కొన్ని విషయాలు వాస్తవాలే కావొచ్చు గాక.. కానీ బయటకు మాట్లాడుకోవడానికి బాగుండదు. వ్యక్తుల ప్రెవేటు విషయాలు మాత్రమే కాదు. రాజకీయాల్లో కూడా అలాంటి కొన్ని నిజాలు ఉంటాయి. అందుకే, నలుగురిలో ఏది మాట్లాడాలి.. ఏది మాట్లాడకూడదు అనే విచక్షణ ప్రతి ఒక్కరికీ ఉండాలి.
రాజకీయ నాయకులకు ఈ మాట అదుపు అనేది మరింతగా ఉండాలి. ఆ బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు.. ప్రజల దృష్టిలో విమర్శలు తప్పవు. ఇప్పుడు కదిరి ఎమ్మెల్యే పివి సిద్ధా రెడ్డికి కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతోంది.
కదిరి ఎమ్మెల్యే ఇంటికి తురకవాండ్లపల్లె అనే చిన్న గ్రామానికి చెందిన ప్రజలు వచ్చారు. తమ గ్రామానికి రోడ్డు అధ్వానంగా తయారైపోయిందని , రోడ్డు వేయించాలని ఎమ్మెల్యేను అడిగారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు.. వారికి వచ్చిన కష్టాలను ఎమ్మెల్యేలకు కాకపోతే మరెవరికి చెప్పుకోగలరు. అలా చెప్పుకోవడానికి వారికి పూర్తి హక్కు ఉంది. అధికారం ఉంది.
అయితే వారి వినతికి ఎమ్మెల్యే స్పందించిన తీరు మాత్రం భిన్నంగా ఉంది. ‘ఒక నెలైనా వృద్ధాప్య పింఛన్లు ఇవ్వకపోతే ఒప్పుకుంటారా? ప్రతి నెలా ఒకటో తారీఖు నాటికి కదిరికే 15 కోట్ల పింఛను సొమ్ము వస్తోంది.. అవి ఆపితే ఇలాంటి రోడ్లను అద్దంలా తయారు చేయవచ్చు.. మొదటి ప్రయారిటీ పింఛన్లకే.. ఆ తర్వాతే ఏదైనా సరే..’’ అని ఆయన సమాధానం చెప్పారు. ఖంగుతినడం గ్రామస్తుల వంతు అయింది.
ఒక రకంగా చూసినప్పుడు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి చెప్పినది నిజమే కావొచ్చు గాక.. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగారు కూడా ఒక సంగతి ఆలోచించాలి. నియోజకవర్గంలో అందరి పెన్షన్లనూ ఒక నెల పాటూ ఆపేస్తే రోడ్లను వేయించగలం అని అంటున్న ఆయన.. తన ఒక్కడి జీతాన్ని కొన్ని నెలల పాటు త్యాగం చేస్తే.. కనీసం ఆయనమీద బోలెడంత ఆశతో వచ్చిన ప్రజల యొక్క ఆ ఒక్క గ్రామానికి రోడ్డు వేయించగలరు కదా? అనేది ప్రశ్న! ఒక నెల జీతం లేకపోతే ఆయన గారి ఇంట్లో పూటకు గడవని పరిస్థితి ఉండదు. కానీ పెన్షను రాకపోతే పూటగడవని నిరుపేదలు ఎంతో మంది ఉంటారు.
కాబట్టి ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు.. నాయకులు వారితో వెటకారాలు, వెటకారాత్మక లాజిక్కులు మాట్లాడడం కరెక్టు కాదు. ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు వున్నాయనో.. రోడ్ల మరమ్మతుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనో ఏదో ఒకటి చెప్పి పంపవచ్చు. కానీ ఇలా మాట్లాడడం కరెక్టు కాదు. దీని వల్ల.. ఆ గ్రామస్తులే కాదు, ఇతర గ్రామాల వారు కూడా ఎమ్మెల్యే తీరును తప్పుబట్టే అవకాశం ఉంటుంది. అలాంటివి కేవలం ఒక్క ఎమ్మెల్యేకే కాదు, పార్టీకి కూడా నష్టం చేస్తాయి. ఆ సంగతి ఆయన తెలుసుకోవాలి.