వయసుకు తగ్గ ఫైట్లు అంటే ఇవేనా వైష్ణవ్?

“క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ ఛాలెంజింగ్ గా అనిపించింది. యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి. వాటిని సాధ్యమైనంత మేర సహజంగానే చిత్రీకరించాం. ఫైట్స్ ఎక్కడా ఓవర్ ది బోర్డ్ ఉండవు. కొడితే పదిమంది ఎరిగిపోయే…

“క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ ఛాలెంజింగ్ గా అనిపించింది. యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి. వాటిని సాధ్యమైనంత మేర సహజంగానే చిత్రీకరించాం. ఫైట్స్ ఎక్కడా ఓవర్ ది బోర్డ్ ఉండవు. కొడితే పదిమంది ఎరిగిపోయే తరహా ఫైట్లు ఉండవు. నా వయసుకి తగ్గట్టుగానే ఫైట్లు ఉంటాయి.”

ఆదికేశవ సినిమాకు సంబంధించి విడుదలకు ముందు వైష్ణవ్ తేజ్ ఇచ్చిన ఓపెన్ స్టేట్ మెంట్ ఇది. కట్ చేస్తే, ఈరోజు ఆదికేశవ సినిమా రిలీజైంది. ఫక్తు కమర్షియల్ ఫార్మాట్ లో వచ్చిన ఈ సినిమాలో అడుగడుగునా ఫైట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ కనిపిస్తే పాట, విలన్ కనిపిస్తే ఫైటు అనే టైపులో సాగింది సినిమా.

సినిమా ఫైట్స్ లో వయొలెన్స్ ఘోరంగా ఉంది. ఇప్పటివరకు తెరపై ఎన్నో ఫైట్స్ చూశాం కానీ, ఇంతటి హింసతో కూడిన ఫైట్స్ మాత్రం చూడలేదు. వైష్ణవ్ తేజ్ చెప్పినట్టు ఈ ఫైట్స్ లో ఎక్కడా సహజత్వం లేదు. కలలో కూడా ఊహించని విధంగా ఉంది ఇందులో హింస.

ఒక్కముక్కలో చెప్పాలంటే, ఇందులో తీసిన ఫైట్స్ లో కొన్ని బాలయ్య ఇమేజ్ కు కూడా ఎక్కువే. అలాంటి ఫైట్స్ ను వైష్ణవ్ తేజ్, తన వయసుకు తగ్గట్టు ఉన్నాయని చెప్పడం విడ్డూరం. అసలు వైష్ణవ్ తేజ్ ఎన్ని సినిమాలు చేశాడు.. అందులో యాక్షన్ సినిమాలెన్ని.. అతడికున్న ఇమేజ్ ఏంటి.. లాంటి అంశాల్ని కూడా లెక్కలోకి తీసుకోకుండా ఈ ఫైట్స్ కంపోజ్ చేసినట్టున్నారు.

మాస్-కమర్షియల్ సినిమాల్లో తలలు తెగిపడాల్సిందే అనే మూసకట్టుడు ఆలోచన విధానాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ ఈ సినిమా తీశారు. ఇలాంటి సినిమాలో సహజత్వం ఉందని, ఓవర్ ది బోర్డ్ ఏదీ ఉండదని వైష్ణవ్ చెప్పడం కామెడీగా ఉంది.