ఏదేదో మాట్లాడుతున్న ఎర్ర నారాయణ!

కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు నారాయణ ఒకవైపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉంటూ మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద తన అక్కసు వెళ్ళగక్కుతున్నారు. వందల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును అడ్డంగా…

కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు నారాయణ ఒకవైపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉంటూ మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద తన అక్కసు వెళ్ళగక్కుతున్నారు. వందల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును అడ్డంగా స్వాహా చేసిన చంద్రబాబు నాయుడు కు దక్కిన బెయిలు వ్యవహారంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతూ ఉండగా ఆయన జగన్మోహన్ రెడ్డి బెయిలు గురించి ప్రస్తావిస్తున్నారు. పదేళ్లుగా బెయిలు మీద బయట ఉన్న ఏకైక వ్యక్తి జగన్ మాత్రమే అంటూ ఆడిపోసుకుంటున్నారు.

పనిలో పనిగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అరెస్టు వ్యవహారాన్ని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి ముడిపెట్టి తమ వామపక్ష రాజకీయ లబ్ధిని సాధించుకోవడానికి నారాయణ ప్రయత్నిస్తుండడమే తమాషా. సిబిఐ సహా ఎన్నికల సంఘం వంటి కీలక సంస్థలను కేంద్రం తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడిస్తున్నదంటూ విమర్శలు చేయడం వామపక్షాలకు మామూలే. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా భాజపా కుట్ర కారణంగానే జరిగిందని నారాయణ తాజాగా చెబుతున్నారు. 

ఆయన చెబుతున్న భాష్యం ఎలా ఉన్నదంటే.. తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తెలుగుదేశం మద్దతు కోరిందిట. అక్కడ సొంతంగా పోటీచేయడానికి ఎటూ గతిలేని, ధైర్యమూలేని ఆ పార్టీ భాజపాకు మద్దతివ్వడానికి నిరాకరించిందట. అందుకని మోడీ ఆగ్రహించి.. జగన్మోహన్ రెడ్డి ద్వారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేయించారట. ఇలా మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టడానికి నారాయణ తనకు తోచిన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.

వామపక్షాలకు తెలుగుదేశం పార్టీ పల్లకీ మోయాలనే బలమైన కోరిక ఉంది. తమను ఖాతరు చేయకుండా.. పవన్ కల్యాణ్ స్కెచ్ ఫలిస్తే ఏపీలో తెలుగుదేశం ఎక్కడ మళ్లీ భాజపాతోనే పొత్తు పెట్టుకుంటుందో అనే భయం వారికి ఉంది. తెదేపా బిజెపి మధ్య మరోసారి స్నేహం కుదరకుండా చూడడం అనేది వారు తక్షణ కర్తవ్యంగా భావిస్తున్న సంగతి. అందుకోసం.. చంద్రబాబు మీద మోడీ కుట్ర చేస్తున్నట్టుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. 

తెదేపాతో అంటకాగాలనే కోరికతో ఇలాంటి ప్రచారాలు ఎన్ని చేసుకున్నా ఓకే.. అది వారి యిష్టం. కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డిని లాగుతూ.. అర్థం పర్థం లేని నిందలు వేయడమే తమషాగా ఉంది. జగన్ ను అదానీ కలిసిన తర్వాతనే విశాఖ నౌకాశ్రయం, బీచ్ శాండ్ కాంట్రాక్టు వంటివి కేటాయించారని ఇలా రకరకాల ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశంపై ప్రేమను బాహాటంగా చెప్పుకోలేక ఇలాంటి డొంకతిరుగుడు మార్గంలో నారాయణ మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.