తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చావోరేవో అన్న రీతిగా సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ విజయం సాధించలేం, ఈలోగా పార్టీ పూర్తిగా కట్టు తప్పిపోతుంది. పార్టీని కాపాడుకోవడం కూడా కష్టం అనే భయం కాంగ్రెస్ నాయకులతో మరింత ఎక్కువగా పనిచేయిస్తోంది.
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పవనాలు కూడా వారికి అధికారం పై ఆశ కలిగిస్తున్నాయి. అనేక సర్వేలలో కాంగ్రెస్ దే విజయం అని వెల్లడవుతోంది. ఇలాంటి సమయంలో.. 12 అసెంబ్లీ స్థానాలు మీద కాంగ్రెస్ పార్టీ మరింత ఘాటుగా ఫోకస్ పెట్టి ఎన్నికల బరిలో పోరాడుతున్నట్లు కనిపిస్తున్నది. ఆ 12 స్థానాలు.. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి ఫిరాయించి అధికార భారాసలో చేరిన వారివే కావడం విశేషం.
2018 ఎన్నికల్లో ఒక మోస్తరుగా సీట్లు సాధించినప్పటికీ ఆ బలాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. పార్టీనుంచి ఏకంగా 12 మంది ఫిరాయించి అధికార పార్టీలో చేరడం.. వారి మీద ఫిరాయింపులు చట్టం ప్రకారం వేటు వేయడానికి బదులుగా.. మంత్రి పదవులు కూడా కట్టబెట్టి కేసీఆర్ అక్కున చేర్చుకోవడం కారణంగా.. కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ ప్రజలలో దెబ్బతినింది.
అప్పటినుంచి ప్రతి సందర్భంలోనూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లయితే అది భారాసకు వేసినట్లే అవుతుందని.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లను కేసీఆర్ నిర్ణయిస్తుంటారని.. వారికి ఎన్నికల ఖర్చులు నిధులను కూడా కేసీఆర్ దొంగ చాటుగా అందజేస్తుంటారని భారతీయ జనతా పార్టీ వేర్వేరు సందర్భాలలో అనేక ఆరోపణలు చేస్తూ వచ్చింది కూడా.
కాంగ్రెస్ టికెట్ మీద గెలిచే నాయకులలో చిత్తశుద్ధి ఉండదని.. అధికారం ఎటు ఉంటే అటు మళ్ళి పోతారని ప్రజలు అనుకోవడానికి ఆ 12 మంది ఫిరాయింపు కారణమైంది. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో ఆ డజను మంది ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించడానికి కాంగ్రెస్ కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. వారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకుండా ఓడించాలని పీసీసీ సారధి రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచార సభలలో పిలుపునిస్తున్నారు.
కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం ఒక లక్ష్యం అయితే.. ఆ 12 మందిని ఓడించడం మరోరక్షంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ తరఫున ఎవరు గెలిచినా బీఆర్ఎస్ లోకి వెళతారనే భాజపా ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు సమర్థంగానే తిప్పికొట్టగలిగారు, గులాబీలతో కుమ్మక్కు అయ్యింది హస్తం కాదు, కమలం మాత్రమే అని ప్రజలను నమ్మించేలా ప్రతి విమర్శలు చేయగలిగారు. ఇప్పుడు గతంలో తమ పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఈ డజను మంది ఎమ్మెల్యేల టీం ను ఓడించే పనిలో ఉన్నారు.