గోబెల్స్ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే చాలు రాజకీయాల్లో చిరస్థాయిగా ఒక వెలుగు వెలిగిపోవచ్చునని బలంగా నమ్మిన నాయకుడు నారా చంద్రబాబునాయుడు. ఒక విషయం నిజమో అబద్ధమో పట్టించుకునే అవసరమే లేదు. తాము చేయదలచుకున్న ప్రచారాన్ని తాము చేసుకుంటూ వెళ్లిపోవడమే.
ఒకే అబద్ధాన్ని, ఒకే దుష్ప్రచారాన్ని పదేపదే సాగించడం ద్వారా.. పదిమందితో చేయించడం ద్వారా ప్రజలను బురిడీ కొట్టించవచ్చు అనేది చంద్రబాబునాయుడు నమ్మిన సిద్ధాంతం. అయితే కాలంచెల్లిన ఇలాంటి ముసలి వ్యూహాలు ఇప్పుడు అంతగా పనిచేయడం లేదు. కానీ, ఆయన అనుచరులు వందిమాగధులు అందరూ అదే పద్ధతుల్ని అనుసరిస్తున్నారు.
చంద్రబాబునాయుడు బెయిలు వ్యవహారంపై ఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి దేశరాజధాని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తన అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి.. చంద్రబాబు 250 కోట్ల మేర ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన వైనం గురించి.. కేసులోని సకల వివరాలను.. గతంలో సీఐడీ చీఫ్ సంజయ్ కూడా ఓసారి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. ఇప్పుడు ఆ వ్యవహారాలపై తెలుగుదేశం నాయకులు గోలగోల చేస్తున్నారు. ఇక్కడి వ్యవహారాల గురించి అసలు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.
తెలుగుదేశం నాయకుడు బొండా ఉమా మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టి మాట్లాడే అధికారం పొన్నవోలుకు ఎక్కడ ఉంది? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలోని తర్కం ఏమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఏ ఊర్లో ప్రెస్మీట్ పెట్టాలో, ఏ ఊర్లో పెట్టకూడదో తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుందా? లేదా, వారిని అడిగి ప్రెస్మీట్ పెట్టాలా? అని ప్రజలు నవ్వుకుంటున్నారు.
హైకోర్టు ఇచ్చిన బెయిలుపై, న్యాయమూర్తుల తీర్పుపై పొన్నవోలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారనేది కూడా తెలుగుదేశం నుంచి ఇంకో ఆరోపణ. న్యాయమూర్తుల తీర్పును ప్రశ్నిస్తారా? పొన్నవోలు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.. అని తెలుగుదేశం వారు రోడ్డునపడి గోల చేస్తున్నారు.
ఒక సీనియర్ న్యాయవాది అయిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అంతగా చట్టాన్ని అతిక్రమించారని తెలుగుదేశానికి అనిపిస్తే వారు ఎంచక్కా కేసు పెట్టవచ్చు. ఏపీ పోలీసులు వారి కేసును పట్టించుకోకపోతే.. కోర్టులోనే కేసు వేయవచ్చు. న్యాయమూర్తి తీర్పు గురించి తన అభిప్రాయాలను న్యాయవాది వెల్లడించడం రాజ్యాంగబద్ధమో కాదో అప్పుడు తేలిపోతుంది. అంతే తప్ప.. వారు అనవసరంగా నోరు పారేసుకోవడం ఎందుకు? అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత.. ఆ తీర్పు అమలు అయి తీరాలి.
అమలు కాకపోతే మాత్రమే అది కోర్టు ధిక్కరణ అవుతుంది. అంతే తప్ప.. కోర్టు తీర్పు గురించి.. భిన్నమైన అభిప్రాయాలు ఉంటే.. ప్రజలెవ్వరూ వాటిని వ్యక్తీకరించడానికి వీల్లేదని.. అందరూ నోరుమూసుకుని పడి ఉండాలని అనడం ఏ రాజ్యాంగం ప్రకారం చెబుతున్నారో తెదేపా వారినే అడగాలి. నిర్దిష్టమైన ఆరోపణలు చేయడానికి గతిలేక.. ఇలాంటి పసలేని విషయాలను పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.