే జరిగితే పార్టీకి పెద్ద నష్టమే తప్పదు. రెండు రకాలుగా ఈ నష్టం ఉంటుంది. అబ్రహాం లాంటి సిటింగ్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వలన.. కాంగ్రెస్ అనుకూల పవనాలు బలంగా ఉన్నాయని ప్రజలు అనుకుని అటు మొగ్గే అవకాశం ఉంటుంది. అలాగే.. భారాసలోనే ఉన్న అనేక మంది నాయకులు కూడా.. కాంగ్రెస్ అనుకూల పవనాల్ని గమనించి.. వారికి ఫేవర్ చేసే అవకాశం ఉంది. 

అంటే.. భారాసలోనే ఉంటూ.. కాంగ్రెస్ తో తెరవెనుక ఒప్పందాలు చేసుకుని.. అక్కడి నుంచే హస్తం కోసం పనిచేయడం.. గెలిచిన తర్వాత.. తగిన ప్రత్యుపకారాన్ని ఆశించడం జరుగుతుంది. అబ్రహాం భారాసలో టికెట్ దక్కించుకోలేకపోయారు. అలాగని ఈ సమయంలో  కాంగ్రెసులో చేరినా సరే.. ఆయనకు భవిష్యత్తులోనైనా టికెట్ గ్యారంటీ తక్కువే. అయినా పార్టీ మారారంటే దాని అర్థం.. భారాస మళ్లీ గెలిచే చాన్సు లేదని మాత్రమే అని ప్రజలు భావిస్తున్నారు.